భాగం 3: బబులోనుకు తీసుకుపోబడని యూదులు

దేవాలయ నాశనం తరువాత బబులోనుకు చెరగా తీసుకుపోబడని యూదుల జనాంగంలోని భాగం యొక్క చరిత్ర.

ఈ భాగం గురించి సంక్షిప్త వృత్తాంతం

ఈ భాగంలో చెప్పిన సంఘటనల సంక్షిప్త వృత్తాంతం.

క్రీ.పూ. 588

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 25:23–26

23 యూదావాళ్ళ సైన్యాధిపతులందరూ, వాళ్ళ ప్రజలందరూ బబులోనురాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విన్నారు. మిస్పా పట్టణంలో ఉన్న గెదల్యా దగ్గరికి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకు యోహానాను, నెటోపాతీయుడు తన్హుమెతు కొడుకు శెరాయా, ఒక మాయకాతీయునికి పుట్టిన యజన్యా అందరూ కలిసి వచ్చారు.

24 గెదల్యా వాళ్ళతో, వాళ్ళ ప్రజలతో ప్రమాణం చేసి “కల్దీయులకు మనం దాసులం అయ్యామని భయపడొద్దు. దేశంలో నివాసం ఉండి, బబులోను రాజును మీరు సేవిస్తే, మీకు మేలు కలుగుతుంది” అని చెప్పాడు.

25 అయితే ఏడో నెలలో రాజ కుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇష్మాయేలు పదిమంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులనూ, కల్దీయులనూ, అతడు హతం చేశాడు. 26 అప్పుడు చిన్నవాళ్ళూ, గొప్పవాళ్ళూ, ప్రజలందరూ, సైన్యాధిపతులూ లేచి కల్దీయుల భయం చేత ఐగుప్తు దేశానికి పారిపోయారు.

యూదయకు అధిపతిగా గెదల్యా నియామకం

దేవాలయ నాశనం తరువాత నెబుకద్నెజరు గెదల్యాను యూదయకు అధిపతిగా నియమిస్తాడు. యిర్మీయా, మిగిలిన ప్రజలు గెదల్యా దగ్గరకు చేరుతారు.

2 రాజులు 25:22

22 బబులోను రాజు నెబుకద్నెజరు యూదాదేశంలో ఉండనిచ్చిన వాళ్ళమీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కొడుకు గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు.

యిర్మీయా 40:1–12

1 రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుంచి, యూదాలో నుంచి బబులోనుకు బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరి దగ్గర నుంచి, సంకెళ్లతో బంధించి ఉన్న యిర్మీయాను రమా నుంచి పంపించేసినప్పుడు యెహోవా నుంచి అతనికి వచ్చిన వాక్కు.

2 రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్ళి, అతనితో “ఈ స్థలానికి ఈ విపత్తు తెస్తానని నీ దేవుడైన యెహోవా ప్రకటించాడు గదా, 3 తాను చెప్పిన ప్రకారం యెహోవా ఆ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినలేదు కాబట్టి ఆయన చెప్పినట్టే చేశాడు. అందుకే మీకు ఇలా జరిగింది. 4 కాని ఇప్పుడు చూడు! ఈ రోజు నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించాను. నాతోబాటు బబులోను రావడం మంచిదని నీకు అనిపిస్తే నాతో రా. నేను నీ గురించి జాగ్రత్త తీసుకుంటాను. అయితే మంచిది కాదనిపిస్తే రావద్దు. దేశమంతా నీ ఎదుట ఉంది. ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళు.”

5 యిర్మీయా ఏ జవాబూ చెప్పకుండా ఉన్నప్పుడు, నెబూజరదాను అతనితో ఇలా అన్నాడు. “షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాను యూదా పట్టణాల మీద అధికారిగా బబులోను రాజు నియమించాడు. అతని దగ్గరికి వెళ్లు. అతనితో ఉంటూ, ప్రజల మధ్య నివాసం ఉండు. లేదా, ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లు.” అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి ఆహారం, ఒక బహుమానం ఇచ్చి పంపించాడు. 6 యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్లి అతనితోబాటు దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు.

7 ఇప్పుడు, అక్కడ పల్లెటూళ్ళల్లో ఉన్న కొంతమంది యూదయ సేనల అధిపతులూ, వారి మనుషులూ, బబులోను రాజు అహీకాము కొడుకు గెదల్యాను దేశం మీద అధికారిగా నియమించాడనీ, బబులోనుకు బందీలుగా వెళ్ళకుండా అక్కడే మిగిలిన వాళ్ళలో ఉన్న స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశంలోని నిరుపేదలను అతనికి అప్పగించాడనీ విన్నారు. 8 కాబట్టి నెతన్యా కొడుకు ఇష్మాయేలు, కారేహ కొడుకులైన యోహానాను, యోనాతాను, తన్హుమెతు కొడుకు శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి కొడుకులు, మాయకాతీయుడి కొడుకు యెజన్యా, వాళ్ళ మనుషులు, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు.

9 అప్పుడు షాఫాను కొడుకు అహీకాము కొడుకు గెదల్యా ప్రమాణంచేసి వాళ్ళతోనూ, వాళ్ళ మనుషులతోనూ ఇలా అన్నాడు. “మీరు కల్దీయులను సేవించడానికి భయపడవద్దు. దేశంలో కాపురం ఉండి, బబులోను రాజును సేవిస్తే మీకు మేలు కలుగుతుంది. 10 చూడండి, మన దగ్గరికి వచ్చే కల్దీయులను కలుసుకోడానికి నేను మిస్పాలో కాపురం ఉంటున్నాను. కాబట్టి ద్రాక్షారసం తయారుచేసుకోండి. వేసవికాల ఫలాలు, నూనె సమకూర్చుకుని, పాత్రల్లో నిల్వ చేసుకోండి. మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివాసం ఉండండి.”

11 మోయాబులో, అమ్మోనీయుల ప్రజల మధ్య, ఎదోములో, ఇంకా మిగతా ప్రదేశాలన్నిటిలో ఉన్న యూదులందరూ, బబులోను రాజు యూదయలో కొంతమంది ప్రజలను విడిచిపెట్టాడనీ, షాఫాను కొడుకు అహీకాము కొడుకైన గెదల్యాను వాళ్ళ మీద అధికారిగా నియమించాడని విన్నారు. 12 కాబట్టి యూదయ వాళ్ళందరూ తాము చెదిరిపోయి ఉన్న స్థలాలన్నిటినీ విడిచి, గెదల్యా దగ్గరికి మిస్పా తిరిగి వచ్చారు. వాళ్ళు ద్రాక్షారసం, వేసవికాలపు ఫలాలు అత్యంత సమృద్ధిగా సమకూర్చుకున్నారు.

గెదల్యాకు వ్యతిరేకంగా ఇష్మాయేలు కుట్ర

యిర్మీయా 40:13–41:10

13 కారేహ కొడుకు యోహానాను, పల్లెటూళ్ళల్లో నున్న సేనల అధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చి, 14 “నిన్ను చంపడానికి అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కొడుకు ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అన్నారు. కాని, అహీకాము కొడుకు గెదల్యా వాళ్ళ మాట నమ్మలేదు.

15 కారేహ కొడుకు యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా “నెతన్యా కొడుకు ఇష్మాయేలును నేను చంపుతాను. నన్ను ఎవరూ అనుమానించరు. అతడు నిన్నెందుకు చంపాలి? నీ దగ్గరికి కూడివచ్చిన యూదులందరూ ఎందుకు చెదిరిపోవాలి? మిగిలిన ప్రజలందరూ ఎందుకు నాశనం కావాలి?” అన్నాడు. 16 కాని అహీకాము కొడుకు గెదల్యా, కారేహ కొడుకు యోహానానుతో “నువ్వు ఈ పని చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు ఇష్మాయేలు గురించి అబద్ధాలు చెబుతున్నావు” అన్నాడు.

41:1 కాని ఏడో నెలలో ఎలీషామా మనవడూ, నెతన్యా కొడుకూ, రాజవంశం వాడూ, రాజు ప్రధానుల్లో ఒకడైన ఇష్మాయేలూ, అతనితోపాటు మరో పదిమంది మనుషులు కలిసి, మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వచ్చి అక్కడ అతనితోపాటు మిస్పాలో భోజనం చేశారు. 2 అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన షాఫాను మనవడూ, అహీకాము కొడుకైన గెదల్యాను ఖడ్గంతో హతం చేశారు. 3 తరువాత ఇష్మాయేలు మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ ఉన్న యోధులైన కల్దీయులను చంపాడు.

4 అది అతడు గెదల్యాను చంపిన రెండో రోజు. కానీ ఎవరికీ తెలియదు. 5 గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.

6 నెతన్యా కొడుకు ఇష్మాయేలు దారిపొడుగునా ఏడుస్తూ, వాళ్ళను ఎదుర్కోడానికి మిస్పాలోనుంచి బయలుదేరి వెళ్లి వాళ్ళను కలుసుకుని, వాళ్ళతో “అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి రండి,” అన్నాడు. 7 అయితే, వాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, అతనితోబాటు ఉన్నవాళ్ళు, వాళ్ళను చంపి గోతిలో పడేశారు.

8 కాని, వాళ్ళల్లో పదిమంది మనుషులు ఇష్మాయేలుతో “మమ్మల్ని చంపొద్దు, పొలంలో దాచిన గోధుమలు, బార్లీ, నూనె, తేనె మొదలైన ద్రవ్యాలు మా దగ్గర ఉన్నాయి,” అన్నారు. కాబట్టి అతడు వాళ్ళను, వాళ్ళతో ఉన్నవాళ్ళను కూడా చంపలేదు. 9 ఇష్మాయేలు గెదల్యాతోబాటు చంపిన మనుషుల శవాలన్నీ పారేసిన గొయ్యి, రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి తవ్వించినదే. నెతన్యా కొడుకు ఇష్మాయేలు తాను చంపిన వాళ్ళ శవాలతో దాన్ని నింపాడు.

10 అప్పుడు ఇష్మాయేలు, మిస్పాలో ఉన్న మిగిలిన జనమంతటినీ, రాజకుమార్తెలందరినీ, అంటే, రాజదేహ సంరక్షకుల అధికారి నెబూజరదాను అహీకాము కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరినీ, బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళను తీసుకెళ్ళి అమ్మోనీయుల దగ్గర చేరాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు,