ఇద్దరు శిష్యులు తిరిగి వచ్చి తెలియజేయడం
ఇద్దరు శిష్యులు తెలియజేసిన సంగతులు, సీమోను పేతురుకు ప్రత్యక్షమైన వార్త.
యెరూషలేము. ఆదివారం సాయంత్రం
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లూకా రాసిన సువార్త 24:33–35
24:33 అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని 34 “ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు” అని చెప్పుకుంటున్నారు. వారది విని 35 దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియజేశారు.
తోమా లేనప్పుడు శిష్యులకు యేసు ప్రత్యక్షమవడం
ఆశ్చర్యచకితులైన శిష్యులకు యేసు ప్రత్యక్షమై (తోమా అక్కడ లేడు), వారికి ఒక కార్యబాధ్యతను అప్పగిస్తాడు. వారు తోమాను నమ్మించలేకపోతారు.
యెరూషలేము. ఆదివారం సాయంత్రం
మార్కు రాసిన సువార్త 16:14
16:14 ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు.
లూకా రాసిన సువార్త 24:36–43
24:36 వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37 అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38 అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు?
39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
41 అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు.
యోహాను రాసిన సువార్త 20:19–25
20:19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
20 ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
21 అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22 ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
24 పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు.
యేసు మళ్లీ ప్రత్యక్షమవడం, తోమాకు నమ్మకం కలగడం
మరుసటి ఆదివారం రాత్రి యేసు శిష్యులకు ప్రత్యక్షమవుతాడు, తోమాకు నమ్మకం కలుగుతుంది.
యెరూషలేము
యోహాను రాసిన సువార్త 20:26–31
20:26 ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. 27 తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు.
28 దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. 29 అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు.
30 యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. 31 కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.