భాగం 6: అహజ్యా పాలన

యూదా రాజ్యం

క్రీ.పూ. 884

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 8:25

25 అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాము పరిపాలన పన్నెండో సంవత్సరంలో యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా పరిపాలించడం ప్రారంభించాడు.

2 దినవృత్తాంతాలు 22:1–7

1 యెరూషలేము నివాసులు యెహోరాము ఆఖరి కొడుకు అహజ్యాను అతనికి బదులు రాజుగా చేశారు. ఎందుకంటే, అరబీయులతో కూడ శిబిరం పైకి దండెత్తి వచ్చినవారు అతని పెద్దకొడుకులందరినీ చంపేశారు. ఈ విధంగా యూదారాజు యెహోరాము కొడుకు అహజ్యా రాజయ్యాడు.

2 అహజ్యా పరిపాలన మొదలు పెట్టినప్పుడు 42 ఏళ్ల వయసులో యెరూషలేములో ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. 3 దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పిస్తూ వచ్చింది, కాబట్టి అతడు కూడా అహాబు ఇంటి వారి పద్ధతుల్లో నడిచాడు.

4 అహాబు ఇంటివారు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత వారు అతనికి సలహాదారులుగా ఉండి అతని నాశనానికి కారణమయ్యారు. 5 వారి సలహా ప్రకారమే అతడు కూడా ప్రవర్తించాడు. అతడు రామోతు గిలాదులో అరాము రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి అహాబు కొడుకూ, ఇశ్రాయేలు రాజూ అయిన యెహోరాముతో కూడా వెళ్ళాడు. అరామీయులు యెహోరామును గాయపరిచారు.

6 అరాము రాజు అయిన హజాయేలుతో తాను రమాలో చేసిన యుద్ధంలో తనకు తగిలిన గాయాలను బాగుచేసుకోడానికి అతడు యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అహాబు కొడుకు యెహోరాము గాయపడ్డాడని విని యూదా రాజు యెహోరాము కొడుకు అహజ్యా అతనిని చూడడానికి యెజ్రెయేలు వెళ్ళాడు.

7 యెహోరాము దగ్గరికి అహజ్యా రావడం వలన దేవుడు అతనికి నాశనం కలిగించాడు. అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలం చేయడానికి యెహోవా అభిషేకించిన నింషీ కొడుకు యెహూ మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్ళాడు.

2 రాజులు 9:27

27 జరిగిందంతా చూసిన యూదా రాజు అహజ్యా బేత్ హగ్గాన్ పట్టణం దారిలో తన రథం పై పారిపోయాడు. కానీ యెహూ అతణ్ణి తరిమాడు. “ఆ రథంలోనే అతణ్ణి చంపండి” అంటూ తన సేనానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఇబ్లెయాముకు సమీపంలో ఉన్న గూరుకు వెళ్ళే దారిలో అతనిపై బాణాలు వేసి కొట్టారు. అహజ్యా తన రథంలోనే మెగిద్దోకు వెళ్ళి అక్కడ చనిపోయాడు.

2 దినవృత్తాంతాలు 22:8–9

8 యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదావారి అధికారులనూ, అహజ్యాకు సేవచేస్తున్న అహజ్యా సోదరుల కొడుకులనూ చూసి వారిని చంపేశాడు. 9 తరువాత అతడు అహజ్యా కోసం వెతికాడు. అతడు షోమ్రోనులో దాగి ఉంటే వారు అతణ్ణి పట్టుకుని యెహూ దగ్గరికి తీసుకువచ్చారు. వారు అతణ్ణి చంపిన తరువాత “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కొడుకు గదా” అనుకుని అతణ్ణి పాతిపెట్టారు. కాబట్టి రాజ్యమేలడానికి అహజ్యా ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు.

2 రాజులు 9:28–29

28 అతని సేవకులు అతణ్ణి రథం మీద యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. దావీదు నగరంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి సమాధి చేశారు.

29 ఈ అహజ్యా అహాబు కొడుకు యెహోరాము పరిపాలన పదకొండో సంవత్సరంలో యూదాకు రాజు అయ్యాడు.

2 రాజులు 8:26–29

26 అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతనికి ఇరవై రెండేళ్ళు. ఇతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలన చేశాడు. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజు ఒమ్రీ కూతురు. 27 అహజ్యా అహాబు కుటుంబానికి అల్లుడు. కాబట్టి అహాబు కుటుంబానికి చెందిన వాడిలాగే ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి దుర్మార్గంగా కనిపించేదే చేశాడు.

28 అతడు అహాబు కొడుకు యెహోరాముతో కలసి రామోత్గిలాదు దగ్గర సిరియా రాజు హజాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ సిరియా సైన్యం యెహోరామును గాయపరిచింది. 29 యెహోరాము సిరియా రాజు హజాయేలుతో రమా దగ్గర యుద్ధం చేసినప్పుడు తనకు కలిగిన గాయాలను నయం చేసుకోడానికి యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చాడు. యూదా రాజూ, యెహోరాము కొడుకూ అయిన అహజ్యా, అహాబు కొడుకు యెహోరాము జబ్బు పడ్డాడని తెలుసుకుని అతణ్ణి పరామర్శించడానికి యెజ్రెయేలుకి వచ్చాడు.

ఇశ్రాయేలు రాజ్యం క్రీ.పూ. 885

ఇశ్రాయేలుపై యెహోరాము పాలన ముగింపు

హజాయేలు కుట్ర

2 రాజులు 8:7–15

7 ఎలీషా దమస్కుకి వచ్చాడు. అక్కడ సిరియా రాజు బెన్హదదు జబ్బు పడి ఉన్నాడు. “దేవుని మనిషి ఇక్కడికి వచ్చాడు” అని రాజుకు చెప్పారు. 8 రాజు హజాయేలును పిలిచాడు. “నీవు ఒక కానుక తీసుకుని దేవుని మనిషి దగ్గరికి వెళ్ళు. ‘నాకు నయమౌతుందా లేదా’ అని అతని ద్వారా యెహోవా దగ్గర సంప్రదించు” అని చెప్పాడు. 9 కాబట్టి హజాయేలు ఎలీషాకు కానుకగా దమస్కులో దొరికే మంచి వస్తువులను తీసుకుని వాటిని నలభై ఒంటెల మీద ఎక్కించి బయల్దేరాడు. హజాయేలు వచ్చి ఎలీషా ఎదుట నిలబడ్డాడు. “సిరియా రాజూ, నీ కొడుకులాంటి వాడూ అయిన బెన్హదదు తన రోగం నయమౌతుందా అని అడగడానికి నన్ను పంపాడు” అన్నాడు.

10 అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళు. అతనికి తప్పక నయమౌతుంది అని చెప్పు. కానీ అతడు కచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు చూపించాడు” అన్నాడు. 11 ఇలా చెప్పి ఎలీషా హజాయేలు సిగ్గు పడేంతగా అతన్నే చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. 12 అప్పుడు హజాయేలు “నా ప్రభూ, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. దానికి ఎలీషా “ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నీవు చేయబోయే దుర్మార్గపు పనులు నాకు తెలుసు. వాళ్ళ ప్రాకారాలను నీవు తగలబెడతావు. వాళ్ళల్లో యువకులను కత్తితో హతమారుస్తావు. పిల్లలను నేలకు కొట్టి ముక్కలు చేస్తావు. గర్భవతుల కడుపులు చీరేస్తావు” అని జవాబిచ్చాడు.

13 అందుకు హజాయేలు “నేను కుక్కలాంటి వాణ్ణి. ఇంత పెద్ద పని నేనెలా చేస్తాను?” అన్నాడు. దానికి ఎలీషా “నీవు సిరియాకు రాజు అవుతావు. నాకు యెహోవా చూపించాడు” అన్నాడు. 14 అతడు ఎలీషా దగ్గరనుండి తన రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని అడిగాడు. అతడు “నీకు తప్పకుండా నయమౌతుంది అన్నాడు” అని జవాబిచ్చాడు. 15 కాని ఆ తరువాత రోజు హజాయేలు ఒక కంబళి తీసుకుని నీటితో తడిపి దాన్ని రాజు ముఖంపై పరిచాడు. దాంతో రాజు చనిపోయాడు. అతని స్థానంలో హజాయేలు రాజు అయ్యాడు.