హదదు తప్పించుకోవడం (continued)

క్రీ.పూ. 1040

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 108

లలిత గీతం. దావీదు కీర్తన

1 దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను.

2 స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను.

3 ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.

4 యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది.

5 దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో.

6 నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి.

7 తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను.

8 గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం.

9 మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను.

10 కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు?

11 దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా?

12 మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి.

13 దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.

1 దినవృత్తాంతాలు 18:1–11

1 ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు. 2 తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.

3 తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు. 4 అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.

5 సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు. 6 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.

7 దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు. 8 హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.

9 దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది. 10 హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు. 11 ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.

1 దినవృత్తాంతాలు 18:13–17

13 దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.

14 ఈ విధంగా దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉండి తన ప్రజలందరికీ నీతిన్యాయాలు జరిగించాడు. 15 సెరూయా కొడుకు యోవాబు సైన్యాధిపతి. అహీలూదు కొడుకు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల లేఖరి. 16 అహీటూబు కొడుకు సాదోకూ, అబ్యాతారు కొడుకు అబీమెలెకూ యాజకులు. షవ్శా శాస్త్రి. 17 యెహోయాదా కొడుకు బెనాయా కెరేతీయులకూ, పెలేతీయులకూ అధిపతి. ఇంకా, దావీదు కొడుకులు రాజుకు సహాయకులు.