హిజ్కియా సంస్కరణకు మద్దతునిచ్చే మీకా ప్రవచనాలు (continued)

క్రీ.పూ. 722

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీకా 6–7

1 యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి.

మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు,

లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు.

నీ స్వరం కొండలు వినాలి.

2 పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు

యెహోవా చేసిన ఫిర్యాదు వినండి.

ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.

3 నా ప్రజలారా, నేను మీకేం చేశాను?

మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి.

4 ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను.

బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను.

మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను.

5 నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన,

బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి.

యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా

షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి.

6 యెహోవాకు నేనేం తీసుకురాను?

మహోన్నతుడైన దేవునికి వంగి నమస్కారం చేయడానికి ఏం తీసుకురాను?

దహనబలులనూ ఏడాది దూడలనూ తీసుకుని నేను ఆయన దగ్గరికి రానా?

7 వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?

నా అతిక్రమానికి నా పెద్ద కొడుకుని నేనివ్వాలా?

నా సొంత పాపానికి నా గర్భఫలాన్ని నేనివ్వాలా?

8 మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.

ఆయన నిన్ను కోరేదేంటంటే,

న్యాయంగా ప్రవర్తించు.

కనికరాన్ని ప్రేమించు.

వినయంగా నీ దేవునితో నడువు.

9 వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు,

ఇప్పటికి కూడా తెలివి నీ పేరును గుర్తిస్తున్నది.

“బెత్తం పట్ల, దాన్ని తన స్థానంలో ఉంచిన వాని పట్ల శ్రద్ధ చూపండి.

10 దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది.

అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.

11 తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?

12 ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.

అక్కడి ప్రజలు అబద్దికులు.

వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

13 కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.

నీ పాపాలను బట్టి నిన్ను నిర్మూలం చేశాను.

14 నువ్వు తింటావు కానీ తృప్తి పడవు.

నీలోపల వెలితిగానే ఉంటుంది.

నువ్వు కూడబెట్టుకుంటావు కానీ అది నీకుండదు.

నువ్వు దాచుకున్నదాన్ని కత్తికి అప్పగిస్తాను.

15 నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు.

నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు

కానీ ఆ నూనె పూసుకోవు.

ద్రాక్షపళ్ళను తొక్కుతావు

కానీ ద్రాక్షారసం తాగవు.

16 ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు.

అహాబు వంశం వాళ్ళు చేసిన పనులన్నిటినీ అనుసరిస్తున్నారు.

వారి సలహాల ప్రకారం నడుస్తున్నారు.

కాబట్టి నీ పట్టణాన్ని నాశనం చేస్తాను.

దానిలో నివసించే వారిని అపహాస్యంగా చేస్తాను.

నా ప్రజలకు రావలసిన అవమానం మీరు పొందుతారు.”

7:1 నాకెంతో బాధగా ఉంది!

వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత,

ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది.

పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు.

అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.

2 భక్తులు దేశంలో లేకుండా పోయారు.

ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు.

హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు.

ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.

3 వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.

అధికారి డబ్బులు అడుగుతాడు.

న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు.

గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు.

ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.

4 వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు.

వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు.

అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు,

మీరు శిక్ష అనుభవించే రోజు.

ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.

5 ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు.

ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు.

నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.

6 కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు.

కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు.

తన సొంత ఇంటివారే తన శత్రువులు.

7 అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను.

రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను.

నా దేవుడు నా మాట వింటాడు.

8 నా పగవాడా, నా మీద అతిశయించవద్దు.

నేను కింద పడినా తిరిగి లేస్తాను.

నేను చీకట్లో కూర్చున్నపుడు

యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.

9 నేను యెహోవా దృష్టికి పాపం చేశాను,

కాబట్టి ఆయన నా పక్షాన వాదించి

నా పక్షాన న్యాయం తీర్చే వరకూ

నేను ఆయన కోపాగ్ని సహిస్తాను.

ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు.

ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.

10 నా శత్రువు దాన్ని చూస్తాడు.

“నీ యెహోవా దేవుడు ఎక్కడ?”

అని నాతో అన్నది అవమానం పాలవుతుంది.

నా కళ్ళు ఆమెను చూస్తాయి.

వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

11 నీ గోడలు కట్టించే రోజు వస్తుంది.

ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి.

12 ఆ రోజు అష్షూరు దేశం నుంచి,

ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి,

ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ

ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు

నీ దగ్గరికి వస్తారు.

13 ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన,

వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.

14 నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు.

కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా

పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.

15 ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా

నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.

16 రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి.

వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు.

వాళ్ళ చెవులు వినబడవు.

17 పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు.

వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు.

భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు.

నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.

18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.

నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.

నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.

19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.

మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.

20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.

పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.

2 రాజులు 18:7–8

7 కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు. 8 ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.