చట్టప్రకారమైన వివిధ ఆచారాలు స్థాపించబడటం

క్రీ.పూ. 1490

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంఖ్యాకాండం 5–6

1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. 2 “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి. 3 వారు ఆడవారైనా మగవారైనా శిబిరం నుండి బయటకు పంపించి వేయాలి. వారు శిబిరాన్ని కలుషితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను శిబిరంలో వారి మధ్య నివసిస్తున్నాను.” 4 ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అలాంటి వారిని శిబిరం బయటకు వెళ్ళగొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విధేయత చూపారు.

5 యెహోవా మరోసారి మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. 6 పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. 7 అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.

8 ఆ అపరాధ చెల్లింపుని తీసుకోడానికి ఆ వ్యక్తికి దగ్గర బంధువు ఎవరూ లేకుంటే అతడు ఆ సొమ్మును యాజకుడి ద్వారా నాకు చెల్లించాలి. దాంతోపాటు ఒక పొట్టేలును తన పరిహారం కోసం అర్పించాలి. ఆ సొమ్ముతో పాటు పొట్టేలు కూడా యాజకునిదవుతుంది. 9 ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది. 10 ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.”

11 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. 12 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు. ఎవరైనా ఒకడి భార్య దారి తప్పి అతడికి ద్రోహం చేసినప్పుడు, 13 అంటే వేరే వ్యక్తి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఆమె అపవిత్రం అయినట్టే. ఆ విషయాన్ని ఆమె భర్త చూడకపోయినా, అతనికి తెలియక పోయినా, ఆ కార్యం చేస్తుండగా ఎవరూ పట్టుకోకపోయినా, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె పట్టుబడదు. 14 కానీ ఆ భర్త మనస్సులో రోషం పుట్టి తన భార్య అపవిత్రమైన సంగతి గ్రహిస్తే, లేదా ఆమె అపవిత్రం కాకపోయినా అలాంటిదే అనుమానం అతని మనస్సులో కలిగితే అతడు చేయాల్సింది ఇది.”

15 అలాంటి విషయంలో ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఆమెతో పాటు తూమెడు యవల పిండిలో పదో వంతు కూడా తీసుకు రావాలి. దానిమీద నూనె పోయకూడదు. సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోషాన్ని సూచించే నైవేద్యం. పాపాన్ని సూచించడానికి చేస్తున్న నైవేద్యం.

16 యాజకుడు ఆమెను యెహోవా సమక్షానికి తీసుకురావాలి. 17 తరువాత యాజకుడు మట్టికుండలో పవిత్రజలం తీసుకోవాలి. మందిరం నేలపైనుండి కొంత ధూళి తీసుకుని ఆ నీళ్ళలో కలపాలి.

18 తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో ఆ స్త్రీని నిలబెట్టాలి. ఆ స్త్రీ తలపై ముసుగుని తీసి ఆమె జుట్టు జడలు విప్పాలి. రోషం కారణంగా చేసిన నైవేద్యాన్ని అంటే పాపానికి సూచనగా ఉన్న నైవేద్యాన్ని యాజకుడు ఆమె చేతుల్లో ఉంచాలి. ఇది రోషం కారణంగా చేసిన నైవేద్యం. ఆ సమయంలో శాపాన్ని కలిగించే చేదు నీళ్ళు యాజకుడి చేతిలో ఉండాలి. 19 అప్పుడు యాజకుడు ఆ స్త్రీతో ఒట్టు పెట్టించి ఇలా చెప్పాలి. “ఏ పురుషుడూ నీతో లైంగికంగా కలవక పొతే, నువ్వు దారి తప్పి అపవిత్ర కార్యం చేయకపోతే శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళు నీపై ప్రభావం చూపించవు.

20 కానీ భర్త ఆధీనంలో ఉన్న నువ్వు దారి తప్పి ఉంటే, అపవిత్రురాలివైతే, వేరే వ్యక్తి నీతో సంబంధం పెట్టుకుంటే” 21 ఇక్కడ యాజకుడు ఆమె పైకి శాపం వచ్చేట్లు ఆమెతో ఒట్టు పెట్టించాలి. తరువాత తన మాటలు కొనసాగించాలి. “యెహోవా నీ ప్రజల్లో అందరికీ తెలిసేలా నిన్ను శాపానికి గురిచేస్తాడు గాక. నీ తొడలు బలహీనమై నీ కడుపు ఉబ్బిపోతుంది. 22 శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి వెళ్లి నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేసి నీ తొడలను బలహీనం చేస్తాయి.” యాజకుడు ఇలా చెప్పిన తరువాత ఆ స్త్రీ “నేను దోషినైతే అలాగే జరగాలి” అని చెప్పాలి.

23 యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.

24 తరువాత యాజకుడు శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళని ఆమెతో తాగించాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలో చేదును పుట్టిస్తాయి. 25 తరువాత యాజకుడు రోషం కారణంగా అర్పించిన నైవేద్యాన్ని ఆమె చేతిలోనుండి తీసుకుని యెహోవా సమక్షంలో పైకి ఎత్తి, ఊపి దాన్ని బలిపీఠం దగ్గరకి తీసుకురావాలి. 26 తరువాత యాజకుడు ఆ నైవేద్యంలో నుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.

27 యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది. 28 ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.

29 అనుమానం గురించిన చట్టం ఇది. భర్త ఆధీనంలో ఉన్న ఏ స్త్రీ అయినా దారి తప్పి అపవిత్రురాలైనప్పుడు పాటించాల్సిన చట్టం ఇది. 30 ఒకవేళ భర్తకు తన భార్యపై అనుమానం కలిగినా ఇదే చట్టం పాటించాలి. అతడు ఆమెను యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. ఈ అనుమానం గురించిన చట్టం వివరించిన వాటన్నిటినీ యాజకుడు ఆమె విషయంలో జరిగించాలి.

31 అప్పుడు ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరకి తీసుకు వచ్చిన నేరం నుండి విముక్తుడవుతాడు. ఆ స్త్రీ ఏదన్నా అపరాధం చేస్తే ఆ శిక్ష భరించాలి.

6:1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు. 3 ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు. 4 నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.

5 అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.

6 అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు. 7 తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు. 8 అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.

9 ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.

10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. 11 అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.

12 తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.

13 నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి. 14 అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి. 15 అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.

16 అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి. 17 పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.

18 అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.

19 అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి. 20 తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.

21 మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.”

22 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. 23 “అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.

24 యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!

25 యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!

26 యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!

27 ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”