ఇశ్రాయేలు అంతటిపై దావీదు రాజుగా నియమించబడడం

క్రీ.పూ. 1048

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 సమూయేలు 5:1–3

1 ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు “రాజా, విను. మేమంతా నీకు దగ్గర బంధువులం. 2 గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడుగా ఉన్నావు. ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించి వారికి కాపరిగా ఉంటావు’ అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు.” 3 ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు.

1 దినవృత్తాంతాలు 13:1–4

1 దావీదు వేలమంది మీద అధిపతులుగా ఉన్నవాళ్ళతోను, వందలమంది మీద అధిపతులుగా ఉన్న వాళ్ళతోను, అధిపతులందరితోను ఆలోచన చేసి, సమావేశంగా కూడుకున్న ఇశ్రాయేలీయులందరితో, 2 “ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి, 3 మన దేవుని మందసం మళ్ళీ మన దగ్గరికి తీసుకొద్దాం రండి. సౌలు రోజుల్లో దాని దగ్గర మనం ఆయన చిత్తాన్ని అడగలేదు” అన్నాడు. 4 ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు.

కీర్తనలు 139

ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన

1 యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.

2 నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.

3 నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.

4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.

5 నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.

6 ఇలాంటి తెలివి నాకు అందనిది. అది ఆశ్చర్యకరం. అది నాకు అందదు.

7 నీ ఆత్మ నుండి నేనెక్కడికి వెళ్ళగలను? నీ సమక్షంలో నుండి నేనెక్కడికి పారిపోగలను?

8 ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు. మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు.

9 నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను.

10 అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడిచెయ్యి నన్ను పట్టుకుంటుంది.

11 నేనిలా అనుకుంటాను, చీకటి నన్ను దాచిపెడుతుంది. నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిలాగా అవుతుంది.

12 అప్పుడు చీకటి కూడా నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగుగా ఉంటుంది. చీకటీ, వెలుగూ ఈ రెండూ నీకు ఒకే విధంగా ఉన్నాయి.

13 దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.

14 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

15 నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.

16 నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.

17 దేవా, నీ ఆలోచనలు నాకెంతో ప్రశస్తమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది.

18 వాటిని లెక్కపెడదామనుకుంటే అవి ఇసక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. నిద్ర మేల్కొన్నప్పుడు నేనింకా నీ దగ్గరే ఉన్నాను.

19 దేవా, దుష్టులను నువ్వు కచ్చితంగా హతమారుస్తావు. హింసించే వాళ్ళంతా నా దగ్గర నుండి వెళ్ళిపొండి.

20 వాళ్ళు దుష్ట తలంపులు మనసులో ఉంచుకుని నీపై తిరగబడతారు. నీ శత్రువులు అబద్ధాలాడతారు.

21 యెహోవా, నిన్ను ద్వేషించే వాళ్ళను నేను ద్వేషిస్తున్నాను గదా. నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళను నేను అసహ్యించుకుంటున్నాను గదా.

22 వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు.

23 దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.

24 నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.

1 దినవృత్తాంతాలు 12:23–40

23 యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు వైపుకు తిప్పాలన్న ప్రయత్నంలో యుద్ధానికి ఆయుధాలు ధరించి అతని దగ్గరికి హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఇలా ఉంది. 24 యూదా వాళ్ళల్లో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు ఆరువేల ఎనిమిది వందలమంది. 25 షిమ్యోనీయుల్లో యుద్ధానికి తగిన శూరులు ఏడువేల వందమంది.

26 లేవీయుల్లో అలాంటివాళ్ళు నాలుగువేల ఆరువందలమంది. 27 అహరోను సంతతి వాళ్లకు అధిపతి యెహోయాదా. అతనితోపాటు ఉన్నవాళ్ళు మూడువేల ఏడు వందలమంది. 28 పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని తండ్రి యింటి వాళ్ళైన అధిపతులు ఇరవై ఇద్దరు.

29 సౌలు సంబంధులైన బెన్యామీనీయులు మూడు వేలమంది. అప్పటి వరకూ వాళ్ళల్లో చాలామంది సౌలు ఇంటిని కాపాడుతూ ఉన్నవాళ్ళు. 30 తమ పూర్వీకుల యింటివాళ్ళల్లో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయుల్లో ఇరవైవేల ఎనిమిదివందల మంది. 31 మనష్షే అర్థ గోత్రం వారిలో దావీదును రాజుగా చెయ్యడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వేల మంది.

32 ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం ఉండి, ఇశ్రాయేలీయులు ఏం చెయ్యాలో అది తెలిసిన అధిపతులు రెండువందల మంది. వీళ్ళ సంబంధులందరూ వీళ్ళ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. 33 జెబూలూనీయుల్లో అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, దావీదు పట్ల నమ్మకంగా స్వామిభక్తి కలిగి యుద్ధం చెయ్య గలవాళ్ళు యాభై వేల మంది.

34 నఫ్తాలీయుల్లో వెయ్యిమంది అధిపతులూ, వాళ్లతోపాటు డాలు, ఈటె పట్టుకొన్నవాళ్ళు ముప్ఫై ఏడువేలమంది. 35 దానీయుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిదివేల ఆరువందలమంది.

36 ఆషేరీయుల్లో యుద్ధ ప్రావీణ్యం కలిగి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు నలభై వేలమంది. 37 ఇంకా యొర్దాను నది అవతల ఉండే రూబేనీయుల్లో గాదీయుల్లో మనష్షేవాళ్ళల్లో సగం మంది, అన్ని రకాల ఆయుధాలు ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలన్న కోరిక కలిగి ఉండి ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు.

38 ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళందరూ ఏక మనస్సుతో దావీదును రాజుగా చేసుకోవాలని కోరుకున్నారు. 39 వాళ్ళ సహోదరులు వాళ్ళ కోసం భోజనపదార్ధాలు సిద్ధం చేసినప్పుడు, వాళ్ళు దావీదుతో కలిసి అక్కడ మూడు రోజులుండి అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నారు.

40 ఇశ్రాయేలీయులకు సంతోషం కలిగింది. ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి పొలిమేరల వరకూ వారి సంబంధులు గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహారం, పిండి వంటలు, అంజూర పళ్ళ ముద్దలు, ఎండిన ద్రాక్షపళ్ళ గెలలు, ద్రాక్షామధురసం, నూనె, గొర్రెలు, పశువులు, విస్తారంగా తీసుకొచ్చారు.

2 సమూయేలు 23:8–12

8 దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.

9 ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి 10 అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.

11 ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు. 12 అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.

1 దినవృత్తాంతాలు 11:20–47

20 యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది. 21 ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.

22 ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు. 23 ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.

24 ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు. 25 ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.

26 ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను, 27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు, 28 తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు, 29 హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, 30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు, 31 బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా, 32 గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, 33 బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, 34 గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను, 35 హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు, 36 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, 37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై, 38 నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు, 39 అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై, 40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 41 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు, 42 రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ, 43 మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, 44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు, 45 షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా, 46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా, 47 ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.

2 సమూయేలు 5:4–10

4 దావీదు రాజైనప్పుడు అతని వయసు ముప్ఫై ఏళ్ళు. అతడు నలభై ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు. 5 హెబ్రోనులో అతడు యూదా గోత్రం వారిని ఏడేళ్ళ ఆరు నెలలు, యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా గోత్రాల ప్రజలను ముప్ఫై మూడు ఏళ్ళు పాలించాడు.

6-7 దేశంలో యెబూసీయులు నివసిస్తూ ఉన్నప్పుడు వారిపై దాడి చేసేందుకు దావీదూ అతని మనుషులూ యెరూషలేముకు వచ్చారు. దావీదు తమపైకి రాలేడన్న ధీమాతో యెబూసీయులు “నువ్వు మాపైకి వస్తే ఇక్కడ ఉన్న గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిన్ను తోలివేస్తారు” అని దావీదుకు కబురు పంపారు. దావీదు వారిపై దండెత్తి దావీదుపురం అని పిలిచే సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు.

8 ఆ సమయంలో దావీదు “దావీదు శత్రువులైన గుడ్డి, కుంటి యెబూసీయులపై దాడి చేయాలనుకునే వారంతా నీటికాలువ సొరంగం గుండా ఎక్కి వెళ్ళాలి” అన్నాడు. అప్పటినుండి “గుడ్డివారు, కుంటివారు యెహోవా మందిరంలోపలికి రాలేరు” అనే సామెత పుట్టింది. 9 దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు. 10 దావీదు దినదినమూ వర్ధిల్లుతూ వచ్చాడు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

1 దినవృత్తాంతాలు 11:1–14

1 ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. “ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం. 2 ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు’ అని చెప్పాడు కదా” అని దావీదుతో అన్నారు.

3 ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది.

4 ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు. 5 యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో “నువ్వు ఇక్కడికి రాలేవు” అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే “దావీదు పట్టణం” అంటారు.

6 దానికి ముందు దావీదు “ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు” అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు.

7 తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి “దావీదు పట్టణం” అనే పేరు కలిగింది. 8 దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు. 9 దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

10 ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే. 11 దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.

12 ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు. 13 ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు. 14 అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.

2 సమూయేలు 23:18–39

18 సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు. 19 ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.

20 కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు. 21 ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు. 22 ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు. 23 ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.

24 ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను, 25 హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, 26 పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా, 27 అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి, 28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, 29 నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి, 30 పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి, 31 అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, 32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను, 33 హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము, 34 మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము, 35 కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై, 36 సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ, 37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు. 38 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 39 హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.