లేవీయులు ప్రతిష్ఠించబడటం

క్రీ.పూ. 1490

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంఖ్యాకాండం 8

1 తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2 “నువ్వు అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు. దీపాలను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా చూడు.”

3 అహరోను అలాగే చేశాడు. మోషేకి యెహోవా ఆజ్ఞాపించినట్టే దీపాల కాంతి ఆ ఏడు దీపాల స్తంభానికి ఎదురుగా పడేలా వాటిని వెలిగించాడు. 4 దాని అడుగు నుండి పైన పువ్వుల వరకూ ఆ దీప స్తంభాన్ని సాగగొట్టిన బంగారంతో చేశారు. దాన్ని ఎలా చేయాలో యెహోవా మోషేకి చూపించాడు.

5 యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 6 “ఇశ్రాయేలు ప్రజల్లోనుండి లేవీ వారిని వేరు చెయ్యి. తరువాత వారిని పవిత్రం చెయ్యి.

7 వారిని పవిత్రం చేయడానికి ఇలా చెయ్యి. పరిహారం కోసం వారిపై పవిత్రజలాన్ని చిలకరించు. వారిల్లో ప్రతి ఒక్కడూ మంగలి కత్తితో తన శరీరం పై ఉన్న జుట్టు అంతటినీ నున్నగా కత్తిరించుకుని, తన బట్టలు ఉతుక్కుని, తనను పవిత్రం చేసుకోవాలి. 8 తరువాత వారు ఒక కోడెదూడను, దాని నైవేద్య అర్పణగా నూనె కలిపిన సన్నని గోదుమ పిండినీ తీసుకు రావాలి. పాపాల కోసం చేసే బలిగా మరో కోడెని తీసుకు రావాలి.

9 తరువాత నువ్వు వారిని సన్నిధి గుడారం ఎదుటకి తీసుకు రావాలి. ఇశ్రాయేలు సమాజాన్నంతా సమావేశ పరచాలి. 10 లేవీ వారిని యెహోవా నైన నా ఎదుట నిలబెట్టు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారిపైన తమ చేతులుంచాలి. 11 లేవీ వారిని అహరోను నా ఎదుట సమర్పించాలి. ఇశ్రాయేలు ప్రజల తరపున వారిని కదలిక అర్పణగా నా ఎదుట కదిలించాలి. లేవీ వారు నాకు సేవ చేయడానికి అతడు ఈ విధంగా చేయాలి.

12 లేవీ వారు ఆ కోడెదూడల తలలపై తమ చేతులుంచాలి. లేవీ వారి కోసం పరిహారం చేయడానికి పాపం కోసం అర్పణగా ఒక ఎద్దునూ దహనబలిగా మరొక ఎద్దునూ నువ్వు నాకు అర్పించాలి. 13 వారిని అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా హాజరు పరచి నాకు కదలిక అర్పణగా నా ఎదుట నిలబెట్టాలి.

14 ఈ విధంగా నువ్వు ఇశ్రాయేలు ప్రజల నుండి లేవీ వారిని వేరు చేయాలి. లేవీ వంశం వారు నాకు చెందిన వారుగా ఉంటారు. 15 ఇదంతా అయ్యాక లేవీ వారు సేవ చేయడానికి సన్నిధి గుడారంలోకి వెళ్ళాలి. నువ్వు వారిని పవిత్ర పరచాలి. వారిని నాకు కదలిక అర్పణ గా నా ఎదుట వారిని ఎత్తి పట్టుకోవాలి.

16 ఇలా తప్పకుండా చెయ్యి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లోనుండి వీరు సంపూర్ణంగా నా వారు. ఇశ్రాయేలు సంతానంలో గర్భం నుండి బయటకు వచ్చే ప్రతి మొదటి మగ పసికందు స్థానాన్ని వీరు తీసుకుంటారు. లేవీ వారిని నేను తీసుకున్నాను. 17 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి మొదటి సంతానం నాదే. ఇది మనుషులకీ, పశువులకీ వర్తిస్తుంది. ఈజిప్టులో మొదటి సంతానాన్ని నేను సంహరించినప్పుడు వీరిని నాకోసం ప్రత్యేకించుకున్నాను.

18 మొదటి సంతానానికి బదులుగా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేవీ వారిని తీసుకున్నాను. 19 వారిని అహరోనుకీ అతని కొడుకులకీ ఒక బహుమానంగా ఇచ్చాను. సన్నిధి గుడారంలో ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడానికి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు వాళ్లకి ఎలాంటి తెగులు హాని చేయకుండా వారి కోసం పరిహారం చేయడానికి నేను వీరిని నియమించాను.”

20 అప్పుడు మోషే, అహరోనూ, ఇశ్రాయేలు సమాజమంతా అలాగే చేశారు. లేవీ వారి విషయంలో యెహోవా మోషేకి ఆదేశించింది అంతా అమలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు లేవీ వాళ్లకి ఇదంతా చేశారు. 21 లేవీ వారు తమ బట్టలు ఉతుక్కుని పవిత్రం అయ్యారు. వారిని పవిత్రం చేయడానికి అహరోను వారిని యెహోవా ఎదుట సమర్పించి వారి కోసం పరిహారం చేశాడు.

22 తరువాత లేవీ వారు అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా సన్నిధి గుడారంలో తమ సేవ చేయడానికి వెళ్ళారు. లేవీ వారిని గురించి యెహోవా మోషేకి ఆదేశించిన దాని ప్రకారం ఇది జరిగింది. లేవీ వాళ్లకందరికీ ఇలాగే జరిగించారు.

23 యెహోవా తిరిగి మోషేతో మాట్లాడాడు. 24 “ఇరవై ఐదు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న లేవీ వాళ్లందరికీ ఇలాగే చేయాలి. వారు సన్నిధి గుడారంలో సేవ చేయడం కోసం చేరాలి.

25 అయితే వాళ్లకి యాభై ఏళ్ళు వచ్చాక ఈ విధంగా చేసే సేవ నుండి విరమించాలి. వారు అక్కడితో ఆగిపోవాలి. 26 సన్నిధి గుడారంలో పని చేసే తమ సోదరులకు వారు సహాయం చేయవచ్చు గానీ సేవ నుండి మానుకోవాలి. ఈ విషయాలన్నిటిలో నువ్వు వాళ్లకి మార్గ దర్శనం చేయాలి.”

వెండి బూరల ఉపయోగం

సంఖ్యాకాండం 10:1–10

1 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు. 2 “రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.

3 సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి. 4 యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి. 5 మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.

6 మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి. 7 సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు. 8 యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.

9 మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.

10 మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”

మేఘం ప్రజలను ఎలా నడిపించింది

సంఖ్యాకాండం 9:15–23

15 మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది. 16 అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది. 17 గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.

18 యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు. 19 ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.

20 కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు. 21 కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.

22 ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు. 23 యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.