భాగం 10: పెరయలో తరువాతి పరిచర్య

బహుశా క్రీ.శ. 29లోని ప్రతిష్ఠ పండగ నుండి క్రీ.శ. 30లోని చివరి ప్రయాణం వరకు (సుమారు మూడున్నర నెలలు)

యేసు యొర్దాను అవతల ఉన్న బేతనియకు వెళ్లిపోవడం

యేసు యెరూషలేము నుండి యొర్దాను అవతల ఉన్న బేతనియకు వెళ్లిపోతాడు.

పెరయ

క్రీ.శ. 29 నుండి 30 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన సువార్త 10:40–42

10:40 యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే. 41 చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు. 42 అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.

పెరయలో యేసు బోధించడం, హేరోదు గురించి హెచ్చరిక అందుకోవడం

యెరూషలేము వైపు ప్రయాణిస్తూ యేసు పెరయలో బోధిస్తాడు, హేరోదు అంతిపా గురించి హెచ్చరిక అందుకుంటాడు.

లూకా రాసిన సువార్త 13:22–35

13:22 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు. 23 ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. 24 దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను. 25 ఇంటి యజమాని తలుపు వేసుకున్న తరువాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ, ‘అయ్యా, దయచేసి తలుపు తెరవండి’ అని ప్రార్థిస్తే 26 ఆయన, ‘మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు’ అని మీతో అంటాడు. అప్పుడు మీరు, ‘నీ ఎదుటనే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేశావు కదా’ అంటారు. 27 అప్పుడు ఆయన, ‘మళ్ళీ చెబుతున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేసేవారు. నా దగ్గరనుంచి పొండి’ అంటాడు.

28 అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు. 29 ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు. 30 ఇదిగో వినండి, చివరి వారు మొదటి వారవుతారు, అలాగే మొదటివారు చివరి వారవుతారు.”

31 అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి, “నువ్వు ఇక్కడినుంచి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు” అని ఆయనతో చెప్పారు. 32 ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను. 33 అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు.

34 “యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు. 35 ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. ‘ప్రభువు పేరిట వచ్చే వాడు ధన్యుడు’ అని నువ్వు చెప్పేంతవరకూ నన్ను మళ్ళీ చూడవని నీతో కచ్చితంగా చెబుతున్నాను,” అన్నాడు.

ప్రముఖ పరిసయ్యునితో భోజనం చేస్తూ యేసు మళ్లీ స్వస్థపరచడం

ప్రముఖ పరిసయ్యునితో భోజనం (ఉదయపు భోజనం) చేస్తూ యేసు మళ్లీ విశ్రాంతి దినాన స్వస్థపరచి, తన చర్యను సమర్థించుకుంటాడు. ఈ సందర్భం మూడు ఉపమానాలకు దారితీస్తుంది.

బహుశా పెరయలో

లూకా రాసిన సువార్త 14:1–24

14:1 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు. 2 అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు. 3 అప్పుడు యేసు, “విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?” అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు. 4 వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు. 5 “మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా?” అని వారిని అడిగాడు. 6 ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు.

7 ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు, 8 “నిన్ను ఎవరైనా పెళ్ళి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు. 9 మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి, ‘ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు’ అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు. 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.’ అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది. 11 తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.”

12 తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు. 15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, “దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు” అని ఆయనతో అన్నాడు.

16 అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, “ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలా మందిని పిలిచాడు. 17 విందుకు వేళయినప్పుడు అతడు ‘ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి’ అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన సేవకుణ్ణి పంపాడు.

18 అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటివాడు ‘నేనొక పొలం కొన్నాను. వెంటనే వెళ్ళి దాన్ని చూసుకోవాలి. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు. 19 మరొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను’ అన్నాడు. 20 మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు. 21 అప్పుడా పనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు.

దాంతో ఆ యజమాని కోపగించుకుని ఆ సేవకుడితో ‘నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్ళి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా’ అన్నాడు. 22 తరవాత ఆ పనివాడు వచ్చి ‘ప్రభూ, నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ ఇంకా చోటు ఉంది’ అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకుడితో ‘నా ఇల్లు నిండిపోవాలి. కాబట్టి నువ్వు రాజ మార్గాల్లోకీ, కంచెల్లోకీ వెళ్లి అక్కడి వారిని బలవంతంగా తీసుకురా. 24 నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’” అన్నాడు.