ఐగుప్తుకు వ్యతిరేకంగా యిర్మీయా ప్రవచించడం
క్రీ.పూ. 587
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
8 కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు. 9 యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు. 10 తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
11 అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు. 12 అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు. 13 అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’”
13 బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా చెప్పిన మాట ఇది.
14 ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి.
తహపనేసులో వాళ్ళు ఇలా ప్రకటించారు. నీ చుట్టూ కత్తి స్వైర విహారం చేస్తూ అంతటినీ మింగివేస్తుంది. కాబట్టి మీరు లేచి ధైర్యంగా నిలిచి ఉండండి.
15 ఏపిస్ అనే నీ దేవుడు ఎందుకు పారిపోయాడు? నీ ఎద్దు దేవుడు ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే యెహోవా అతణ్ణి కిందకు పడవేశాడు.
16 తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు “లేవండి, ఇంటికి వెళ్దాం.
మన స్వంత ప్రజల దగ్గరకూ, మన స్వదేశానికీ వెళ్దాం. మనలను బాధిస్తున్న ఈ కత్తిని వదిలించుకుందాం.” అని చెప్పుకుంటున్నారు.
17 వాళ్ళు అక్కడ “ఐగుప్తు రాజైన ఫరో కేవలం ఒక ధ్వని మాత్రమే. అతడు అవకాశాలను చేజార్చుకునే వాడు” అని ప్రకటించారు.
18 సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
19 ఐగుప్తు ఆడపడుచులారా, మీరు చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడండి.
ఎందుకంటే నోపు భయం కలిగించేలా శిథిలమై పోతుంది. అక్కడ ఎవరూ నివసించలేరు.
20 ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.
21 వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు.
వాళ్ళు కలసి ఉండరు. వాళ్ళు నాశనమయే రోజు వాళ్లకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. అది వాళ్ళని శిక్షించే రోజు.
22 ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది.
చెట్ల కొమ్మలు నరికే వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు.”
23 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “అవి ఎంత దట్టమైన అడవులైనా వాళ్ళు దాన్ని నరికి వేస్తారు.
ఎందుకంటే వాళ్ళ సంఖ్య మిడతల దండు కంటే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను లెక్క పెట్టడం సాధ్యం కాదు.
24 ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.”
25 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నో పట్టణంలో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోనూ, ఐగుప్తునూ, దాని దేవుళ్ళనూ, రాజులనూ, ఫరో రాజులనూ, ఇంకా వాళ్ళలో నమ్మకముంచే వాళ్ళనీ నేను శిక్షించ బోతున్నాను. 26 వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళను అప్పగిస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకూ, అతని సేవకులకూ వాళ్ళని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత ఐగుప్తు మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రజలకు నివాస యోగ్యం అవుతుంది.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
27 “కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు.
28 నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”
విగ్రహారాధకులకు వ్యతిరేకంగా యిర్మీయా చివరి ప్రవచనాలు
విగ్రహారాధకులైన యూదులకు, ఐగుప్తుకు వ్యతిరేకంగా యిర్మీయా చివరి ప్రవచనాలు.
1 ఐగుప్తు లోని మిగ్దోలు, తహపనేసు, నొపు, పత్రోసు నగరాల్లో నివాసమున్న యూదా ప్రజలందరిని గూర్చి యిర్మీయా వద్దకు వచ్చిన దేవుని వాక్యం ఇది. 2 “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. నేను యెరూషలేము పైకీ మిగిలిన యూదా దేశపు పట్టణాల పైకీ పంపిన విపత్తులన్నిటినీ మీరు చూశారు. చూడండి, అవి శిథిలాలై పడి ఉన్నాయి. అక్కడ ఎవరూ నివసించడం లేదు. 3 మీకుగానీ మీ పితరులకిగానీ తెలియని దేవుళ్ళకి సాంబ్రాణి వేసి పూజించి నాకు కోపం పుట్టించారు కాబట్టి అలా జరిగింది.
4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను. 5 కానీ వాళ్ళు వినలేదు. ఇతర దేవుళ్ళకి ధూపం వేయడం గానీ, దుర్మార్గపు పనులను చేయడం గానీ మానుకోలేదు. నా మాటపై శ్రద్ధ పెట్టలేదు. 6 కాబట్టి నా దగ్గర నుండి తీవ్రమైన కోపం, ఉగ్రత ప్రవహించింది. అది అగ్నిలా యూదా పట్టణాలనూ, యెరూషలేము రహదారులనూ తగులబెట్టింది. కాబట్టి అవి ఇప్పుడు చూస్తున్నట్టుగా నాశనమై శిథిలాలుగా పడి ఉన్నాయి.”
7 కాబట్టి ఇప్పుడు సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీకు విరోధంగా మీరే ఎందుకిలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు? స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ, పసికందులూ ఇలా ఎవరూ యూదా దేశంలో ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీరే ఎందుకు చేసుకుంటున్నారు? 8 మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు. మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్తు దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు. మీరు నాశనం కావడానికీ భూమి పైన ఉన్న అన్ని దేశాల్లో మీరు నవ్వుల పాలు కావడానికీ, ఒక శాప వచనంగా ఉండటానికీ మీరు అక్కడికి వెళ్తున్నారు.
9 మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా? 10 ఈ రోజు వరకూ వాళ్ళు అణకువతో ఉండలేదు. వాళ్ళ ముందూ వాళ్ళ పితరుల ముందూ నేను ఉంచిన ధర్మశాస్త్రాన్నిగానీ ఆజ్ఞలనుగానీ వాళ్ళు గౌరవించలేదు. వాటి ప్రకారం జీవించలేదు.”
11 కాబట్టి సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, మీ పైకి అపాయాన్ని తీసుకురావడానికీ, యూదా దేశాన్నంతా నాశనం చేయడానికీ నేను నా ముఖాన్ని మీకు వ్యతిరేకంగా తిప్పుకుంటున్నాను. 12 యూదా ప్రజలలో మిగిలిన వాళ్ళలో ఐగుప్తు దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న వాళ్ళని నేనే తీసుకు వెళ్తాను. వాళ్ళంతా ఐగుప్తులో నాశనం కావడానికే ఇలా చేస్తాను. వాళ్ళు అక్కడ కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ కూలిపోతారు. వాళ్ళు చనిపోయి శాపానికీ, దూషణకూ, అవమానానికీ, భయానికీ సామెతగా ఉంటారు.
13 యెరూషలేములో నివసించే వాళ్ళని కత్తితో, కరువుతో, వ్యాధులతో నేను ఎలా శిక్షించానో అలాగే ఐగుప్తులో నివసించే వాళ్ళను కూడా శిక్షిస్తాను. 14 ఐగుప్తులో నివాసముండటానికి వెళ్ళిన మిగిలిన యూదా ప్రజల్లో ఎవరూ కాందిశీకుల్లా తిరిగి యూదా దేశానికి రావాలని ఎంత కోరుకున్నా రాలేరు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తిరిగి రారు.”
15 అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు. 16 వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం. 17 మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
18 మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.” 19 అక్కడి స్త్రీలు “మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?” అన్నారు.
20 అప్పుడు యిర్మీయా ఆ ప్రజలందరితో, ఆ స్త్రీ పురుషులందరితో, తనకు జవాబు చెప్పిన వాళ్ళందరితో ఇలా అన్నాడు. వాళ్ళకి ఇలా ప్రకటన చేశాడు. 21 “మీరూ, మీ పితరులూ, మీ రాజులూ, మీ నాయకులూ, మీ ప్రజలందరూ యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధులలోనూ మీరు వేసిన ధూపం యెహోవా మర్చిపోయాడు అనుకుంటున్నారా? ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచనల్లో ఇది మెదులుతూనే ఉంది.
22 ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు. 23 మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.”
24 తర్వాత యిర్మీయా అక్కడి ప్రజలనందరికీ, స్త్రీలందరికీ ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. 25 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘మీరూ, మీ భార్యలూ, ఇద్దరూ కలసి మీ నోటితో చెప్పారు.’ అలా చెప్పిన దాన్ని చేతులతో చేసి చూపించారు. ఆకాశ రాణికి ధూపం వేస్తామనీ, ఆమెకు పూజ చేస్తామనీ మీరు ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఒట్టును నెరవేర్చండి. దానిని జరిగించండి.
26 అయితే ఐగుప్తులో నివసించే యూదా ప్రజలందరూ యెహోవా మాట వినండి. ఆయన ఇలా అంటున్నాడు. చూడండి. నేను నా ఘన నామంపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరును తమ నోటితో పలకరు. 27 నేను వాళ్ళ క్షేమం కోసం కాకుండా వాళ్ళ వినాశనం కోసమే వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నాను. ఐగుప్తులోని యూదులంతా కత్తి మూలంగానో కరువు మూలంగానో చనిపోతారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడు. వారు ఖడ్గం వల్ల గానీ కరువు వల్ల గానీ క్షీణించిపోతారు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారంతా ఎవరూ మిగలకుండా అంతమై పోతారు. 28 కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
29 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.’ 30 యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘సిద్కియా ప్రాణాన్ని తీయాలని వెదికిన అతని శత్రువు నెబుకద్నెజరు చేతికి సిద్కియాను అప్పగించినట్టే ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులకీ, అతని ప్రాణం తీయాలని చూసేవాళ్లకీ అప్పగించబోతున్నాను.’”
నెబుకద్నెజరు యూదులను చెరపట్టిన సందర్భాల పునర్వివరణ
నెబుకద్నెజరు యూదులను చెరపట్టిన సందర్భాల సంక్షిప్త సారాంశం.
28 నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు. 29 నెబుకద్నెజరు పరిపాలన పద్దెనిమిదో సంవత్సరంలో యెరూషలేము నుండి 832 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. 30 నెబుకద్నెజరు పరిపాలన ఇరవై మూడో సంవత్సరంలో రాజు అంగరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యూదుల్లో 745 మందిని బందీలుగా తీసుకు వెళ్ళాడు. కాబట్టి మొత్తం యూదా దేశం నుండి బందీలుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 4, 600.