సౌలు కుటుంబంపై దావీదు దయ

సౌలు కుటుంబంపై దావీదు దయ. అమ్మోనీయులతో యుద్ధం.

క్రీ.పూ. 1040

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 సమూయేలు 9–10

1 “సౌలు కొడుకు యోనాతానును బట్టి నేను ఏదైనా మేలు చేయడానికి అతని కుటుంబానికి చెందినవారు ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని దావీదు అడిగాడు.

2 సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. దావీదు మనుషులు అతణ్ణి దావీదు దగ్గరికి పిలుచుకు వచ్చారు. దావీదు రాజు “సీబావు నువ్వే కదా” అని అడిగాడు. అతడు “నీ సేవకుడినైన నేనే సీబాను” అన్నాడు. 3 అప్పుడు దావీదు “యెహోవా నాపై దయ చూపించినట్టు నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా?” అని అతణ్ణి అడిగాడు.

అప్పుడు సీబా “యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు” అని రాజుకు విన్నవించుకున్నాడు. 4 “అతడు ఎక్కడ ఉంటున్నాడు?” అని రాజు అడిగాడు. సీబా “అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని రాజుతో చెప్పాడు. 5 అప్పుడు రాజైన దావీదు తన మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంటి నుండి అతణ్ణి తన దగ్గరికి రప్పించాడు.

6 సౌలు కొడుకు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “మెఫీబోషెతూ” అని అతణ్ణి పిలిచాడు. అతడు “అయ్యా, నీ దాసుణ్ణి. నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు. 7 దావీదు “నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతానును బట్టి తప్పక నీకు మేలు కలిగేలా చేసి, నీ తాత సౌలు భూమి మొత్తాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. ఇంకా నువ్వు జీవించినంత కాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అని చెప్పాడు.

8 అతడు నమస్కరించి “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నువ్వు కనికరం చూపించడానికి నీ దాసుణ్ణి నేను ఎంతవాణ్ణి?” అన్నాడు. 9 అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి “సౌలు అతని కుటుంబం వారికి గతంలో ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ యజమాని యోనాతాను కొడుకుకు తిరిగి ఇప్పించాను. 10 కాబట్టి నువ్వు, నీ కొడుకులు, దాసులు అతని కోసం ఆ భూమిని సాగు చెయ్యండి. నీ యజమాని కొడుకు తినేందుకు సరిపోయిన ఆహారం ఆ పంట నుండి తీసుకు రావాలి. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. సీబాకు పదిహేనుమంది కొడుకులు, ఇరవైమంది సేవకులు ఉన్నారు.

11 అప్పుడు సీబా “నా యజమానివైన రాజా, నీ దాసుణ్ణి నాకు సెలవిచ్చినట్టు అంతా జరిగిస్తాను” అని రాజుతో చెప్పాడు. అప్పటి నుండి మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడు అన్నట్టు రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ వచ్చాడు. 12 మెఫీబోషెతుకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు పసివాడు. అతని పేరు మీకా. సీబా కుటుంబం వారంతా మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. 13 మెఫీబోషెతు యెరూషలేములో నివసించి కలకాలం రాజు బల్ల దగ్గరే భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్ళూ కుంటివి.

10:1 ఆ తరువాత అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కొడుకు హానూను ఆ దేశానికి రాజు అయ్యాడు. 2 దావీదు “హానూను తండ్రి నాహాషు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి” అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్ళారు.

3 అప్పుడు అమ్మోనీయుల ప్రజల నాయకులు రాజైన హానూనుతో ఇలా చెప్పారు “నీ తండ్రి మీద గౌరవంతో మాత్రమే దావీదు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి మనుషులను పంపాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దాన్ని పరిశీలించడానికి అతడు తన గూఢచారులను పంపించాడని నీకు అనిపించలేదా?”

4 ఈ మాటలు విన్న హానూను దావీదు పంపిన మనుషులను పట్టుకుని, సగం గడ్డం గొరిగించి, వారు తొడుక్కొన్న బట్టలు వెనక వైపు నడుము కింద వరకూ మధ్యకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు. 5 ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు, వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి “మీ గడ్డాలు పెరిగే వరకూ యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి” అని వారికి చెప్పమన్నాడు.

6 అమ్మోనీయులు, దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి, తమ మనుషులను పంపి, బేత్రెహోబులో, అరాము సోబాలో ఉన్న అరామీయ సైన్యంలో నుండి ఇరవై వేలమంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మయకా రాజు దగ్గరనుండి వెయ్యిమంది సైనికులను, టోబులో నుండి పన్నెండు వేలమంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు. 7 ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు. 8 అమ్మోనీయులు బయలుదేరి తమ నగర సింహద్వారాలకు ఎదురుగా బారులు తీరి నిలబడ్డారు. సోబా నుంచి, రెహోబు నుంచి అరామీయులు, మయకావారు, టోబువారు విడివిడిగా పొలాల్లో కాపు కాశారు.

9 తనకు వెనకా, ముందూ యుద్ధపంక్తులుగా నిలబడి ఉన్న సైనికులను చూసి యోవాబు ఇశ్రాయేలీయుల్లో మహా వీరులైన కొందరిని ఎన్నుకుని వరుసలుగా నిలబెట్టి అరామీయులను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు. 10 మిగిలినవారిని అమ్మోనీయులను ఎదుర్కోడానికి తన సోదరుడు అబీషైకి అప్పగించాడు. 11 యోవాబు అబీషైతో “అరామీయుల సైన్యం నా గుంపును ఓడిస్తుంటే నీ సైన్యం వచ్చి నన్ను ఆదుకోవాలి, అమ్మోనీయుల సైన్యం నీ బలానికి మించిపోతే నేను వచ్చి నిన్ను ఆదుకొంటాను. 12 ధైర్యం తెచ్చుకో. మన ప్రజలనూ, దేవుని పట్టణాన్నీ తలంచుకుని బలం తెచ్చుకొందాం. యెహోవా ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాడు గాక” అని చెప్పాడు.

13 యోవాబు, అతని సైన్యం యుద్ధం ప్రారంభించగానే అరామీయులు వారి ముందు నిలవలేక పారిపోయారు. 14 అరామీయులు పారిపోవడం చూసిన అమ్మోనీయులు కూడా అబీషైని ఎదిరించలేక పారిపోయారు. వారు తమ పట్టణాలకు పారిపోయినప్పుడు యోవాబు అమ్మోనీయులను వదిలిపెట్టి యెరూషలేము వచ్చాడు. 15 ఇశ్రాయేలీయుల చేతిలో తాము పరాజయం పాలయ్యామని అరామీయులు గ్రహించి మళ్ళీ సమావేశమయ్యారు. 16 హదదెజరు నది అవతలి వైపున ఉన్న అరామీయులను పిలిపించాడు. వారు హేలాముకు చేరుకున్నారు. హదదెజరు సైన్యానికి షోబకు సైన్యాధిపతిగా ఉన్నాడు.

17 దావీదుకు ఈ వార్త తెలిసినప్పుడు అతడు ఇశ్రాయేలు యోధులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు. 18 అరామీయులు యుద్ధ వ్యూహం సిద్ధపరచుకుని దావీదును ఎదుర్కున్నారు. దావీదు అరామీయుల్లో ఏడు వందలమంది రథికులను, నలభై వేలమంది గుర్రపు రౌతులను హతమార్చాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేక పారిపోయారు. వారి సైన్యాధిపతి షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చనిపోయాడు. 19 హదదెజరు సామంతులంతా తాము ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక ఓడిపోవడం చూసి భయకంపితులయ్యారు. వారంతా ఇకపై అమ్మోనీయులకు సహాయం చేయడం మానుకుని ఇశ్రాయేలీయులకు లోబడి వారితో సంధి చేసుకున్నారు.

కీర్తనలు 20

ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన

1 ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక.

2 పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక.

3 ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక.

4 నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.

5 అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక.

6 యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.

7 కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము.

8 వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము!

9 యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.