పరిశుద్ధతకు, పవిత్రతకు పిలుపు
విశ్వాసులైన యూదేతరులు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని పౌలు వారికి చూపిస్తాడు. వారు ఒకప్పుడు అలవాటుపడి, అన్యమతస్థులు ఇంకా ఆచరిస్తున్న దుర్వ్యసనాల గురించి హెచ్చరిస్తాడు. సహోదర ప్రేమ చూపమనీ, తమ పనిలో శ్రద్ధగా ఉండమనీ వారిని ప్రోత్సహిస్తాడు.
క్రీ.శ. 51
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 4:1–12
1 చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు. 2 మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము. 3 మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం.
4 మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. 7 పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు. 9 సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు. 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
11-12 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
మృతులు ఎలా లేస్తారో పౌలు వివరిస్తాడు
భవిష్యత్తులో పొందబోయే సంతోషాన్ని గురించిన వారి నిరీక్షణను హరించివేసే మతావేశం గల యూదుల విషయంలో పౌలు వారిని హెచ్చరిస్తాడు. చనిపోయినవారు తిరిగి లేవరని నమ్మిన అన్యజనుల్లా, తమ మృతుల గురించి అధిక దుఃఖానికి లోనుకావద్దని వారికి చెబుతాడు. పునరుత్థానమనే గొప్ప సత్యానికి మరింత ఆధారంగా, క్రీస్తు స్వయంగా తనకు బోధించిన ప్రకారం అది ఎలా జరుగుతుందో పౌలు వివరిస్తాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 4:13–18
13 సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17 ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.
క్రీస్తు ఆకస్మిక రాకకు సిద్ధంగా ఉండండి
క్రీస్తు ఆకస్మికంగా, భయంకరంగా ప్రత్యక్షం కావడం, దుష్టులకూ ఆయన రాక దినానికి సిద్ధంగా లేనివారికీ నిశ్చయంగా కలిగే నాశనం ఆధారంగా పౌలు పరిశుద్ధత ఆవశ్యకతను చూపిస్తాడు. సువార్త విశ్వాసంలోనూ దాని ఆచరణలోనూ స్థిరంగా ఉండేవారికి, ఆ దినం యేసు క్రీస్తు ద్వారా రక్షణ దినంగా ఉంటుందనే హామీతో ఆదరణ లభిస్తుంది.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 5:1–11
1 సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. 2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6 కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. 8 విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
తెస్సలోనిక వారికి పౌలు చివరి విజ్ఞప్తులు
తమ ఆత్మీయ బోధకులను తగిన విధంగా గౌరవించాలని పౌలు వారిని కోరుతూ, మరెన్నో హృదయపూర్వక విజ్ఞప్తులు చేస్తాడు. ప్రార్థనలు, అభివందనాలతో ముగిస్తాడు.
తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక 5:12–28
12 సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. 13 వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
14 సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. 15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
19 దేవుని ఆత్మను ఆర్పవద్దు.
20 ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
23 శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
24 మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. 25 సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి. 26 పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. 27 సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను. 28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!
యూదేతరులకు ప్రకటిస్తూ కొరింతులోనే ఉండిపోయిన పౌలు
యూదులు తిరస్కరించడంతో పౌలు కొరింతులోనే ఉండి, యూదేతరులకు ప్రకటిస్తాడు.
6 ఆ యూదులు అతనిని ఎదిరించి దూషించారు. అతడు తన బట్టలు దులుపుకుని, “మీ రక్తం మీ తలమీదే ఉండుగాక. నేను నిర్దోషిని. ఇక నుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాను” అని వారితో చెప్పి 7 అక్కడ నుండి వెళ్ళి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుని ఉంది.
8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిసం పొందారు. 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు.
11 అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.