దేశాన్ని పంచడం

క్రీ.పూ. 1444

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోషువా 14:1–5

1 ఇశ్రాయేలీయులు కనాను దేశంలో పొందిన స్వాస్థ్యాలు ఇవి. 2 మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించిన విధంగా యాజకుడు ఎలియాజరూ నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల పితరుల కుటుంబాల పెద్దలూ చీట్లు వేసి, తొమ్మిది గోత్రాల వారికి అర్థగోత్రపు వారికి ఆ స్వాస్థ్యాలను పంచిపెట్టారు. 3 మోషే రెండు గోత్రాలకూ అర్థగోత్రానికీ యొర్దాను అవతలి వైపున స్వాస్థ్యాలను ఇచ్చాడు. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమూ ఇవ్వలేదు 4 యోసేపు వంశస్తులైన మనష్షే, ఎఫ్రాయిములను రెండు గోత్రాలుగా పరిగణించారు. లేవీయులకు నివసించడానికి పట్టణాలు, వారి పశువులకు, మందలకు వాటి సమీప భూములు తప్ప ఆ దేశంలో స్వాస్థ్యమేమీ ఇవ్వలేదు. 5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా చేసి ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని పంచుకున్నారు.

రెండున్నర గోత్రాల స్వాస్థ్యం

యెహోషువా 13:15–33

15 వారి వంశాలను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాడు. 16 వారి సరిహద్దు ఏదంటే, అర్నోను నది లోయ పక్కన ఉన్న అరోయేరు మొదలు ఆ లోయలోని పట్టణం నుండి మేదెబా దగ్గర మైదానమంతా. 17 ఇది గాక రూబేను గోత్రికులు హెష్బోను, దాని మైదానంలోని పట్టణాలన్నీ, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెయోను, 18 యాహసు, కెదేమోతు, మేఫాతు, 19 కిర్యతాయిము, సిబ్మాలోయ లోని కొండ మీది శెరెత్షహరు ప్రాంతాలు దక్కించుకున్నారు. 20 అంతేకాక, బేత్పయోరు, పిస్గా కొండచరియలు, బెత్యేషీమోతు, 21 మైదానంలోని పట్టణాలు అన్నీ, ఇంకా ఎవీరేకెము, సూరు, హోరు, రేబ, అనే మిద్యాను రాజుల దేశాన్నీ అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతటినీ వారికి మోషే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇవి హెష్బోనులో పరిపాలించే సీహోను అధికారం కింద ఉన్న ప్రాంతాలు. ఇతన్నిమోషే ఓడించాడు.

22 ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు, సోదెగాడు అయిన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపారు. 23 యొర్దాను ప్రదేశమంతా రూబేనీయులకు సరిహద్దు. అదీ, దానిలోని పట్టణాలూ, గ్రామాలూ రూబేనీయుల వంశాల ప్రకారం వారికి కలిగిన స్వాస్థ్యం.

24 మోషే గాదు గోత్రానికి, అంటే గాదీయులకు వారి వంశాల ప్రకారం స్వాస్థ్యమిచ్చాడు. 25 వారి సరిహద్దు యాజెరు, గిలాదు పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకూ అమ్మోనీయుల దేశంలో సగభాగం. 26 హెష్బోను మొదలు రామత్మిజ్బెతు బెతోనిము వరకూ, మహనయీము మొదలు దెబీరు సరిహద్దు వరకూ. 27 లోయలో బేతారాము బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను, అంటే హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషం, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరెతు సముద్రతీరం వరకూ ఉన్న యొర్దాను ప్రదేశం. 28 ఇవీ, వారి వంశాల ప్రకారం గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణాలు, గ్రామాలు.

29 మోషే మనష్షే అర్థగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. అది వారి వంశాల ప్రకారం మనష్షీయుల అర్థగోత్రానికి స్వాస్థ్యం. 30 వారి సరిహద్దు మహనయీము మొదలు బాషాను అంతా, బాషాను రాజైన ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరు పురాలు అయిన అరవై పట్టణాలు, 31 గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయి అనే బాషానులోని ఓగు రాజ్య పట్టణాలు. ఇవన్నీ మనష్షే కుమారుడు మాకీరు, అనగా మాకీరీయుల్లో సగం మందికి వారి వంశాల ప్రకారం కలిగాయి. 32 ఇవీ, యెరికో దగ్గర తూర్పు దిక్కున యొర్దాను అవతల ఉన్న మోయాబు మైదానంలో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యాలు.

33 లేవీ గోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్ట లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టుగా ఆయనే వారికి స్వాస్థ్యం.

కాలేబు స్వాస్థ్యం

యెహోషువా 14:6–15

6 యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు కెనెజీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలా మనవి చేశాడు. “కాదేషు బర్నేయలో దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గూర్చీ నిన్ను గూర్చీ చెప్పిన మాట నీకు తెలుసు. 7 దేశాన్ని వేగుచూడడానికి యెహోవా సేవకుడు మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాల వయసు. ఎవరికీ భయపడకుండా నేను చూసింది చూసినట్టే అతనికి సమాచారం తెచ్చాను.

8 నాతో వచ్చిన నా సోదరులు ప్రజల హృదయాలు హడలిపోయేలా చేసినా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. 9 ఆ రోజు మోషే నాతో ప్రమాణపూర్వకంగా ‘నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది’ అన్నాడు.

10 యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పినట్టే నన్ను సజీవంగా కాపాడాడు. ఇదిగో, నాకిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు. 11 మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది. 12 కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను.”

13 యెహోషువ యెఫున్నె కుమారుడు కాలేబును దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాడు కాబట్టి హెబ్రోను కాలేబుకు నేటివరకూ స్వాస్థ్యంగా ఉంది. 15 పూర్వం హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనేవాడు అనాకీయుల్లో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉండేది.

యెహోషువా 15:13–19

13 యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను. 14 షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు. 15 అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు. 16 కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే 17 కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు. 18 ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు. 19 “నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.