ప్రజల మొదటి సభ
క్రీ.పూ. 1015
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
1 గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు.
2 అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి “నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.”
3 అయితే “నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు” అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
4 ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. 5 యెహోవా నాకు చాలా మంది కొడుకులను దయ చేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద, యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో, 6 “నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నా మందిరాన్నీ, నా ఆవరణాలూ కట్టిస్తాడు. 7 ఈ రోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలూ, నా న్యాయవిధులూ పాటిస్తే, నేను అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను” అన్నాడు.
8 “కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.
9 సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు. 10 పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు.
1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.
2 ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.
3 వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.
5 రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.
6 చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు.
7 నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు.
8 దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు.
9 యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.
10 ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.
11 నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.
12 నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
13 నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.
14 అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.
15 అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.
16 దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.
బహుశా దావీదు జీవిత చరమదశలోని కీర్తన
దావీదు రాసిన స్తుతి కీర్తన
1 నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.
2 అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.
3 యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.
4 ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.
5 వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.
6 వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను.
7 నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు.
8 యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.
9 యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.
10 యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
11 నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు.
12 మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
13 నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
14 కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.
15 జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
16 నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
17 యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
18 ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
19 తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు.
20 తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.
21 నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక.