రెండవ దేవాలయం గురించి యెహెజ్కేలు దర్శనం (continued)
క్రీ.పూ. 574
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 “మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది. 2 దానిలో పరిశుద్ధ స్థలానికి 270 మీటర్ల నలుచదరమైన స్థలం ఏర్పాటు చేయాలి. దానికి నాలుగు వైపులా 27 మీటర్ల ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. 3 ఈ స్థలం నుండి 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, ఐదు కిలోమీటర్ల 400 మీటర్ల వెడల్పు గల భూమి కొలవాలి. అందులో పవిత్రమైన అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. 4 యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలం అవుతుంది. అది వారి ఇళ్ళకోసం ఏర్పాటై, పరిశుద్ధ స్థలానికి ప్రతిష్ఠితంగా ఉంటుంది. మందిరంలో పరిచర్య చేసే లేవీయులు ఇళ్ళు కట్టుకుని నివసించేలా 5 వారికి స్వాస్థ్యంగా 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు 5 కిలో మీటర్ల 400 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతంలో వారి నివాస స్థలాలు ఉంటాయి.
6 పట్టణం కోసం 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 2 కిలో మీటర్ల 700 మీటర్ల వెడల్పు ఉన్న ఒక ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ప్రతిష్ఠిత స్థలానికి ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా అది చెందుతుంది. 7 ప్రతిష్ఠిత భాగానికి పట్టణానికి ఏర్పాటైన భాగానికి పశ్చిమంగా, తూర్పుగా, రెండు వైపులా రాజు కోసం భూమిని కేటాయించాలి. పశ్చిమం నుండి తూర్పు వరకూ దాన్ని కొలిచినప్పుడు అది ఒక గోత్రస్థానానికి సరిపడిన పొడవు కలిగి ఉండాలి. రాజు నా ప్రజలను బాధింపక వారి గోత్రాల ప్రకారం దేశమంతటినీ ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చేందుకు 8 అది ఇశ్రాయేలీయుల్లో అతని స్వాస్త్యమైన భూమిగా ఉంటుంది.”
9 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు “ఇశ్రాయేలీయుల పాలకులారా, ఇంక చాలు! మీరు జరిగించిన బలాత్కారం, దోపిడి చాలించి నా ప్రజల సొమ్మును దోచుకోక నీతి న్యాయాలను అనుసరించండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 10 నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి. 11 తూము పందుంలో పదో పాలుగా ఉండాలి. మీ కొలతకు పందుం ప్రమాణంగా ఉండాలి. 12 ఒక తులానికి 20 చిన్నాలు, ఒక మీనాకు 20 తులాల ఎత్తు, 25 తులాల ఎత్తు, 15 తులాల ఎత్తు ఉండాలి.
13 ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారంగా చెల్లించాలి. పందుం గోదుమల్లో తూములో ఆరో భాగం, పందుం యవలులో తూములో ఆరో భాగం చెల్లించాలి. 14 తైలం చెల్లించే విధం ఏమిటంటే 180 పళ్ల నూనెలో ఒక పడి, ముప్పాతిక చొప్పున చెల్లించాలి. తూము 180 పళ్లు పడుతుంది. 15 ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యానికీ దహనబలికీ సమాధానబలికీ బాగా మేపిన గొర్రెల్లో మందకు రెండువందల్లో ఒక గొర్రెను తేవాలి. 16 దేశ ప్రజలందరికీ ఇశ్రాయేలీయుల పాలకునికి చెల్లించాల్సిన ఈ అర్పణ తేవాల్సిన బాధ్యత ఉంది. 17 పండగల్లో, అమావాస్య రోజుల్లో, విశ్రాంతిదినాల్లో, ఇశ్రాయేలీయులు సమావేశమయ్యే నియమిత సమయాల్లో వాడే దహనబలులను, నైవేద్యాలను, పానార్పణలను సరఫరా చేసే బాధ్యత పాలకునిదే. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాప పరిహారార్థ బలిపశువులనూ నైవేద్యాలనూ దహనబలులనూ సమాధాన బలిపశువులనూ సిధ్దపరచాలి.”
18 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “మొదటి నెల మొదటి రోజున ఏ లోపం లేని కోడెను తెచ్చి పరిశుద్ధ స్థలం కోసం పాప పరిహారార్థబలి అర్పించాలి. 19 ఎలాగంటే యాజకుడు పాప పరిహారార్థబలి పశువు రక్తం కొంచెం తీసి, మందిరపు ద్వారబంధాల మీదా బలిపీఠం చూరు నాలుగు మూలల మీదా లోపటి ఆవరణం వాకిలి ద్వారబంధాల మీదా చల్లాలి. 20 అనుకోకుండా లేక తెలియక పాపం చేసిన ప్రతి ఒక్కరి కోసం మందిరానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతి నెల ఏడో రోజున ఆ విధంగా చేయాలి.
21 మొదటి నెల 14 వ రోజున పస్కాపండగ ఆచరించాలి. ఏడు రోజులు దాన్ని జరుపుకోవాలి. మీరు పులియని ఆహారం తినాలి. 22 ఆ రోజున పాలకుడు తన కోసం, దేశ ప్రజలందరి కోసం పాప పరిహారార్థబలిగా ఒక ఎద్దును అర్పించాలి. 23 ఏడు రోజులు అతడు ఏ లోపం లేని ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను తీసుకుని, రోజుకొకటి చొప్పున ఒక ఎద్దును, ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పించాలి. అలాగే ప్రతి రోజూ ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థబలిగా అర్పించాలి. 24 ఒక్కొక్క ఎద్దుకు, పొట్టేలుకు ఒక తూము పిండితో నైవేద్యం చేయాలి. ఒక్క తూముకి మూడు పళ్ల నూనె ఉండాలి. 25 ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.”
46:1 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “తూర్పు వైపు తిరిగి ఉన్న లోపటి ఆవరణద్వారం ఆరు పని దినాలు మూసి ఉంచి, విశ్రాంతి రోజున, అమావాస్య రోజున తెరవాలి. 2 పాలకుడు బయటి వసారా గుమ్మం గుండా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధాల దగ్గర నిలబడినప్పుడు, యాజకులు దహనబలి పశువులను, సమాధానబలి పశువులను అతని కోసం సిద్ధపరచాలి. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తరవాత బయటికి వెళ్తాడు. అయితే సాయంకాలం కాక ముందే ఆ గుమ్మం మూయకూడదు. 3 విశ్రాంతిదినాల్లో, అమావాస్యల్లో దేశప్రజలు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి. 4 విశ్రాంతి దినాన పాలకుడు యెహోవాకు ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలు, ఏ లోపం లేని ఒక పొట్టేలును దహనబలిగా అర్పించాలి. 5 పొట్టేలుతో 22 లీటర్ల పిండితో నైవేద్యం చేయాలి. గొర్రెపిల్లలతో తన శక్తికొలది నైవేద్యాన్ని, ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.
6 అమావాస్య రోజున ఏ లోపం లేని చిన్న కోడెను, ఏ లోపం లేని ఆరు గొర్రె పిల్లలనూ, ఏ లోపం లేని ఒక పొట్టేలును అర్పించాలి. 7 నైవేద్యాన్ని సిద్ధపరచాలి, ఎద్దుతో, పొట్టేలుతో, 22 లీటర్లు, గొర్రెపిల్లలతో శక్తికొలదిగా పిండిని అర్పించాలి. ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి. 8 పాలకుడు ప్రవేశించేటప్పుడు వసారా మార్గం గుండా ప్రవేశించి అదే మార్గంలో బయటికి వెళ్ళాలి. 9 అయితే నియమిత సమయాల్లో దేశ ప్రజలు యెహోవా సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినప్పుడు ఉత్తర గుమ్మం గుండా వచ్చినవారు దక్షిణ గుమ్మం గుండా వెళ్ళాలి. దక్షిణ గుమ్మం గుండా వచ్చినవారు ఉత్తర గుమ్మం గుండా వెళ్ళాలి. ఎవరూ తాము వచ్చిన గుమ్మం గుండా తిరిగి వెళ్ళకుండా అందరూ తిన్నగా బయటికి వెళ్లిపోవాలి. 10 పాలకుడు వారితో కలిసి ప్రవేశించాలి, వారితో కలిసి బయటికి వెళ్ళాలి.
11 పండగ రోజుల్లో, నియమిత సమయాల్లో ఎద్దుతో, పొట్టేలుతో అయితే 22 లీటర్లు పిండి, గొర్రెపిల్లలతో శక్తి మేరకు పిండిని, ప్రతి 22 లీటర్ల పిండితో ఒక లీటర్ నూనె, నైవేద్యంగా అర్పించాలి. 12 పాలకుడు యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని అర్పించేటప్పుడు తూర్పు వైపు గుమ్మం తెరవాలి. విశ్రాంతి దినాన చేసినట్టే అతడు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తరవాత గుమ్మం మూయాలి. 13 ప్రతి రోజు ఏ లోపం లేని ఒక సంవత్సరం వయసున్న మగ గొర్రెపిల్లను దహనబలిగా అర్పించాలి. ప్రతి రోజు ఉదయాన దాన్ని అర్పించి దానితో నైవేద్యం చేయాలి. 14 అది ఎలాగంటే, 22 లీటర్ల గోదుమ పిండిలో ఆరో వంతు, దాన్ని కలపడానికి ఒక లీటరు నూనె ఉండాలి. ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. 15 గొర్రెపిల్లలను, నైవేద్యాన్ని, నూనెను ప్రతి రోజు ఉదయాన్నే నిత్య దహనబలిగా అర్పించాలి.
16 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, పాలకుడు తన కొడుకుల్లో ఎవరికైనా భూమిని ఇస్తే అది అతని స్వాస్థ్యం అవుతుంది. అది వారసత్వం వలన వచ్చిన స్వాస్థ్యం లాంటిది. 17 అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇస్తే అది విడుదల సంవత్సరం వరకే అది అతనికి హక్కుగా ఉంది తరువాత పాలకునికి తిరిగి వస్తుంది. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యానికి హక్కుదారులవుతారు. 18 ప్రజలు తమ స్వాస్థ్యాలను అనుభవించనీయకుండా పాలకుడు వారి భూమిని ఆక్రమించకూడదు. నా ప్రజలు తమ భూములను విడిచి చెదరిపోకుండేలా అతడు తన స్వంత భూమిలోనుండి తన కొడుకులకు భాగాలు ఇవ్వాలి.”
19 ఆ తరవాత ఆయన గుమ్మపు మధ్యగోడ మార్గంలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న యాజకులకు ఏర్పాటు చేసిన పవిత్రమైన గదుల్లోకి నన్ను తీసుకువచ్చాడు. అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు కనిపించింది. 20 యాజకులు అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని వండి, నైవేద్యాలను కాల్చే స్థలం ఇదే. వారు ఆ పవిత్రమైన వస్తువులను బయటి ఆవరణంలోకి తెస్తే ప్రజల్లో ఎవరైనా వాటిని తాకి ప్రతిష్ఠితులవుతారు కాబట్టి వాటిని బయటికి తేకూడదు, అని ఆయన నాతో చెప్పాడు.
21 అతడు బయటి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి ఆవరణపు నాలుగు మూలలను తిప్పాడు. ఆవరణం ప్రతి మూలలో మరొక ఆవరణం ఉన్నట్టు నాకు కనబడింది. 22 ఆవరణం నాలుగు మూలల్లో ఒక్కొక్క ఆవరణం ఉంది. ఒక్కొక్కటి 22 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉండి, నాలుగూ ఒకే పరిమాణంలో ఉన్నాయి. 23 ఆ నాలుగింటిలో చుట్టూ వరుసలో ఉన్న అటకలున్నాయి. ఆ అటకల కింద పొయ్యిలున్నాయి. 24 “ఇది వంట చేసేవారి స్థలం, ఇక్కడ మందిర పరిచారకులు ప్రజలు తెచ్చే బలిపశుమాంసాన్ని వండుతారు” అని ఆయన నాతో చెప్పాడు.