ఏడవ బూర: సంఘం ఆనందిస్తుంది

ఏడవ బూర మోగుతుంది. 1260 సంవత్సరాల ముగింపులో సాక్షులు సాధిస్తారని ఆశిస్తున్న విజయాన్ని బట్టి విశ్వవ్యాప్త సంఘం ఆనందిస్తుంది.

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 11:15–18

15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.” 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.

17 “ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.

మహాసర్పం సంఘాన్ని హింసిస్తుంది

చిన్న గ్రంథపు చుట్టలోని రెండవ భాగం. ప్రసవవేదనతో మగబిడ్డను కంటున్న స్త్రీ, ఏడు తలలు, పది కొమ్ములు గల మహాసర్పం ఆమెను అరణ్యంలోకి తరిమివేయడం అనే ప్రతీకల ద్వారా, ఈ లోకంలోకి మొదట చెడును తీసుకువచ్చిన దురాత్మ క్రీస్తు సంఘాన్ని హింసించడం గురించి ఇది ప్రవచిస్తుంది. ఆ సంఘం నిజమైన, నమ్మకమైన క్రైస్తవులను కంటుంది. ఈ పోరాటం కూడా 606 నుండి 1866 వరకు 1260 సంవత్సరాలు కొనసాగుతుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 11:19–12:17

19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.

12:1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది. 2 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.

3 ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.

5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు. 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1, 260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.

7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.

10 అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.

12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.

13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు. 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెండు రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది. 15 కాబట్టి ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు. 16 కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది.

17 అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.

దురాత్మ ప్రతినిధి రోమ్ అధికారమే

చిన్న గ్రంథపు చుట్టలోని మూడవ భాగం. 1260 సంవత్సరాలు దేవుని నిజమైన సంఘాన్ని హింసించిన దురాత్మ ప్రతినిధిని, రోమ్ అధికారానికి మాత్రమే సరిపోయే లక్షణాలతో ఇది వర్ణిస్తుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 13:1–10

12:18 దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.

1 తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.

2 నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు. 3 దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు. 4 ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు. 5 బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.

6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. 7 ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది. 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.

9 మీకు చెవులుంటే వినండి!

10 చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు.

కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు.

పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.

రోమ్ సంఘపు ఆధ్యాత్మిక పాలన

చిన్న గ్రంథపు చుట్టలోని నాలుగవ భాగం. 1260 సంవత్సరాల కాలంలో ఐరోపాలోని లౌకిక అధికారాల మద్దతు, ఆమోదం పొందిన రోమ్ సంఘపు ఆధ్యాత్మిక పాలనను ఇది చిత్రిస్తుంది.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 13:11–18

11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. 12 వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.

13 వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.

15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. 16 ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు.

17 ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం. 18 ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.