రెండవ దేవాలయ ప్రతిష్ఠ

క్రీ.పూ. 515

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎజ్రా 6:14–22

14 హగ్గయి ప్రవక్త, జెకర్యా ప్రవక్తల హెచ్చరికలతో, వారి పర్యవేక్షణలో యూదుల పెద్దలు ఆలయం కట్టిస్తూ పని సవ్యంగా జరిపించారు. ఈ విధంగా కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పర్షియా దేశపు రాజుల ఆజ్ఞ ప్రకారం దేవుని ఆజ్ఞను అనుసరించి ఆలయం నిర్మిస్తూ చివరకూ ఆ పని పూర్తి చేశారు.

15 దర్యావేషు రాజు పాలనలో ఆరో సంవత్సరం అదారు నెల మూడో రోజుకి మందిర నిర్మాణం పూర్తి అయింది. 16 అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, చెర నుండి విడుదలైన మిగిలిన వారు ఆనందంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. 17 దేవుని ఆలయ ప్రతిష్ఠ సమయంలో 100 ఎద్దులను, 200 పొట్టేళ్ళను, 400 గొర్రె పిల్లలను వధించారు. ఇవిగాక, ఇశ్రాయేలీయులందరి పక్షంగా పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలు గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతులను బలిగా అర్పించారు.

18 వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించడానికి మోషే గ్రంథంలో రాసి ఉన్న తరగతుల ప్రకారం యాజకులను, వరసల ప్రకారం లేవీయులను నియమించారు.

19 చెర నుండి విడుదల పొందినవారు మొదటి నెల 14 వ రోజున పస్కా పండగ ఆచరించారు. 20 యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని చెర నుండి విడుదల పొందిన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా పశువును వధించారు. 21 చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు వాటిని తిన్నారు. ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి ప్రజలు దేవుడైన యెహోవా ఆశ్రయం కోరి అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారు కూడా వచ్చి పులియని రొట్టెలు తిని ఏడు రోజుల పండగను ఆనందంతో జరుపుకున్నారు. 22 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు.

కీర్తనలు 48

ఒక పాట, కోరహు వారసుల కీర్తన.

1 మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.

2 అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.

3 దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.

4 చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.

5 వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.

6 వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.

7 తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.

8 సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.

9 దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.

10 దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.

11 న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ.

12 సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.

13 తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.

14 ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.

కీర్తనలు 81

ప్రధాన సంగీతకారుని కోసం, గిత్తీతు రాగంతో పాడేది. ఆసాపు కీర్తన.

1 మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి.

2 పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి.

3 అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.

4 అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ.

5 ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను.

6 వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి.

7 నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. సెలా.

8 నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది!

9 ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు.

10 నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.

11 అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు.

12 కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను.

13 అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది!

14 అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను.

15 యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!

16 అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను.

కీర్తనలు 146

1 యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు.

2 నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.

3 రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు.

4 వాళ్ళ ఊపిరి ఆగిపోగానే మట్టిలో కలసిపోతారు. ఆ దినాన వాళ్ళ పథకాలన్నీ ముగిసిపోతాయి.

5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.

6 ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

7 దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.

8 యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు.

9 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

10 యెహోవా శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడు. సీయోనూ, ఆయన తరతరాలకు నీ దేవుడు. యెహోవాను స్తుతించండి.