హెబ్రీయ బానిసలను తిరిగి తీసుకోవడం

కల్దీయులు వెళ్ళిపోయినప్పుడు, హెబ్రీయ బానిసలను తిరిగి తీసుకుంటారు.

క్రీ.పూ. 589

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యిర్మీయా 34:11–22

11 అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.

12 కాబట్టి, యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు, 13 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, దాస్య గృహమైన ఐగుప్తుదేశం నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చిన రోజు వాళ్ళతో ఈ ఒప్పందం చేశాను. 14 నీకు అమ్మకం జరిగాక, నీకు ఆరు సంవత్సరాలు దాస్యం చేసిన హెబ్రీయులైన మీ సహోదరులకు, ఏడు సంవత్సరాలు తీరిన తరువాత, విడుదల ప్రకటించాలి. కాని మీ పితరులు శ్రద్ధ వహించలేదు, నా మాట వినలేదు.”

15 “మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకుని, ఒక్కొక్కడు తన పొరుగువాడికి విడుదల ప్రకటిస్తామని చెప్పి, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నా సన్నిధిలో ఒప్పందం చేశారు. నా దృష్టిలో ఏది మంచిదో అది చెయ్యడం మొదలుపెట్టారు. 16 కాని, తరువాత మీరు మనస్సు మార్చుకుని నా పేరును అపవిత్రం చేశారు. వాళ్ళకు ఎటు ఇష్టమైతే అటు వెళ్ళగలిగేలా వాళ్ళను స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన తరువాత, అందరూ తమ దాసదాసీలను మళ్ళీ తెచ్చుకుని, తమకు దాసులుగా, దాసీలుగా ఉండడానికి వాళ్ళను బలవంతంగా మళ్ళీ పట్టుకున్నారు.”

17 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను. 18 నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు. 19 తరువాత యూదా నాయకులు, యెరూషలేము నాయకులు, నపుంసకులు, యాజకులు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దున్నపోతు రెండు భాగాల మధ్య నడిచేవాళ్ళు. ఆ దున్నపోతుకు చేసినట్టు నేను వాళ్ళకు చేస్తాను.

20 వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే శత్రువుల చేతికి వాళ్ళను అప్పగిస్తాను. వాళ్ళ శవాలు ఆకాశపక్షులకు, భూమృగాలకు ఆహారంగా ఉంటాయి. 21 యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.” 22 యెహోవా వాక్కు ఇదే. “నేను ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. వాళ్ళను ఈ పట్టణానికి మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళు దాని మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని, తగలబెడతారు. యూదా పట్టణాలను శిథిలాలుగా, నిర్జనంగా మారుస్తాను.”

యిర్మీయాను మళ్ళీ చెరసాలలో వేయడం

యిర్మీయా యెరూషలేము నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అతణ్ణి మళ్ళీ చెరసాలలో వేస్తారు.

యిర్మీయా 37:11–21

11 ఫరో సైన్యం వస్తున్నందున భయపడి కల్దీయుల సైన్యం యెరూషలేమును విడిచి వెళ్ళిపోయింది. 12 అప్పుడు యిర్మీయా బెన్యామీను దేశంలో తన వాళ్ళ దగ్గర ఒక భూభాగం తీసుకోడానికి యెరూషలేము నుంచి బయలు దేరాడు. 13 అతడు బెన్యామీను ద్వారం దగ్గర నిలబడి ఉండగా కాపలాదారుల అధికారి అక్కడ ఉన్నాడు. అతడు షెలెమ్యా కొడుకు, హనన్యా మనవడు అయిన ఇరీయా. అతడు యిర్మీయా ప్రవక్తను పట్టుకుని “నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నావు” అన్నాడు.

14 కాని యిర్మీయా “అది నిజం కాదు. నేను కల్దీయుల్లో చేరడం లేదు” అన్నాడు. అయితే అతడు యిర్మీయా మాట వినలేదు. ఇరీయా యిర్మీయాను పట్టుకుని అధికారుల దగ్గరికి తీసుకొచ్చాడు. 15 అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు.

16 యిర్మీయా భూగర్భంలో ఉన్న ఒక చెరసాల గదిలో చాలా రోజులు ఉన్నాడు. 17 తరువాత రాజైన సిద్కియా అతన్ని రప్పించడానికి ఒకణ్ణి పంపి, అతన్ని తన ఇంటికి పిలిపించి “యెహోవా దగ్గర నుంచి ఏ మాటైనా వచ్చిందా?” అని ఏకాంతంగా అతన్ని అడిగాడు. యిర్మీయా “వచ్చింది, నిన్ను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు.

18 అప్పుడు యిర్మీయా, రాజైన సిద్కియాతో ఇంకా ఇలా అన్నాడు. “నేను నీ పట్ల, నీ సేవకుల పట్ల, ఈ ప్రజల పట్ల ఏ పాపం చేశానని నన్ను చెరసాల్లో వేశావు? 19 బబులోను రాజు మీమీదకైనా, ఈ దేశం మీదకైనా రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? 20 కాని, రాజా, నా యేలినవాడా! విను. నా అభ్యర్ధన నీ ఎదుటకు రానివ్వు. నన్ను మళ్ళీ లేఖికుడైన యోనాతాను ఇంటికి తిరిగి పంపొద్దు. పంపితే నేను ఇంక అక్కడే చనిపోతాను.”

21 కాబట్టి రాజైన సిద్కియా ఆజ్ఞ జారీ చేశాడు. అతని సేవకులు ఆ ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయాను పెట్టారు. పట్టణంలో రొట్టెలున్నంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. కాబట్టి సేవకుల ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయా ఉన్నాడు.

యిర్మీయా తన ప్రవచనాలను రాజుకు మళ్ళీ చెప్పడం క్రీ.పూ. 588

రాజు తనను వేడుకున్నప్పుడు, యిర్మీయా తన మునుపటి ప్రవచనాలను మళ్ళీ చెబుతాడు.

యిర్మీయా 21

1 సిద్కియా రాజు మల్కీయా కొడుకైన పషూరునూ, మయశేయా కొడుకూ, యాజకుడైన జెఫన్యానూ పిలిపించాడు.

2 “బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి” అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.

3 యిర్మీయా వారితో ఇలా అన్నాడు. “మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి.

4 ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, ప్రాకారం వెలుపల మిమ్మల్ని ముట్టడి వేసే బబులోను రాజు మీద, కల్దీయుల మీద, మీరు ప్రయోగిస్తున్న యుద్దాయుధాలను వెనక్కి పంపించేస్తాను. వాటిని ఈ పట్టణం మధ్యలో పోగుచేయిస్తాను.

5 నేనే నా బలమైన చెయ్యి చాపి తీవ్రమైన కోపంతో, రౌద్రంతో, ఆగ్రహంతో మీమీద యుద్ధం చేస్తాను.

6 ఈ పట్టణంలోని మనుషులనూ పశువులనూ చంపేస్తాను. వాళ్ళు తీవ్రమైన అంటురోగంతో చస్తారు.”

7 యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఆ తరువాత యూదా దేశపు రాజు సిద్కియానూ అతని ఉద్యోగులనూ తెగులును, కత్తిని, కరువును తప్పించుకున్న మిగిలిన ప్రజలనూ బబులోను రాజు నెబుకద్నెజరు చేతికీ వారి ప్రాణాలను తీయాలని చూసేవాళ్ళ శత్రువుల చేతికీ అప్పగిస్తాను. అతడు వారి మీద కనికరం, జాలి ఏమీ చూపక వారిని కత్తితో చంపేస్తాడు.”

8 ఈ ప్రజలతో ఇలా చెప్పు. “యెహోవా చెప్పేదేమిటంటే, జీవమార్గం, మరణ మార్గం, నేను మీ ఎదుట ఉంచుతున్నాను.

9 ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.

10 నేను ఈ పట్టణంపై దయ చూపను. దానికి ఆపద కలిగిస్తాను. ఇది బబులోను రాజు వశమవుతుంది. అతడు దాన్ని కాల్చి వేస్తాడు.” ఇది యెహోవా వాక్కు.

11 యూదా రాజవంశం వారికి ఇలా చెప్పు. “యెహోవా మాట వినండి.”

12 దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు.

13 “లోయలో నివసించేదానా, మైదానంలోని బండవంటిదానా, ‘మా మీదికి ఎవరు వస్తారు? మా ఇళ్ళల్లో ఎవరు అడుగుపెడతారు?’ అని నువ్వు అనుకుంటున్నావు.

14 మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.” ఇది యెహోవా వాక్కు.