యూదేతరులకు పౌలు పరిచర్య, అతని ప్రణాళికలు
తన పత్రికలోని సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన భాగాలను పూర్తిచేసిన పౌలు ఇప్పుడు ప్రత్యేకంగా యూదేతరుల వైపు తిరుగుతున్నాడు. వారు మంచితనంతోనూ, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని గురించిన జ్ఞానంతోనూ నిండి ఉన్నందున ఒకరికొకరు బుద్ధి చెప్పగలరని అతడు నమ్ముతున్నాడు. అయినా యూదేతరులు విశ్వాసులయ్యేలా చేయడానికి దేవుని నుండి పొందిన అపొస్తల బాధ్యతను బట్టి వారికి ధైర్యంగా రాశాడు. ఇప్పుడు వారిని దేవునికి అంగీకారమైన అర్పణగా సమర్పిస్తున్నాడు. తన పరిచర్య విజయాన్ని బట్టి అతడు అతిశయిస్తున్నాడు. క్రీస్తు అతనితో పనిచేస్తూ, పరిశుద్ధాత్మ శక్తితో బలమైన సూచక క్రియలు, అద్భుతాల ద్వారా అతని బోధననూ అతని నియామకాన్నీ ధ్రువపరుస్తున్నాడు. సువార్త ఇంకా తెలియని చోట ప్రకటించాలన్న అతని ఆసక్తి, అది అప్పటికే స్థాపించబడిన రోమాను సందర్శించకుండా అతణ్ణి అడ్డుకుంది. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఇంకేమీ లేకపోవడంతో, స్పెయినుకు వెళ్తూ వారిని చూడాలని, ఆ ప్రయాణంలో వారి సహవాసాన్ని ఆనందించాలని ఆశిస్తున్నాడు. యెరూషలేముకు తాను చేయబోయే ప్రయాణాన్ని ప్రస్తావిస్తున్నాడు. తన ద్వారా విశ్వాసులైన యూదేతరుల చందాలను యెరూషలేములోని యూదు విశ్వాసులకు తీసుకెళ్లి, తద్వారా వారిని పరస్పరం సమాధానపరచాలని ఆశిస్తున్నాడు. యూదేతరులు యూదుల ద్వారా ఆత్మీయ విషయాలను తెలుసుకున్నారు కాబట్టి, భౌతిక విషయాల్లో వారికి తిరిగి సహాయం చేయడానికి బద్ధులై ఉన్నారు. ఆ చందాలను అప్పగించిన తరువాత క్రీస్తు సువార్త వరాలనూ ఆశీర్వాదాలనూ తీసుకొని వారిని సందర్శించాలని అనుకుంటున్నట్లు అతడు మళ్లీ చెబుతున్నాడు. తనను నాశనం చేయాలని చూసే అవిశ్వాసులైన యూదుల నుండి తనకు రక్షణ కలగాలని, తన చందా క్రైస్తవులైన యూదులకు అంగీకారంగా ఉండాలని ఆసక్తితో ప్రార్థించమని వారిని కోరుతున్నాడు. ఆత్మీయ వరాలను పంచుకోవడం ద్వారా ఇరువురూ బలపడేలా వారిని చూడాలన్న తన ఆశతో, తన ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు.
క్రీ.శ. 58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రోమీయులకు రాసిన పత్రిక 15:14–33
14 సోదరులారా, మీరు మంచివారు, సంపూర్ణ జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను. 15 అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. 16 ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రమై, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను. 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు అతిశయ కారణం ఉంది. 18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్కు చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే తప్ప మరి ఇతర విషయాలు మాట్లాడను. 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను. 20 నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలా ప్రకటించాను. 21 దీన్ని గురించి ఇలా రాసి ఉంది,
“ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు,
ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
22 ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది. 23 ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను. 24 కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురు చూస్తున్నాను. 25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు. 27 అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే. 28 నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను. 29 నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
30 సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను. 31 ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా, 32 దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి. 33 సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్.
పౌలు ఫీబేను సిఫారసు చేసి తన స్నేహితులకు వందనాలు తెలియజేస్తున్నాడు
ఈ పత్రికను తీసుకెళ్లిన ఫీబేకు సహాయం చేయాలని పౌలు రోమాలోని క్రైస్తవులకు సిఫారసు చేస్తున్నాడు. తాను ఎంతో ప్రశంసించే అకులకూ ప్రిస్కిల్లకూ, వారి ఇంటిలోని సంఘానికీ వందనాలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు రోమాలో స్థిరపడిన తన క్రైస్తవ స్నేహితుల్లో అనేకమందికి వందనాలు తెలియజేస్తున్నాడు. వారిలో కొందరు బహుశా అతని ద్వారానే విశ్వాసులై ఉండవచ్చు.
రోమీయులకు రాసిన పత్రిక 16:1–16
1 కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారిక అయిన ఫీబేను పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి. 2 మీ దగ్గర ఆమెకు అవసరమైనది ఏదైనా ఉంటే సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకు, ఇంకా చాలామందికి సహాయం చేసింది.
3 క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి. 4 వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి తెగించారు. వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘానికి కూడా అభివందనాలు చెప్పండి. నేను ఒక్కడినే కాదు, యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.
5 ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు. 6 మీకోసం అధికంగా కష్టపడిన మరియకు అభివందనాలు.
7 నాకు బంధువులు, నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు అభివందనాలు. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో విశ్వసించినవారు.
8 ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.
9 క్రీస్తులో మన జత పనివాడైన ఊర్బానుకు, నాకు ఇష్టుడైన స్టాకుకు అభివందనాలు.
10 క్రీస్తులో యోగ్యుడైన అపెల్లెకు అభివందనాలు. అరిస్టొబూలు కుటుంబానికి అభివందనాలు.
11 నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువును ఎరిగిన వారికి అభివందనాలు.
12 ప్రభువులో ప్రయాసపడే త్రుపైనాకు, త్రుఫోసాకు అభివందనాలు. ప్రియమైన పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.
13 ప్రభువు ఎన్నుకున్న రూఫుకు అభివందనాలు, అతని తల్లికి వందనాలు. ఆమె నాకు కూడా తల్లి.
14 అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడా ఉన్న సోదరులకు అభివందనాలు.
15 పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఉన్న పవిత్రులు అందరికీ అభివందనాలు.
16 పవిత్రమైన ముద్దుతో ఒకడికొకడు అభివందనాలు చెప్పుకోండి. క్రైస్తవ సంఘాలన్నీ మీకు అభివందనాలు చెబుతున్నాయి.
విభేదాలు కలిగించేవారికి దూరంగా ఉండండి
విభేదాలకూ వాటిని కలిగించే మనుషులకూ దూరంగా ఉండాలని పౌలు మళ్లీ వారిని హెచ్చరిస్తున్నాడు. అటువంటి వారు లోకసంబంధమైన లాభం కోసమే ఆశపడుతూ, క్రీస్తు బోధను ప్రకటించడం ద్వారా ఆయనకు సేవ చేయరు. వారికి ఆత్మీయ వరాలు లేవు; ఇంపైన మాటలతోనూ ముఖస్తుతితోనూ అనుమానం ఎరుగని కొత్త క్రైస్తవ విశ్వాసుల హృదయాలను మోసగిస్తారు లేదా దారితప్పిస్తారు. వారి ప్రస్తుత విధేయతను బట్టి అతడు సంతోషిస్తున్నాడు. మంచిని వివేచించి ఆచరిస్తూ ఉండాలని, చెడు విషయంలో పవిత్రులుగా లేదా నిర్దోషులుగా ఉండాలని వారిని కోరుతున్నాడు. అంటే, అబద్ధ బోధలన్నిటికీ చెడ్డ మాదిరులన్నిటికీ దూరంగా ఉండాలి. సంఘంలో విభేదాలు కలిగించే సాతాను ప్రతినిధులు త్వరగా నాశనమవుతారని ముందుగా చెప్పి, తన ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు.
రోమీయులకు రాసిన పత్రిక 16:17–20
17 సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు. 19 మీ విధేయత మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి. 20 సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.
వందనాలు, ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి మహిమ
అనుబంధ వాక్యాల్లో పౌలు తనతో ఉన్న పలువురి వందనాలను తెలియజేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం లేకుండానే క్రీస్తు పట్ల నిజమైన విశ్వాసంలో వారిని స్థిరపరచగల శక్తి దేవునికి మాత్రమే ఉందని, ఆయనకు మహిమ చెల్లిస్తూ అన్నిటినీ సంగ్రహిస్తున్నాడు. ఇది ఒకప్పుడు రహస్యంగా ఉంచబడిన మర్మం (యూదేతరుల పిలుపు ముందే తెలియజేయబడినప్పటికీ). అయితే ఇప్పుడు పౌలుకు వెల్లడి చేయబడిన నిత్యుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం ఇది తెలియజేయబడింది. అతని బోధ ద్వారా అన్ని జనాలూ విశ్వాస విధేయతను తెలుసుకొని, విశ్వసించి లోబడాలన్నదే దీని ఉద్దేశం. “ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి యుగయుగాలూ మహిమ కలుగును గాక.”
రోమీయులకు రాసిన పత్రిక 16:21–27
21 నా సహ పనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు. 22 ఈ పత్రికను చేతితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.
23 నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయి మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు. 24 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
25 యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది. 26 నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి. 27 ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.