ఫరోకు, ఐగుప్తుకు వ్యతిరేకంగా యెహెజ్కేలు ప్రవచించడం
ఐగుప్తుకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం.
క్రీ.పూ. 589
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 బబులోను చెరలో ఉన్న కాలంలో, పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 2 “నరపుత్రుడా, నీ ముఖాన్ని ఐగుప్తురాజు ఫరో వైపు తిప్పి అతని గురించి, ఐగుప్తు దేశమంతటిని గురించి ప్రవచించు. యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే
3 ఐగుప్తు రాజు ఫరో, నైలునదిలో పడుకున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని.
నైలునది నాది, నేనే దాన్ని కలగచేశాను, అని నువ్వు చెప్పుకుంటున్నావు.
4 నేను నీ దవడకు గాలాలు తగిలిస్తాను. నీ నైలు నదిలోని చేపలను నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ నది మధ్యలో నుంచి నిన్నూ నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేస్తాను.
5 నిన్నూ నైలు నది చేపలన్నిటినీ ఎడారిలో పారబోస్తాను.
నువ్వు నేల మీద పడతావు. నిన్నెవరూ ఎత్తలేరు, లేపరు.
నిన్ను అడవి జంతువులకు ఆకాశపక్షులకు ఆహారంగా ఇస్తాను!
6 అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు.
ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
7 వాళ్ళు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నువ్వు విరిగిపోయి వారి పక్కలో గుచ్చుకున్నావు.
వాళ్ళు నీ మీద ఆనుకుంటే నువ్వు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వారి నడుములు బెణికేలా చేశావు.”
8 కాబట్టి యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నేను నీ మీదికి కత్తి దూస్తాను. నీ మనుషులనూ పశువులనూ చంపుతాను. 9 ఐగుప్తుదేశం పాడైపోయి నిర్మానుష్యమై పోతుంది. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే “నైలు నది నాది, నేనే దాన్ని కలగచేశాను” అని భయంకర సముద్ర జంతువు అనుకుంటున్నాడు. 10 కాబట్టి నేను నీకూ నీ నదికీ విరోధిని. ఐగుప్తు దేశాన్ని మిగ్దోలు నుంచి సెవేనే వరకూ కూషు సరిహద్దు వరకూ పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేస్తాను.
11 దాని మీదుగా ఏ కాలూ కదలదు. ఏ జంతువూ అటుగుండా వెళ్ళదు. నలభై ఏళ్ళు దానిలో ఎవరూ ఉండరు. 12 నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల మధ్య ఐగుప్తుదేశాన్ని పాడైన దానిగా చేస్తాను. పాడైపోయిన పట్టణాల్లో దాని పట్టణాలు నలభై ఏళ్ళు పాడై ఉంటాయి. ఐగుప్తీయులను ఇతర ప్రజల మధ్యకు చెదరగొడతాను. ఇతర దేశాలకు వారిని వెళ్ళగొడతాను.
13 యెహోవా ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. నలభై ఏళ్ళు గడిచిన తరువాత నానాప్రజల్లో చెదరిపోయిన ఐగుప్తీయులను నేను సమకూరుస్తాను. 14 ఐగుప్తు కోల్పోయిన దాన్ని మళ్ళీ ఇచ్చి, పత్రోసు అనే తమ సొంత ప్రాంతానికి చేరుస్తాను. అక్కడ వాళ్ళు అల్పమైన రాజ్యంగా ఉంటారు.
15 రాజ్యాల్లో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. ఇక ఇతర రాజ్యాల మీద అతిశయపడదు. వాళ్ళిక ఇతర రాజ్యాలపై పెత్తనం చేయకుండా నేను వారిని తగ్గిస్తాను. 16 ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషాన్ని మనసుకు తెచ్చుకుని ఐగుప్తు వైపు తిరిగితే అప్పటినుంచి వారికి నమ్మకం కుదరదు. అప్పుడు నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.
యెహెజ్కేలు: అష్షూరులాగే ఐగుప్తు పతనమవుతుంది క్రీ.పూ. 588
ఐగుప్తుకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం.
20 పదకొండవ ఏడు మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 21 నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు ఫరో చేతిని విరగ గొట్టాను. అది బాగుపడేలా ఎవరూ దానికి కట్టు కట్టరు. కత్తి పట్టుకునే బలం దానికి లేదు.”
22 కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నేను ఐగుప్తురాజు ఫరో చేతులను విరిచేస్తాను. అతని బలమైన చేతినీ, విరిగిన చేతినీ విరగ గొట్టి, అతని చేతిలోనుంచి కత్తి జారిపోయేలా చేస్తాను. 23 అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను. 24 ఫరో చేతులను నేను విరగ గొట్టడానికి, బబులోను రాజు చేతులను బలపరచి నా కత్తి అతని చేతికిస్తాను. బబులోను రాజు చూస్తూ ఉండగా ఫరో చావు దెబ్బతిన్న వాడి లాగా మూలుగుతాడు.
25 బబులోను రాజు చేతులను నేను బలపరుస్తాను. ఫరో చేతులు పడిపోతాయి. ఐగుప్తు దేశం మీద చాపడానికి నేను నా కత్తిని బబులోను రాజు చేతికిస్తే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. 26 నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా నేను ఐగుప్తును రాజ్యాల్లో చెదర గొట్టి వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను.”
31:1 బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 2 “నరపుత్రుడా, ఐగుప్తు రాజు ఫరోతో, అతని చుట్టూ ఉన్న సేవకులతో ఇలా చెప్పు.
ఘనత విషయంలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు?
3 అష్షూరు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో,
విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది.
దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది.
4 నీళ్లు సమృద్ధిగా ఉండడం వలన అది ఎత్తుగా ఎదిగింది. లోతైన నదిని బట్టి మహావృక్షం అయింది. దాని చుట్టూ కాలువలు పారుతున్నాయి.
వాటి పిల్ల కాలువలు ఆ ప్రాంతంలోని చెట్లన్నిటికీ నీళ్ళు అందించాయి.
5 ఆ ప్రాంతంలోని చెట్లన్నిటి కంటే అది ఎంతో ఎత్తుగా ఎదిగింది.
దానికి చాలా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి.
నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి దాని కొమ్మలు పొడుగ్గా పెరిగాయి.
6 పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి.
దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.
7 నీళ్ళు సమృద్ధిగా ఉన్న దగ్గర దాని వేళ్ళు పాకాయి. కాబట్టి అది పొడవాటి కొమ్మలతో అది అందంగా, గొప్పగా ఉంది.
8 దేవుని తోటలోని దేవదారు వృక్షాలు దానికి సాటి కావు.
సరళ వృక్షాలకు అలాంటి కొమ్మలు లేవు. మేడి చెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటిరావు.
దానికున్నంత అందం దేవుని తోటలోని వృక్షాల్లో దేనికీ లేదు!
9 అనేక కొమ్మలతో నేను దాన్ని అందంగా చేశాను.
అందుకు దేవుని తోట, ఏదెనులోని వృక్షాలన్నీ దాని మీద అసూయపడ్డాయి.”
10 అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “అది ఎంతో ఎత్తుగా ఉంది కాబట్టి, దాని కొన మిగతా వృక్షాలన్నిటిలో కంటే ఎత్తుగా ఉంది కాబట్టి, గర్వించింది. 11 కాబట్టి నేను అతణ్ణి ఒడిసి పట్టుకుని రాజుల్లో అతి బలిష్ఠమైన వాడి చేతుల్లో పెట్టాను. ఈ అధికారి అతని చెడుతనానికి తగిన విధంగా అతని పట్ల జరిగించి తరిమివేశాడు.
12 రాజ్యాలన్నిటిలో అతి క్రూరమైన విదేశీయులు అతన్ని నరికి పారవేశారు. అతని కొమ్మలు కొండల మీద, లోయల్లో పడ్డాయి. అతని శాఖలు భూమి మీదున్న అన్ని వాగుల్లో విరిగి పడ్డాయి. అప్పుడు భూరాజ్యాలన్నీ దాని నీడనుంచి వెళ్లి అతణ్ణి వదిలేశాయి.
13 అతని మోడు మీద ఆకాశపక్షులన్నీ వాలాయి.
అతని కొమ్మల్లో భూజంతువులన్నీ ఉన్నాయి.
14 నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అతిశయంతో అంత ఎత్తుకు ఎదగకుండా ఇది జరిగింది. దాని కొనలు మిగతా వృక్షాలకంటే ఎత్తుగా ఉండకుండాా, నీళ్ళ దగ్గరున్న ఏ వృక్షమూ అంత ఎత్తుకు ఎదగకుండా ఉంటుంది. సాధారణ మనుషులు చనిపోయినట్టుగా అవన్నీ చస్తాయి.”
15 యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “అతడు పాతాళం లోకి పోయిన రోజు నేను భూమికి దుఃఖం కలిగించాను. అగాధజలాలు అతన్ని ముంచేలా చేశాను. సముద్రపు నీటిని ఆపాను. అతన్ని బట్టి నేను వాటి ప్రవాహాలను బంధించాను. అతని కోసం నేను లెబానోనుకు దుఃఖం కలిగించాను. కాబట్టి ఆ ప్రాంతంలోని చెట్లన్నీ అతని కోసం దుఃఖించాయి.
16 అతని పతనం వల్ల కలిగే చప్పుడు విని ప్రజలు వణికిపోయేలా చేశాను. చచ్చిన వాళ్ళుండే గుంటలో అతన్ని విసిరేశాను. పల్లం ప్రాంతాల్లో ఉన్న ఏదెను చెట్లన్నిటినీ నేను ఓదార్చాను. ఇవన్నీ లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి వృక్షాలు.
17 వాళ్ళు కూడా కత్తితో చచ్చిన వారి దగ్గరికి అతనితో కూడా పాతాళానికి దిగిపోయారు. వీరంతా అతని నీడలో నివసించిన వాళ్ళు, అతనికి సహాయం చేసిన వాళ్ళు. 18 ఘనత, ఆధిక్యం విషయంలో నీకు ఏదెను తోటలోని వృక్షాల్లో సాటి ఏది? అయినా నువ్వు ఏదెను వృక్షాలతో పాటు భూమి కిందికి, సున్నతిలేని వారి దగ్గరికి దిగిపోవలసి వస్తుంది. కత్తితో చచ్చిన వారితో నువ్వు నివసిస్తావు! ఫరో, అతని సేవకులందరికీ జరిగేది ఇదే” ఇదే యెహోవా ప్రభువు సందేశం.