న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం (continued)
క్రీ.పూ. 1491
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు. 2 దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు. 3 ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు.
4 నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి. 5 నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.
6 దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు 7 అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను. 8 లంచాలు తీసుకోవద్దు. చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.
9 విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
10 ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. 11 ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.
12 ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి. 13 నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.
14 సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి. 15 పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.
16 మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి. 17 సంవత్సరంలో మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో సమకూడాలి.
18 నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయం దాకా నిలవ ఉండకూడదు. 19 నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
20 నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను. 21 ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే ఆయనకు నా పేరు పెట్టాను. 22 మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.
23 ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను. 24 మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.
25 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు. 26 మీ దేశంలో గర్భస్రావాలు ఉండవు. సంతాన సాఫల్యత లేని వాళ్ళు మీ దేశంలో ఉండరు. మీరు జీవించే రోజుల లెక్క పూర్తి చేస్తాను. 27 నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.
28 మీకు ముందుగా పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాను. అవి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాయి. 29 అయితే ఒక్క సంవత్సరంలోనే వాళ్ళను వెళ్లగొట్టను. ఎందుకంటే దేశం పాడైపోతుంది. క్రూరమృగాలు విస్తరించి మీకు ప్రమాదకరంగా మారతాయి. 30 మీరు వృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దాకా వాళ్ళను కొంచెం కొంచెంగా మీ ఎదుట నుండి వెళ్ళగొడతాను.
31 ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు. 32 మీరు వాళ్ళతో గానీ, వాళ్ళ దేవుళ్ళతో గానీ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు. 33 వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.
మోషే కొండ ఎక్కడం
1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి. 2 మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.”
3 మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం” అని ముక్త కంఠంతో జవాబిచ్చారు. 4 మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు. 5 తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.
6 అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు. 7 తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం” అన్నారు. 8 మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. “ఇది నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే” అని చెప్పాడు.
9 ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు. 10 అక్కడ వారికి ఇశ్రాయేలీయుల దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆయన పాదాల కింద మెరిసిపోతున్న నీలాలు అలికినట్టున్న వేదిక ఉంది. అది ఆకాశమంత నిర్మలంగా ఉంది. 11 ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.
12 అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.” 13 మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు.
14 మోషే ఇశ్రాయేలు పెద్దలతో “మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేంత వరకూ ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి” అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు.
15 మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది. 16 యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు.
17 యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది. 18 అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.