భాగం 10: ఉజ్జియా పాలన

యూదా రాజ్యం

ఉజ్జియా తొలి పాలన, సమృద్ధి

క్రీ.పూ. 810

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 26:1–4

1 అప్పుడు యూదా ప్రజలంతా 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను అతని తండ్రి అమజ్యాకు బదులు రాజుగా నియమించారు. 2 ఎలోతు పట్టణాన్ని కట్టించి, అది యూదా వారికి తిరిగి వచ్చేలా చేసింది ఇతడే. ఆ తరువాత రాజు తన పూర్వీకులతో పాటు కన్ను మూశాడు.

3 ఉజ్జియా పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 16 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 52 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెకొల్యా. 4 అతడు తన తండ్రియైన అమజ్యా చేసిన దాని ప్రకారం యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.

2 రాజులు 15:1

1 ఇశ్రాయేలురాజు యరొబాము పరిపాలనలో 23 వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు.

2 దినవృత్తాంతాలు 26:5–15

5 దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జెకర్యా రోజుల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లజేశాడు.

6 అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణ ప్రాకారాలను పడగొట్టి, అష్డోదు దేశంలో ఫిలిష్తీయుల ప్రాంతంలో పట్టణాలను కట్టించాడు. 7 ఫిలిష్తీయులతో, గూర్బయలులో నివసించిన అరబీయులతో, మెయోనీయులతో అతడు యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. 8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకూ ఐగుప్తు వరకూ వ్యాపించింది.

9 ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు. 10 అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం.

11 దీనికి తోడు, ఉజ్జియాకు పోరాడే యోధులున్నారు. వారు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధికారుల్లో కార్యదర్శి మయశేయా, ప్రధానమంత్రి యెహీయేలు వారి లెక్క ఎంతైనది చూసి పటాలాలుగా ఏర్పరచేవారు. వీరు హనన్యా చేతి కింద ఉన్నారు. 12 వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2, 600 మంది. 13 రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది సైన్యం, వారి చేతి కింద ఉంది.

14 ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లనూ, ఈటెలనూ, శిరస్త్రాణాలనూ, కవచాలనూ, విల్లులనూ, వడిసెలలనూ చేయించాడు. 15 అతడు అంబులనూ పెద్దరాళ్లనూ ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.

యూదావారి పతనాన్ని ముందుగా తెలిపిన యోవేలు సుమారు క్రీ.పూ. 787

ఉజ్జియా తన సైన్యాన్ని విస్తరించేటప్పుడు, ఒక విదేశీ సైన్యం ఏదో ఒక రోజున యూదావారి రాజ్యాన్ని కూలదోస్తుందని యోవేలు ముందుగా తెలియజేస్తాడు.

యోవేలు 1

1 పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.

2 పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి.

మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ

ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?

3 దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి.

మీ పిల్లలు తమ పిల్లలకు, వాళ్ళ పిల్లలు తరువాత తరానికి చెబుతారు.

4 ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి.

పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి.

మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి.

5 తాగుబోతులారా, లేచి ఏడవండి.

ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి.

ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు.

6 ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది.

బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు.

దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి.

అతనికి ఆడసింహం పళ్ళున్నాయి.

7 అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు.

నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు.

దాని బెరడు ఒలిచి పారేశాడు.

వాటి కొమ్మలు తెల్లబారాయి.

8 తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు.

9 నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి.

యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు.

10 పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది.

ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు.

నూనె ఒలికి పోయింది.

11 గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి,

ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది.

12 ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి.

దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు,

పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.

మనుషులకు సంతోషమే లేదు.

13 యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి!

బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి.

నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి.

నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి.

14 ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి.

యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ

మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.

15 యెహోవా దినం దగ్గర పడింది.

అయ్యో, అది ఎంత భయంకరమైన దినం!

సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది.

16 మన కళ్ళముందే ఆహారం,

మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా?

17 విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి,

పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి,

కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.

18 మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి!

పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి!

19 యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను.

అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది,

మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి.

20 కాలవలు ఎండిపోయాయి,

అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో

పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి.