అందరూ పశ్చాత్తాపపడాలి, లేకపోతే నశిస్తారు
అందరూ పశ్చాత్తాపపడాలి, లేకపోతే నశిస్తారు (ఆ కాలంలో జరిగిన రెండు విషాద సంఘటనలు). కాయలు కాయని అంజూరపు చెట్టు ఉపమానం.
బహుశా యూదయలో
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లూకా రాసిన సువార్త 13:1–9
13:1 కొందరు గలిలయ ప్రజలు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికులను పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు. 2 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయుల కంటే పాపులని మీరు అనుకుంటున్నారా? 3 కారని మీతో చెబుతున్నాను. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
4 అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా? 5 కానే కాదని మీతో చెబుతున్నా. మీరు మారుమనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.”
6 తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు. 7 దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో, ‘మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను గానీ నాకేమీ దొరకడం లేదు. దీన్ని నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి’ అన్నాడు. 8 అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీన్ని ఉండనియ్యి, 9 అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.”
విశ్రాంతి దినాన అంగవైకల్యమున్న స్త్రీని యేసు స్వస్థపరచడం
విశ్రాంతి దినాన యేసు అంగవైకల్యమున్న ఒక స్త్రీని స్వస్థపరచి, సమాజమందిర నాయకుని అభ్యంతరానికి తన చర్యను సమర్థించుకుంటాడు. ఆవగింజ, పులిసిన పిండి ఉపమానాలను మళ్లీ చెబుతాడు.
లూకా రాసిన సువార్త 13:10–21
13:10 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. 11 బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. 12 యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి 13 ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది.
14 యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు. 15 అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా. 16 ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు.
17 ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
18 ఆయన ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చగలం? 19 అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.”
20 మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? 21 ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిలాగా ఉంది” అన్నాడు.
ప్రతిష్ఠ పండగలో యేసును రాళ్లతో కొట్టడానికి యూదుల ప్రయత్నం
ప్రతిష్ఠ పండగలో యేసు తాను మెస్సీయనని ఇంకా బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడు. యూదులు ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తారు.
ఇక్కడ యోహాను సువార్త మళ్లీ కథనాన్ని కొనసాగిస్తూ, మనలను యెరూషలేముకు, తరువాత పెరయకు తీసుకువెళ్తుంది.
యెరూషలేము
యోహాను రాసిన సువార్త 10:22–39
10:22 ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం. 23 అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా 24 యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
25 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 26 అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు. 27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి. 28 నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు. 30 నేను, నా తండ్రి, ఒకటే!”
31 అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు. 32 యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు. 33 అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు. 34 యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా? 35 లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే, 36 తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా? 37 నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి. 38 అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.” 39 వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు.