దావీదు ప్రజలను లెక్కించడం (continued)
క్రీ.పూ. 1017
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు. 2 అప్పుడు దావీదు యోవాబుకూ ప్రజల అధిపతులకూ “మీరు వెళ్లి బెయేర్షెబా నుండి దాను వరకూ ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కపెట్టి, జనసంఖ్య నాకు తెలియజేయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 3 అందుకు యోవాబు “రాజా నా ప్రభూ, యెహోవా తన ప్రజలను ఇప్పుడున్న వారికంటే వందరెట్లు ఎక్కువమందిగా చేస్తాడు గాక. వాళ్ళందరూ నా ప్రభువుకు దాసులు కారా? నా ప్రభువుకు ఈ వివరం ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇది జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది” అన్నాడు.
4 కాని, యోవాబు మాట చెల్ల లేదు. రాజు మాటే చెల్లింది కాబట్టి యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా తిరిగి యెరూషలేముకు వచ్చాడు. 5 ఇశ్రాయేలీయులందరిలో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు పదకొండు లక్షలమంది. యూదావాళ్ళల్లో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు నాలుగు లక్షల డెబ్భైవేలమందిగా లెక్కకు వచ్చారు.
8 దావీదు “నేను ఈ పని చేసి పెద్ద పాపం చేశాను. నేను చాలా అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం తీసివెయ్యి” అని దేవునికి మొర్రపెట్టాడు.
9 దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా “నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, 10 యెహోవా చెప్పేదేమంటే, మూడు విషయాలు నేను నీముందు ఉంచుతున్నాను. వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకో. దాన్ని నీకు చేస్తాను” అన్నాడు.
11 కాబట్టి, గాదు దావీదు దగ్గరికి వచ్చి, 12 “మూడు సంవత్సరాలు కరువు కలగడం, లేదా మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు వాళ్ళ ముందు నిలవలేక ఓటమి పాలవ్వడం, లేదా, మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం, అంటే తెగులు వచ్చి యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనం కలగజేయడం.
ఈ మూడింట్లో నువ్వు ఒకదాన్ని కోరుకోమని యెహోవా చెబుతున్నాడు. కాబట్టి, నన్ను పంపిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో దాని విషయం ఆలోచించు” అన్నాడు.
13 అందుకు దావీదు “నేను చాలా ఇరుకులో చిక్కుకుపోయాను. యెహోవా మహా కృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడతాను” అని గాదుతో అన్నాడు. 14 కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు.
16 దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు.
18 ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు. 19 దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు. 20 రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి “నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?” అని అడిగాడు. 21 దావీదు “ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది” అన్నాడు.
22 అందుకు అరౌనా “నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి. 23 రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను” అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక” అని రాజుతో అన్నాడు.
24 రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు.
25 అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.
దావీదు పాలనలోని చివరి ఆరు నెలలు క్రీ.పూ. 1015
దేవాలయ నిర్మాణానికి దావీదు సన్నాహాలు
1 దావీదు “దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే. ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే” అని చెప్పాడు.
2 తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు. 3 వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు భారీగా ఇనుమును, తూయడానికి వీలులేనంత ఇత్తడిని, 4 లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులూ, తూరీయులూ దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకు వస్తూ ఉన్నారు.
5 దావీదు “నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను” అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు.
6 తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. 7 దావీదు సొలొమోనుతో “నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకొన్నప్పుడు, 8 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు.
9 నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరిని నేను తోలివేసి అతనికి శాంతిసమాధానాలు కలగజేస్తాను. ఆ కారణంగా అతనికి సొలొమోను అను పేరు ఉంటుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు, విశ్రాంతి దయచేస్తాను. 10 అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.
11 నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు. 12 నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకమూ తెలివీ ఇచ్చి, ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక. 13 యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు. 14 చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం మూడు వేల నాలుగు వందల యాభై టన్నుల బంగారం, ముప్ఫై నాలుగు వేల ఐదు వందల టన్నుల వెండీ, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడీ, ఇనుమూ సమకూర్చాను. మానులను, రాళ్లను తెచ్చి పెట్టాను. దీని కన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావు గాక.
15 ఇంకా, పని చేయగలిగిన ఎందరో శిల్పకారులూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు. 16 లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీదగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అన్నాడు.
17 దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు. 18 అతడు వారితో “మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.
19 కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు.