దావీదును అభినందించిన హీరాము
హీరాము దావీదును అభినందిస్తాడు. ఫిలిష్తీయులు దండెత్తుతారు.
క్రీ.పూ. 1047
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
11 తూరు రాజు హీరాము తన మనుషులనూ, దేవదారు చెక్కలనూ, వడ్రంగం పనివారిని, భవనాలు కట్టేవారిని పంపించాడు. వాళ్ళు దావీదు కోసం ఒక పట్టణం కట్టారు. 12 ఇశ్రాయేలీయులపై రాజుగా యెహోవా తనను స్థిరపరిచాడనీ. దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని వర్థిల్లజేస్తాడనీ దావీదు గ్రహించాడు.
13 దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నివసించి అనేకమందిని ఉంపుడుగత్తెలుగా, భార్యలుగా చేసుకున్నాడు, దావీదుకు ఇంకా చాలామంది కొడుకులూ, కూతుర్లూ పుట్టారు. 14 దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు, అనేవారు పుట్టారు.
17 ప్రజలంతా ఇశ్రాయేలీయులపై రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు దావీదును చంపడానికి వారు సైన్యంతో బయలుదేరారు. ఆ వార్త తెలియగానే దావీదు సురక్షితమైన స్థలానికి వెళ్లిపోయాడు. 18 ఫిలిష్తీ సైన్యం వచ్చి రెఫాయీము లోయలో మకాం వేశారు. 19 దావీదు “నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు “బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను” అని చెప్పాడు. 20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి అక్కడ వాళ్ళను ఓడించి “జలప్రవాహాలు కొట్టుకు పోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని” ఆ స్థలానికి బయల్పెరాజీము అని పేరు పెట్టాడు. 21 ఫిలిష్తీయులు తమ దేవుళ్ళ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
22 ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు. 23 దావీదు యెహోవాను ప్రార్థించినప్పుడు, యెహోవా అతనితో “నువ్వు వాళ్ళను తిన్నగా వెళ్లి ఎదుర్కోవద్దు. చుట్టూ తిరిగి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిపై దాడి చెయ్యి. 24 కంబళి చెట్ల చుట్టూ తిరిగి వెళ్లి ఆ చెట్లకొమ్మల్లో వీచే గాలిలో శబ్దం వినిపించగానే ఫిలిష్తీయులపై దాడి చెయ్యి. ఎందుకంటే వారిని హతమార్చడానికి యెహోవా ముందుగా బయలుదేరుతున్నాడన్న మాట” అని చెప్పాడు. 25 యెహోవా తనకు చెప్పినట్టు చేసి, దావీదు గెబ నుండి గెజెరు వరకూ ఫిలిష్తీ సైన్యాన్ని తరుముతూ సంహరించాడు.
17 కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.
1 తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు. 2 తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
3 తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు. 4 యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, 5 ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు, 6 నోగహు, నెపెగు, యాఫీయ, 7 ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
8 దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు. 9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
10 “ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు. 11 వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది. 12 ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
13 ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు. 14 దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
15 కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు. 16 దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.