హిజ్కియా సంస్కరణకు మద్దతునిచ్చే మీకా ప్రవచనాలు

క్రీ.పూ. 722

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీకా 3–5

1 నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా,

ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి.

న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?

2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు.

నా ప్రజల చర్మం ఒలిచేసి

వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.

3 నా ప్రజల మాంసాన్ని తింటారు.

వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు.

ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా

ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని

ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.

4 ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు

కానీ ఆయన వారికి జవాబివ్వడు.

మీరు చెడు పనులు చేశారు.

కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”

5 నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే,

తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు.

భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.

6 అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది.

సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది.

ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు.

పగలు చీకటిగా మారిపోతుంది.

7 అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది.

సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు.

నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.

8 అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ

ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి

యెహోవా ఆత్మమూలంగా

సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.

9 యాకోబు వంశపు ప్రధానులారా,

ఇశ్రాయేలీయుల అధిపతులారా,

ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ

సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.

10 సీయోనును మీరు రక్తంతో కడతారు.

దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.

11 ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు.

వారి యాజకులు కూలికి బోధిస్తారు.

ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు.

అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని

“యెహోవా మన మధ్య ఉన్నాడు గదా,

ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.

12 కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు.

యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది.

మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.

4:1 తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం

పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది.

కొండల కంటే ఎత్తుగా ఉంటుంది.

ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.

2 అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు,

“యాకోబు దేవుని మందిరానికి,

యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి.

ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు.

మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.”

సీయోనులో నుంచి ధర్మశాస్త్రం,

యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.

3 ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు.

దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు.

వారు తమ కత్తులను నాగటి నక్కులుగా

తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు.

రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు.

యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.

4 దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా

తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు.

ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట.

5 ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు.

మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి

ఎప్పటికీ నడుచుకుంటాము.

6 యెహోవా ఇలా చెబుతున్నాడు,

ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను.

అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరికి చేరుస్తాను.

7 కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని

బలమైన ప్రజగా చేస్తాను.

యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి

ఎప్పటికీ వారిని పాలిస్తాను.

8 మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు

పూర్వపు అధికారం వస్తుంది.

యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.

9 మీరెందుకు కేకలు వేస్తున్నారు?

మీకు రాజు లేడా?

మీ సలహాదారులు నాశనమయ్యారా?

అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా?

10 సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా

నొప్పులు పడుతూ కను.

ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి.

బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది.

అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.

11 అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి,

“సీయోను అపవిత్రం అవుతుంది గాక!

దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.” అంటారు.

12 ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు.

ఆయన ఆలోచన అర్థం కాదు.

కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.

13 యెహోవా ఇలా అంటున్నాడు,

“సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు.

మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను.

నీవు అనేక ప్రజల సమూహాలను అణిచేస్తావు.

వారి అన్యాయ సంపదను యెహోవానైన నాకు ప్రతిష్టిస్తాను.

వారి ఆస్తిపాస్తులను సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.”

5:1 యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి.

నీ పట్టణం చుట్టూ గోడ ఉంది.

అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.

2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.

3 కాబట్టి ప్రసవవేదన పడే స్త్రీ, బిడ్డను కనే వరకూ, దేవుడు వారిని అప్పగిస్తాడు.

అప్పుడు ఆయన సోదరుల్లో మిగిలినవారు ఇశ్రాయేలీయుల దగ్గరికి తిరిగి వస్తారు.

4 ఆయన యెహోవా బలంతో

తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో

నిలబడి తన మంద మేపుతాడు.

వాళ్ళు క్షేమంగా ఉంటారు.

భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.

5 అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు,

వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు

వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను,

ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం.

ఆయనే మనకు శాంతి.

6 వారు కత్తితో అష్షూరు దేశాన్ని పాలిస్తారు.

తమ చేతుల్లోని కత్తులతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు.

అష్షూరీయులు మన దేశంలో చొరబడి

మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు

ఆయన మనలను ఇలా కాపాడతాడు.

7 యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక ప్రజల మధ్య నివసిస్తూ,

యెహోవా కురిపించే మంచులాగా,

మానవ ప్రయత్నం, ఆలోచన లేకుండ,

గడ్డి మీద పడే వానలాగా ఉంటారు.

8 యాకోబు సంతానంలో మిగిలినవారు

రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య

అడవి జంతువుల్లోని సింహం లాగా,

గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు.

అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.

9 నీ చెయ్యి నీ శత్రువుల మీద ఎత్తి ఉంటుంది.

అది వారిని నిర్మూలం చేస్తుంది.

10 యెహోవా ఇలా చెబుతున్నాడు,

“ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను.

నీ రథాలను ధ్వంసం చేస్తాను.

11 నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను.

నీ కోటలన్నిటినీ పడగొడతాను.

12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను.

జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు.

13 చెక్కిన విగ్రహాలూ

దేవతా స్తంభాలూ మీ మధ్య ఉండకుండాా నాశనం చేస్తాను.

అప్పటినుంచి మీరు చేతులతో చేసిన వాటికి మొక్కరు.

14 మీ అషేరా దేవతా స్తంభాలను మీ మధ్య ఉండకుండాా వాటిని పెల్లగిస్తాను.

నీ పట్టణాలను పడగొడతాను.

15 నేను మహా కోపంతో ఉగ్రతతో

నా మాట వినని రాజ్యాలకు ప్రతీకారం చేస్తాను.”