పౌలు తెస్సలోనికవారికి రాస్తాడు
అవిశ్వాసులైన యూదుల దాడులకు గురవుతున్న తెస్సలోనికవారిని విశ్వాసంలో స్థిరపరచడానికి, క్రైస్తవ మతానికి ఉన్న ఆధారాలను బలంగా వివరించి పౌలు వారికి తన మొదటి పత్రిక రాస్తాడు.
క్రీ.శ. 51
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పౌలు తెస్సలోనికవారికి అభివందనాలు తెలుపుతాడు
పరిచయం, అభివందనం.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 1:1–4
1 తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక!
2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
పౌలు మొదటి వాదన: అద్భుత వరాలు
క్రైస్తవ మతం సత్యమని నిరూపించడానికి పౌలు తన మొదటి వాదనను పరిశుద్ధాత్మ ఇచ్చిన అద్భుత వరాల నుండి తీసుకుంటాడు. క్రైస్తవ విశ్వాసం పట్ల వారి స్థిరమైన నిబద్ధతను బట్టి సంతోషించి, దానిని మెచ్చుకుంటాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 1:5–10
5 ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు.
7 కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు. 8 మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియలో అకయలో వినిపించింది. అంతమాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
9 అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో, 10 పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు.
బోధకుల జీవితాలు సువార్త సత్యమని నిరూపిస్తాయి
సువార్త బోధకుల స్వభావం, ప్రవర్తన, బాధల ద్వారా పౌలు సువార్త సత్యమని నిరూపిస్తాడు. తెస్సలోనికవారు దానిని ఒక తత్వశాస్త్ర విధానంగా కాక దేవుని వాక్యంగా స్వీకరించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు. వారి ప్రవర్తనపై అది చూపిన ప్రభావం ఈ విషయాన్ని వెల్లడించింది.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 2:1–13
1 సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. 2 మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము.
3 ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు. 4 దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము.
5 మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి. 6 ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.
7 పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం. 8 మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
9 సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం. 10 విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడచుకున్నామో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.
11 తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ 12 తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.
13 మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.
యూదుల హింసించే స్వభావం
సువార్త శక్తిని, విశ్వాసులుగా మారినవారి విశ్వాసాన్ని పరీక్షించే యూదుల హింసించే స్వభావాన్ని పౌలు చూపిస్తాడు. యూదేతరులకు సువార్త ప్రకటించడంపట్ల వారి వ్యతిరేకతను, వారి దుష్టత్వాన్ని, వారి నాశనాన్ని చూపిస్తాడు. తెస్సలోనికవారిపట్ల తన ప్రేమను, వారిని చూడాలనే తన కోరికను ప్రకటిస్తాడు. తన ప్రత్యర్థుల హృదయాలపై సాతానుకున్న ప్రభావం మాత్రమే ఆ కోరిక నెరవేరకుండా అడ్డుకుందని చెబుతాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 2:14–20
14 ఎలాగంటే సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.
15 వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు. 16 యూదేతరులకు రక్షణ కలిగించే సువార్తను ప్రకటించకుండా వారు మమ్మల్ని అడ్డుకున్నారు. తమ పాపాలను పెంచుకుంటూ ఉన్నారు. చివరికి దేవుని తీవ్ర కోపం వారి మీదికి వచ్చింది.
17 సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.
18 కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు. 19 ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా! 20 నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.
వారిని బలపరచడానికి పౌలు తిమోతిని పంపుతాడు
పౌలు తెస్సలోనికవారి గురించి తనకున్న ఆందోళనను ప్రకటిస్తాడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికీ, ముందుగా హెచ్చరించినట్లే క్రైస్తవులందరూ ఎదుర్కొనే అనేక శ్రమల్లో వారిని ఆదరించడానికీ తిమోతిని పంపినట్లు వారికి గుర్తుచేస్తాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 3:1–5
1 కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని 2-3 ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం. ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.
4 మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది. 5 అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
తిమోతి నివేదిక పౌలుకు ఆదరణనిస్తుంది
వారి గురించి తిమోతి ఇచ్చిన నివేదిక తనకు ఆదరణనిచ్చిందని పౌలు ప్రకటిస్తాడు. వారిని మళ్లీ చూడటానికి మరో అవకాశం కోసం ఎంతో ఆశపడతాడు. క్రీస్తు రాక వరకు వారు పరిశుద్ధతలో నిలకడగా ఉండాలని ప్రార్థిస్తాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 3:6–13
6 ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి క్రీస్తు పట్ల మీ విశ్వాస ప్రేమలను గురించీ, మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.
7 అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం. 8 ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే. 9 మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం?
10 మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం 11 మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!