మోషే నైతిక ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)

క్రీ.పూ. 1451

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ద్వితీయోపదేశ కాండము 8–9

1 “మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి. 2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

3 రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

4 ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు. 5 ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి. 6 ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.

7 ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం. 8 దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం. 9 మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.

10 మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి. 11 ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి. 12 మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు. 13 మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

14 అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

15 బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు. 16 చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. 17 అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

18 కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే. 19 మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. 20 యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”

9:1 “ఇశ్రాయేలూ విను. మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు, ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోడానికి ఈ రోజు మీరు యొర్దాను నది దాటబోతున్నారు. 2 ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. ‘అనాకీయులను ఎవరూ ఎదిరించలేరు’ అనే మాట మీరు విన్నారు కదా.

3 కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు 4 మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరవాత ‘మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు’ అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు.

5 మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోడానికి కారణం మీ నీతి గానీ మీ హృదయంలో ఉన్న యథార్థత గానీ కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు. 6 మీ యెహోవా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయడం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు.

7 ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 8 హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు.

9 ఆ రాతి పలకలు, అంటే యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోడానికి నేను కొండ ఎక్కినప్పుడు, అన్నపానాలు మాని అక్కడ నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను. 10 అప్పుడు యెహోవా తన వేలితో రాసిన రెండు రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి.

11 ఆ నలభై పగళ్లు, నలభై రాత్రుల తరువాత యెహోవా నిబంధన సంబంధమైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించి, 12 ‘నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు’ అని నాతో చెప్పాడు.

13 యెహోవా ఇంకా ‘నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు. 14 నాకు అడ్డం రావద్దు. నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి, నిన్ను వారికంటే బలమైన, విస్తారమైన జనంగా చేస్తాను’ అని నాతో చెప్పాడు.

15 నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి. 16 నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు.

17 అప్పుడు నేను ఆ రెండు పలకలను, నా రెండు చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను. 18 మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను. 19 ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు. 20 అంతేగాక యెహోవా అహరోనుపై కోపపడి, అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను.

21 అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను. 22 అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. 23 యెహోవా ‘కాదేషు బర్నేయలో మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు. 24 నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

25 కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు. 26 నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు. 27 నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు.

28 ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో. 29 నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.”