మోషే నైతిక ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)
క్రీ.పూ. 1451
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 “మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ 2 మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.
3 ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.
4 ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు. 5 నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
6 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.
7 మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.
8 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. 9 మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.
10 మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు. 11 మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.
12 అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి. 13 మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి. 14 మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.
15 మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు. 16 మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. 17 ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.
18 మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని 19 యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.
20 ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు 21 మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు. 22 యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి, 23 తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.
24 మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు. 25 మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”
7:1 “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు.
2 తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు. 3 మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు. 4 ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు.
5 కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి. 6 మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.
9 కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి. 10 ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు. 11 కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి.
12 మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు. 13 ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు.
14 అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. 15 యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు.
16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది.
17 ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో. వారికి భయపడవద్దు. 18 మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు 19 మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు. 20 మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతాడు.
21 కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు. 22 మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు.
23 అయితే మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిని మీకప్పగించి వారిని నాశనం చేసేవరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు. 24 ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు. 25 వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం. 26 దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.”