కాలం 6: రెహబాము నుండి బబులోనులో ప్రవాసం వరకు

రెహబాము సింహాసనం అధిష్ఠించినప్పటి నుండి బబులోనులో చెర వరకు.

భాగం 1: రెహబాము పరిపాలన

యూదా రాజ్యం

పది గోత్రాల తిరుగుబాటు

క్రీ.పూ. 975

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 14:21

21 యూదాదేశంలో సొలొమోను కొడుకు రెహబాము పాలించాడు. రెహబాము 41 ఏళ్ల వయస్సులో పరిపాలించడం మొదలెట్టాడు. తన పేరు నిలపడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న యెరూషలేము అనే పట్టణంలో అతడు 17 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.

1 రాజులు 12:1–24

1 రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు. 2 నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు. 3 ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు. 4 “మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”

5 అందుకు రాజు “మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు. 6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు. 7 వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు.

8 అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని 9 “మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు. 10 అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది. 11 మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

12 “మూడో రోజు నా దగ్గరికి రండి” అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు. 13 అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు. 14 “మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

15 ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు. 16 కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు:

“దావీదు వంశంతో మాకేం సంబంధం?

యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది?

ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి.

దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.”

ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు. 17 అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.

18 తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు. 19 ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.

20 యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు. 21 రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు.

22 కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు. 23 “నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు, 24 యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.

రెహబాము యూదాను పరిపాలించడం క్రీ.పూ. 973

2 దినవృత్తాంతాలు 11:5–12:1

5 రెహబాము యెరూషలేములో నివాసముండి యూదా ప్రాంతంలో పురాలకు ప్రాకారాలు కట్టించాడు. 6 అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, 7 బేత్సూరు, శోకో, అదుల్లాము, 8 గాతు, మారేషా, జీఫు, 9 అదోరయీము, లాకీషు, అజేకా, 10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా, బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు. 11 అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి, వాటిలో సైన్యాధికారులను ఉంచి, వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. 12 వాటిలో డాళ్ళు, శూలాలు ఉంచి ఆ పట్టణాలను శక్తివంతంగా తయారు చేశాడు. యూదా వారు, బెన్యామీనీయులు అతని వైపు నిలబడ్డారు.

13 ఇశ్రాయేలువారి మధ్య నివసిస్తున్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాల సరిహద్దులు దాటి అతని దగ్గరికి వచ్చారు. 14 యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.

15 యరొబాము బలిపీఠాలకు దయ్యాలకు తాను చేయించిన దూడవిగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు. 16 ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. 17 వారు మూడు సంవత్సరాలు దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే అనుసరించారు. ఆ మూడు సంవత్సరాలూ వారు యూదా రాజ్యాన్ని బలపరచి సొలొమోను కొడుకు రెహబాముకు సహాయం చేశారు.

18 దావీదు కొడుకు యెరీమోతు కుమార్తె అయిన మహలతును రెహబాము వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కొడుకు ఏలీయాబు కుమార్తె అయిన అబీహాయిలు. 19 అతనికి యూషు, షెమర్యా, జహము అనే కొడుకులు పుట్టారు. 20 తరవాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతులు పుట్టారు.

21 రెహబాముకు 18 మంది భార్యలు 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు.

22 రెహబాము మయకాకు పుట్టిన అబీయాను రాజుగా చేయాలని ఆలోచించి, అతని సోదరుల మీద ప్రధానిగా, అధిపతిగా అతణ్ణి నియమించాడు. 23 అతడు మంచి మెలకువతో పరిపాలించాడు. తన కుమారుల్లో మిగిలిన వారిని అతడు యూదా, బెన్యామీనులకు చెందిన ప్రదేశాల్లోని ప్రాకార పురాల్లో అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన ఆస్తినిచ్చి వారికి పెళ్ళిళ్ళు చేశాడు.

12:1 రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు.

1 రాజులు 14:22–24

22 యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు. 23 వాళ్ళు ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా పూజా స్థలాలను కట్టి, విగ్రహాలు నిలిపి, అషేరా దేవతాస్తంభాలను ఉంచారు. 24 యూదా దేశంలో దేవస్థానాలకు అనుబంధంగా మగ వ్యభిచారులు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజలు చేసే నీచమైన పనులను యూదావారు కూడా చేస్తూ వచ్చారు.