ఉజ్జియాకు కుష్ఠువ్యాధి సోకడం
క్రీ.పూ. 787 లేదా 765
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. 17 యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనివెంట లోపలికి వెళ్ళారు. 18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు” అని చెప్పారు.
19 ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వేయడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్టురోగం పుట్టింది. 20 ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.
21 రాజైన ఉజ్జియా చనిపోయే వరకూ కుష్టురోగిగానే ఉన్నాడు. కుష్టురోగిగా యెహోవా మందిరంలోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. అతని కొడుకు యోతాము, రాజ భవనం మీద అధిపతిగా దేశప్రజలకు న్యాయం తీర్చేవాడు.
ప్రవక్తగా యెషయా నియామకం క్రీ.పూ. 758
1 యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం.
1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.
2 ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు.
3 వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.
4 వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది.
5 నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను.
నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.
6 అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.
7 “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.
8 అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను.
అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.
9 ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు.
ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.
10 వారు కళ్ళతో చూసి, చెవులతో విని,
హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని,
స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి,
వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.
11 “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,
12 యెహోవా ప్రజలను దూరప్రాంతానికి తీసుకు పోయే దాకా, దేశం నిర్జనమై చవిటిపర్ర అయ్యే దాకా.”
13 దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది.
సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది.
అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.
1 యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది.
2 రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది.
అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది.
జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
3 అనేక మంది వచ్చి ఇలా అంటారు.
“ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు,
ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా,
యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.”
ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.
4 ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు.
అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు.
వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ,
తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు.
జనం మీదకి జనం కత్తి ఎత్తరు.
ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు.
5 యాకోబు వంశస్థులారా, రండి.
మనం యెహోవా వెలుగులో నడుద్దాం.
6 యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు.
వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ,
పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు.
7 వాళ్ళ దేశం వెండి బంగారాలతో నిండి ఉంది.
వాళ్ళ సంపాదనకు మితి లేదు.
వాళ్ళ దేశం గుర్రాలతో నిండి ఉంది.
వాళ్ళ రథాలకు మితి లేదు.
8 వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది.
వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు.
9 ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు.
కాబట్టి వాళ్ళను అంగీకరించవద్దు.
10 యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు.
11 మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.
మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
12 గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.
13 సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ,
బాషాను సింధూర వృక్షాలన్నిటికీ,
14 ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ,
15 ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ,
16 తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు.
17 అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది.
మనుషుల గర్వం తగ్గిపోతుంది.
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
18 విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి.
19 యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి,
ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో,
నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు.
20 ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు.
ఎలుకలకూ, గబ్బిలాలకూ వాటిని విసిరేస్తారు.
21 యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ,
ఆయన ప్రభావ మహత్యం నుంచీ పారిపోయి కొండ గుహల్లో,
కొండ బండల నెర్రెల్లో మనుషులు దాగి ఉంటారు.
22 తన ముక్కుపుటాల్లో జీవవాయువు ఉన్న మనిషి మీద నమ్మకం ఉంచడం మానుకో.
అతని విలువ ఏ పాటిది?