దావీదు ప్రజలను లెక్కించడం

క్రీ.పూ. 1017

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 సమూయేలు 24:1–9

1 యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. “వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో” అని అదేశించాడు. 2 అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు “యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు” అని ఆజ్ఞాపించాడు.

3 అందుకు యోవాబు “నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?” అన్నాడు. 4 అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు.

5 వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు. 6 అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు. 7 అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు.

8 ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు. 9 అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.

1 దినవృత్తాంతాలు 21:6–7

6 రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు. 7 ఈ పని దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు.

1 దినవృత్తాంతాలు 27:23–24

23 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు. 24 ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.

2 సమూయేలు 24:10–15

10 జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.

11 తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, 12 “నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. ‘మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.’”

13 కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. “నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు” అన్నాడు. 14 అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.

15 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు.

1 దినవృత్తాంతాలు 21:15–16

15 యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.

16 దావీదు తేరిచూడగా, భూమ్యాకాశాల మధ్యలో నిలిచి, వరలోనుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడ్డాడు. అప్పుడు దావీదూ, పెద్దలూ, గోనెపట్టలు కట్టుకుని, సాష్టాంగపడ్డారు.

2 సమూయేలు 24:17

17 ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.”

1 దినవృత్తాంతాలు 21:17–30

17 దావీదు “ప్రజలను లెక్కపెట్టమని ఆజ్ఞ ఇచ్చినవాణ్ణి నేనే కదా? పాపం చేసి చెడుతనం జరిగించిన వాణ్ణి నేనే కదా? గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు? యెహోవా, నా దేవా, బాధపెట్టే నీ చెయ్యి నీ ప్రజల మీద ఉండకుండాా నా మీద, నా తండ్రి ఇంటివారి మీద ఉండనియ్యి” అని దేవునికి మనవి చేశాడు.

18 “యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి దావీదును అక్కడికి వెళ్ళమని చెప్పు” అని యెహోవా దూత గాదుకు చెప్పాడు. 19 యెహోవా పేరట గాదు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళాడు. 20 అప్పుడు ఒర్నాను గోదుమలు నూర్చుతున్నాడు. అతడు వెనక్కు తిరిగి దూతను చూసి అతడు, అతనితోపాటు ఉన్న అతని నలుగురు కొడుకులూ దాక్కున్నారు.

21 దావీదు ఒర్నాను దగ్గరికి రాగా అతడు దావీదును చూసి, కళ్ళంలోనుంచి బయటకు వచ్చి, తల నేల వరకూ వంచి దావీదుకు నమస్కారం చేశాడు. 22 అప్పుడు దావీదు ఒర్నానుతో “ఈ తెగులు ప్రజలను విడిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న చోట నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించడానికి తగిన ఖరీదుకు దాన్ని నాకు అమ్ము” అన్నాడు.

23 ఒర్నాను “రాజైన నా ప్రభువు దాన్ని తీసుకుని తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక. ఇదిగో, దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం ధాన్యం నూర్చే పరికరాలు, నైవేద్యం కోసం గోదుమ పిండి, అన్నీ నేను ఇస్తాను” అని దావీదుతో అన్నాడు. 24 అప్పుడు రాజైన దావీదు “అలా కాదు, నేను నీ సొత్తును ఊరికే తీసుకు యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన వెల ఇచ్చి తీసుకుంటాను” అని ఒర్నానుతో చెప్పి, 25 ఆ స్థలం కోసం ఆరువందల తులాల బంగారం అతనికి ఇచ్చాడు. 26 తరువాత దావీదు యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టించి, దహనబలులు, సమాధానబలులు అర్పించి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుంచి దహన బలిపీఠం మీదికి అగ్నితో అతనికి జవాబిచ్చాడు. 27 యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు.

28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లంలో యెహోవా తనకు జవాబిచ్చాడని దావీదు చూసి అక్కడే బలి అర్పించాడు. 29 మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి. 30 అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.

కీర్తనలు 30

ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన.

1 యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.

2 యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.

3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు.

4 యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

5 ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

6 నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను.

7 యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.

8 యెహోవా, నీకే నేను మొరపెట్టాను, నా ప్రభువును బతిమాలుకున్నాను.

9 నేను చనిపోయి సమాధిలోకి దిగిపోతే ప్రయోజనం ఏముంది? మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ నమ్మకత్వాన్ని అది వివరిస్తుందా?

10 యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి.

11 నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.

12 అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.