భాగం 4: తిరిగి వచ్చే వరకు బబులోనులో జరిగిన సంఘటనలు
యెరూషలేము నాశనం నుండి చెరలోనుండి తిరిగి వచ్చే వరకు బబులోనులో జరిగిన సంఘటనలు.
యెరూషలేము పతనం గురించి యెహెజ్కేలు వినడం
యెరూషలేము నాశనం గురించి తెలియజేయబడిన యెహెజ్కేలు, యూదయ పూర్తిగా పాడైపోతుందని, యూదులకు శత్రువులైన చుట్టుపక్కల జాతులపై దేవుని తీర్పులు వస్తాయని ముందుగా చెబుతాడు.
క్రీ.పూ. 587
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
21 మనం చెరలోకి వచ్చిన పన్నెండవ సంవత్సరం పదో నెల అయిదో రోజు ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా దగ్గరికి వచ్చి “పట్టణాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు. 22 అతడు రాకముందు సాయంత్రం యెహోవా చెయ్యి నా మీద ఉంది. ఉదయాన అతడు నా దగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. నేను మాట్లాడగలుగుతున్నాను. అప్పటినుంచి నేను మౌనంగా లేను.
23 యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 24 “నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, ‘అబ్రాహాము ఒక్కడుగానే ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పొందాడు. మనం అనేకులం. ఈ దేశం మనకు స్వాస్థ్యంగా వచ్చింది’ అని చెప్పుకుంటున్నారు.
25 కాబట్టి వారికీ మాట చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, మీరు రక్తం తింటున్నారు. మీ విగ్రహాలను చూస్తూ ఉంటారు. మీరింకా హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా? 26 మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?
27 వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు. 28 ఆ దేశాన్ని నిర్జనంగా పాడుచేస్తాను. దాని బలాతిశయం అంతం అవుతుంది. ఇశ్రాయేలు కొండలు నిర్జనంగా ఉంటాయి. ఎవరూ వాటి గుండా వెళ్ళరు. 29 వారు చేసిన నీచమైన పనుల వలన వారి దేశాన్ని పాడుగా నిర్జనంగా నేను చేస్తే నేను యెహోవానని వారు తెలుసు కుంటారు.
30 నరపుత్రుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇంటి గుమ్మాల్లో నిలబడి ఒకరినొకరు నీ గురించి మాట్లాడుతూ, ‘యెహోవా దగ్గర నుంచి వచ్చే ప్రవక్త మాట విందాం పదండి’ అని చెప్పుకుంటున్నారు. 31 నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.
32 నువ్వు వాళ్లకు, తీగ వాయిద్యంతో చక్కటి సంగీత కచేరీ చేస్తూ కమ్మగా పాడే వాడిలా ఉన్నావు. వాళ్ళు నీ మాటలు వింటారు గానీ ఎవ్వరూ వాటిని పాటించరు. 33 తప్పక జరుగుతాయి అని నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు.”
1 యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, అమ్మోనీయుల వైపు ముఖం తిప్పి వాళ్ళను గూర్చి వాళ్లకు విరుద్ధంగా ప్రవచించు.
3 అమ్మోనీయులతో ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా పవిత్రస్థలం అపవిత్రం అయినప్పుడు, ఇశ్రాయేలు దేశం నిర్జన ప్రదేశం అయినప్పుడు, యూదా ఇంటివాళ్ళు బందీలుగా వెళ్ళిపోయినప్పుడు మీరు ‘ఆహాహా’ అన్నారు.
4 కాబట్టి చూడండి! నేను మిమ్మల్ని తూర్పున ఉండే మనుషులకు ఆస్తిగా అప్పగిస్తాను. వాళ్ళు తమ డేరాలను మీ దేశంలో వేసి, మీ మధ్య కాపురం ఉంటారు. వాళ్ళు మీ పంటలు తింటారు, మీ పాలు తాగుతారు. 5 నేను రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా చేస్తాను, అమ్మోనీయుల దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
6 ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయుల బాధ చూసి మీరు చప్పట్లు కొట్టి, కాళ్లతో కదం తొక్కి, మీ మనస్సులోని తిరస్కారమంతటితో ఆనందించారు గనుక నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, 7 నేను మీకు విరోధిగా ఉండి, మిమ్మల్ని దేశాలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. అన్యప్రజల్లో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాను. దేశంలో మిమ్మల్ని నాశనం చేస్తాను. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
8 ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! ఇతర దేశాలకూ, యూదా వాళ్ళకూ తేడా ఏంటి, అని మోయాబీయులు, శేయీరు పట్టణం వాళ్ళు అంటారు గనుక, 9 తూర్పున ఉన్నవాళ్ళను రప్పించి, దేశానికి శోభగా ఉన్న పొలిమేర పట్టాణాలైన బెత్యేషీమోతు, బయల్మెయోను, కిర్యతాయిము, మోయాబీయుల సరిహద్దులుగా ఉన్న పట్టాణాలన్నిటినీ, అమ్మోనీయులనందరినీ వాళ్లకు ఆస్తిగా అప్పగిస్తాను. 10 దేశాల్లో అమ్మోనీయులు ఇక జ్ఞాపకానికి రారు. 11 నేను యెహోవానని మోయాబీయులు తెలుసుకునేలా నేను ఈ విధంగా వాళ్లకు శిక్ష వేస్తాను.”
12 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. “ఎదోమీయులు యూదావాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, అలా చేసి వాళ్ళు తప్పు చేశారు.” ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, 13 “ఎదోము మీద నా చెయ్యి చాపి, ప్రతి మనిషినీ, ప్రతి పశువునూ దానిలో ఉండకుండాా సమూల నాశనం చేస్తాను. తేమాను పట్టణం మొదలుకుని దాన్ని పాడుచేస్తాను. దదాను వరకూ ప్రజలంతా కత్తివాత కూలుతారు.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఎదోమీయుల విషయంలో నా కోపాన్ని బట్టి నా రౌద్రాన్ని బట్టి, ఇశ్రాయేలీయులు నా ఆలోచన నెరవేరుస్తారు! ఎదోమీయులు నా ప్రతీకారం చవి చూస్తారు.” ఇదే యెహోవా వాక్కు.
15 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. “ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద పగ తీర్చుకుని, ఏహ్య భావంతో, పాత కక్షలతో యూదాను నాశనం చేశారు.” 16 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “చూడు! ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి, కెరేతీయులను తెంచేస్తాను. సముద్ర తీరంలో నివాసం ఉన్న మిగిలిన వాళ్ళను నాశనం చేస్తాను. 17 ఆగ్రహంతో వాళ్ళను శిక్షించి, వాళ్ళ మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. నేను నా పగ తీర్చుకున్నప్పుడు, నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.”