రెండవ దేవాలయం గురించి యెహెజ్కేలు దర్శనం (continued)

క్రీ.పూ. 574

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహెజ్కేలు 47–48

1 ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.

2 తరవాత ఆయన ఉత్తరపు గుమ్మం మార్గంలో నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పుకు పోయే దారిలో బయటి గుమ్మానికి తోడుకుని వచ్చాడు. నేను చూసినప్పుడు అక్కడ గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉబికి పారుతున్నాయి.

3 ఆ వ్యక్తి కొలనూలు చేత పట్టుకుని తూర్పు వైపుకు వెళ్లి 540 మీటర్లు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు ఆ నీళ్లు చీలమండ లోతు వచ్చాయి. 4 ఆయన ఇంకో 540 మీటర్లు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మోకాళ్ల లోతు వచ్చాయి. ఇంకా ఆయన 540 మీటర్లు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపించినపుడు నీళ్లు మొల లోతుకు వచ్చాయి. 5 ఆయన ఇంకా 540 మీటర్లు కొలిచాడు. అప్పుడు ఆ నీళ్లు చాల లోతుగా మారి నేను దాటలేనంత నది కనబడింది. దాటడానికి వీలులేకుండ ఈదాల్సినంత నీటితో ఉన్న నదిగా మారింది.

6 అప్పుడాయన నాతో “నరపుత్రుడా, నీవు చూశావు గదా” అని చెప్పి నన్ను మళ్ళీ నది ఇవతలికి తీసుకుని వచ్చాడు. 7 నేను వెనక్కి వస్తుండగా నదీతీరాన రెండు వైపులా చెట్లు విస్తారంగా కనబడ్డాయి.

8 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి ప్రవహించి అరబాలోకి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా మారిపోతాయి.

9 ఈ నది ప్రవహించే చోటల్లా జలచరాలన్నీ బతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి రావడం వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి కాబట్టి చేపలు విస్తారంగా పెరుగుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బతుకుతాయి. 10 ఏన్గెదీ పట్టణం మొదలుకుని ఏనెగ్లాయీము పట్టణం వరకూ చేపలు పట్టేవారు దాని ఒడ్డున నిలిచి వలలు వేస్తారు. మహా సముద్రంలో ఉన్నట్టు అన్ని రకాల జాతుల చేపలు దానిలో బహు విస్తారంగా ఉంటాయి.

11 అయితే ఆ సముద్రంలోని బురద స్థలాలు, ఊబి తావులు బాగవ్వక ఉప్పును అందిస్తూ ఉంటాయి. 12 నదీతీరాన రెండు వైపులా ఆహారమిచ్చే సకల జాతుల వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి ప్రవహిస్తున్నది కాబట్టి ఆ చెట్లు ప్రతి నెలా కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికీ వాటి ఆకులు ఔషధాలకు పని చేస్తాయి.”

13 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకోవాల్సిన భూమి ఇది. యోసేపు సంతానానికి రెండు భాగాలియ్యాలి. 14 నేను ఈ దేశాన్ని ప్రమాణ పూర్వకంగా మీ పూర్వీకులకు ఈ దేశం ఇచ్చాను కాబట్టి భేదం ఏమీ లేకుండ మీలో ప్రతి ఒక్కరు దానిలో స్వాస్థ్యం పొందుతారు. ఆ విధంగా అది మీకు స్వాస్థ్యమవుతుంది.

15 ఉత్తరాన సెదాదుకు పోయే మార్గంలో మహా సముద్రం మొదలుకుని హెత్లోను వరకూ దేశానికి సరిహద్దు. 16 అది హమాతుకు, బేరోతాయుకు, దమస్కు సరిహద్దుకు, హమాతు సరిహద్దుకు మధ్య ఉన్న సిబ్రయీముకు, హవ్రాను సరిహద్దును ఆనుకుని ఉన్న మధ్యస్థలమైన హాజేరుకు వ్యాపిస్తుంది. 17 పడమటి సరిహద్దు హసరేనాను అనే దమస్కు సరిహద్దు పట్టణం, ఉత్తరపు సరిహద్దు హమాతు, ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.

18 తూర్పుదిక్కున హవ్రాను, దమస్కు, గిలాదులకు ఇశ్రాయేలీయుల దేశానికి మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకూ దాన్ని కొలవాలి. ఇది మీకు తూర్పు సరిహద్దు. 19 దక్షిణ దిక్కున తామారు మొదలుకుని కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటల వరకూ నది దారిలో మహాసముద్రానికి మీ సరిహద్దు ఉంటుంది. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. 20 పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకూ మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు.

21 ఇశ్రాయేలీయుల గోత్రాల ప్రకారం ఈ దేశాన్ని మీరు పంచుకోవాలి. 22 మీరు చీట్లువేసి మీకూ మీలో నివసించి పిల్లలు కన్న పరదేశులకూ ఆస్తులను విభజించేటప్పుడు ఇశ్రాయేలీయుల దేశంలో పుట్టిన వారిగానే ఆ పరదేశులను మీరు ఎంచాలి. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తాము కూడా స్వాస్థ్యం పొందేలా మీలాగా వారు కూడా చీట్లు వేయాలి. 23 ఏ గోత్రంలో పరదేశులు కాపురముంటారో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వాలి.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

48:1 గోత్రాల పేర్లు ఇవి. దానీయులకు ఒక భాగం. అది ఉత్తరదిక్కు సరిహద్దు నుండి హమాతుకు వెళ్ళే మార్గం వరకూ హెత్లోనుకు వెళ్ళే సరిహద్దు వరకూ హసరేనాను అనే దమస్కు సరిహద్దు వరకూ హమాతు సరిహద్దు దారిలో తూర్పుగా, పడమరగా వ్యాపించి ఉన్న భూమి. 2 దాను సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగం. 3 ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగం.

4 నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం. 5 మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగం. 6 ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగం. 7 రూబేనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగం.

8 యూదావారి సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి. 9 యెహోవాకు మీరు ప్రతిష్టించే ఈ ప్రదేశం 13 కిలోమీటర్ల, 500 మీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల, 400 మీటర్ల వెడల్పు ఉండాలి.

10 ఈ పవిత్రమైన స్థలం యాజకులది. అది ఉత్తరాన 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, పశ్చిమాన 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, తూర్పున 5 కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు, దక్షిణ దిక్కున 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు ఉండాలి. యెహోవా పరిశుద్ధస్థలం దాని మధ్య ఉంటుంది. 11 ఇది సాదోకు సంతతికి చెంది నాకు ప్రతిష్టితులై నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడే యాజకులది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోయినప్పుడు మిగిలిన లేవీయులు వారితో పోయినట్టు వారు నన్ను విడిచిపోలేదు. 12 పవిత్రమైన భూమిలో లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక స్థలం ఉంటుంది. దాన్ని అతి పరిశుద్ధంగా ఎంచుతారు.

13 యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక స్థలం ఏర్పాటు చేయాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ రెండు స్థలాల మొత్తం పొడవు 13 కిలోమీటర్ల 500 మీటర్లు. వెడల్పు పది కిలో మీటర్ల 800 మీటర్లు ఉంటుంది. 14 అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి కాబట్టి దానిలో ఏ కొంచెం భాగమైనా వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమి ప్రథమ ఫలాలను ఇతరులను అనుభవింపనియ్య కూడదు.

15 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న మిగిలిన స్థలం సమిష్టి భూమిగా ఎంచి, పట్టణంలో నివాసాలకు, మైదానాలకు వాడాలి. దాని మధ్య నగర నిర్మాణం జరుగుతుంది. 16 నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, 17 నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కుల్లో సమానంగా 135 మీటర్లు ఉండాలి. 18 పవిత్రమైన భూమిని ఆనుకుని ఉన్న మిగిలిన భూమి ఫలం పట్టణంలో పనిచేసి జీవించే వారికి ఆధారంగా ఉంటుంది. అది పవిత్రమైన భూమిని ఆనుకుని తూర్పున ఐదు కిలోమీటర్ల 400 మీటర్లు, పడమటి వైపున ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల, ఉంటుంది. 19 ఏ గోత్రపు వారైనా పట్టణంలో కష్టపడి జీవించేవారు దాన్ని సాగుబడి చేస్తారు. 20 పవిత్రమైన భూమి అంతా 13 కిలోమీటర్ల 500 మీటర్ల నలు చదరంగా ఉంటుంది. 21 పవిత్రమైన భూమికి, నగరానికి ఏర్పాటైన భూమికి రెండు వైపులా ఉన్న భూమి పాలకునిది. తూర్పున 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది తూర్పు సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. పడమర 13 కిలోమీటర్ల 500 మీటర్లు గల పవిత్రమైన భూమి నుండి అది పడమర సరిహద్దు వరకూ వ్యాపిస్తుంది. 22 యూదా వారి సరిహద్దుకు, బెన్యామీనీయుల సరిహద్దుకు మధ్యగా ఉన్న భాగం పాలకునిది. ఆ భాగం లోనే లేవీయుల స్వాస్థ్యం, నగరానికి ఏర్పాటైన భూమి ఉంటాయి.

23 తూర్పు నుండి పడమటి వరకూ కొలవగా మిగిలిన గోత్రాలకు భాగాలు ఏర్పాటవుతాయి. 24 బెన్యామీనీయులకు ఒక భాగం, వారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగం. 25 షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగం. 26 ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగం. 27 జెబూలూనీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగం. 28 దక్షిణదిక్కున తామారునుండి కాదేషులో ఉన్న మెరీబా ఊటలవరకూ నది వెంబడి మహా సముద్రం వరకూ గాదీయులకు సరిహద్దుగా ఉంటుంది. 29 మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రాలకు పంచిపెట్టాల్సిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.

30 నగర వైశాల్యం ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్లు. 31 ఇశ్రాయేలీయుల గోత్రాల పేర్ల ప్రకారం నగర గుమ్మాలకు పేర్లు పెట్టాలి. ఉత్తరాన రూబేనుదనీ, యూదాదనీ, లేవీదనీ మూడు గుమ్మాలు ఉండాలి. 32 తూర్పు వైపు 2 కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు ఉంది. ఆ వైపున యోసేపుదనీ, బెన్యామీనుదనీ, దానుదనీ, మూడు గుమ్మాలుండాలి. 33 దక్షిణం వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున షిమ్యోనుదనీ, ఇశ్శాఖారుదనీ, జెబూలూనుదనీ, మూడు గుమ్మాలుండాలి. 34 పడమటి వైపు రెండు కిలోమీటర్ల 400 మీటర్ల పొడవు. ఆ వైపున గాదుదనీ, ఆషేరుదనీ, నఫ్తాలిదనీ మూడు గుమ్మాలుండాలి. 35 ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. “యెహోవా ఉండే స్థలం” అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.