మంచి కాపరి ఉపమానం
మంచి కాపరి ఉపమానంలో (రూపకాలంకార కథలో) యేసు విరోధులైన పరిసయ్యులను చిత్రిస్తూ, తాను తన మంద కోసం చనిపోయి తిరిగి బ్రతకబోతున్నానని సూచిస్తాడు.
యెరూషలేము
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన సువార్త 10:1–21
10:1 మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. 2 ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. 4 తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. 5 వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి.
6 యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. 7 అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. 8 నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు.
9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను.
11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. 12 జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. 13 జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు.
14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15 నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16 ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
17 నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.”
19 ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి. 20 వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు. 21 ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.
డెబ్బైమంది పరిచర్య యాత్ర
డెబ్బైమంది పరిచర్య యాత్ర, వారు తిరిగి వచ్చినప్పుడు వారి పనిని బట్టి క్రీస్తు ఆనందించడం.
ఇక్కడ లూకా మాత్రమే తెలియజేసిన విషయాలు ఉన్నాయి. ఇవి బహుశా యూదయలో జరిగి ఉంటాయి. వీటిలో కొన్ని మత్తయి, మార్కు తెలియజేసిన గలిలయ పరిచర్యలోని సంఘటనలను, ప్రసంగాలను పోలి ఉన్నాయి.
బహుశా యూదయలో
(పన్నెండుమంది పరిచర్య యాత్రతో పోల్చండి.)
లూకా రాసిన సువార్త 10:1–24
10:1 ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
2 వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. 3 మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. 4 మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు. 5 మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి. 6 శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది. 7 వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.ఇంటింటికీ తిరగవద్దు.
8 మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి. 9 ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి. 10 ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే, 11 మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి, ‘మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి’ అని చెప్పండి. 12 తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.
13 “అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు. 14 అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది. 15 కపెర్నహూమా, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు. 16 మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.”
17 ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18 అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19 ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20 అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.
21 ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”
22 “నా తండ్రి నాకు అన్నిటినీ అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప మరెవరూ ఎరగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరగరు.” 23 అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, “మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి. 24 అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేకపోయారు, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.