అబద్ధ ప్రవక్త హనన్యాకు శిక్ష
చుట్టుపక్కల జనాంగాల గతి ముందుగా సూచించబడుతుంది. అబద్ధ ప్రవక్త హనన్యా మరణంతో శిక్షించబడతాడు.
క్రీ.పూ. 595
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినపుడు యెహోవా దగ్గరనుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది.
2 యెహోవా నాకు ఇలా చెప్పాడు “నువ్వు కాడి, బేడీలూ చేయించుకుని నీ మెడకు కట్టుకో. 3 ఎదోం, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను దేశాల రాజుల దగ్గర నుంచి యూదా రాజు సిద్కియా దగ్గరికి యెరూషలేముకు రాయబారులు వచ్చారు. 4 ఆ రాయబారులు తమ యజమానులకు తెలియచేయాలని ఈ ఆజ్ఞ వారితో చెప్పు, సేనల ప్రభువు ఇశ్రాయేలు దేవుడు చెప్పేదేమిటంటే, మీరు మీ యజమానులకు ఈ విషయం తెలియజేయండి.
5 ‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను. 6 ఇప్పుడు దేశాలన్నిటినీ నా సేవకుడూ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు ఇస్తున్నాను. భూమి మీద తిరిగే జంతువులను కూడా అతణ్ణి సేవించడానికి ఇస్తున్నాను. 7 అతని స్వదేశానికి అంతం వచ్చే వరకూ రాజ్యాలన్నీ అతనికీ అతని కొడుకుకీ అతని మనుమడికీ సేవ చేస్తారు. ఆ తర్వాత అనేక రాజ్యాలూ గొప్ప రాజులూ అతనికి వ్యతిరేకంగా పనిచేస్తారు.
8 ఏ దేశం, ఏ రాజ్యం బబులోను రాజు నెబుకద్నెజరు సేవ చేయదో, బబులోను రాజు కాడిని తన మెడ మీద పెట్టుకోదో ఆ దేశాన్ని నేను శిక్షిస్తాను. అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకూ ఆ దేశాన్ని కత్తితో కరువుతో అంటు రోగాలతో శిక్షిస్తాను.’ ఇది యెహోవా వాక్కు.
9 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు. 10 మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరు నాశనమవుతారు. 11 అయితే ఏ ప్రజలు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి సేవ చేస్తారో ఆ ప్రజలను తమ దేశంలో నెమ్మదితో ఉండనిస్తాను. వాళ్ళు తమ భూమిని సాగుచేసుకుంటూ దానిలోనే కాపురముంటారు.” ఇది యెహోవా వాక్కు.
12 నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. “బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు. 13 బబులోను రాజుకు సేవ చేయని ప్రజలు కత్తితో గానీ కరువుతో గానీ అంటురోగాలతోగానీ చస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు, నీ ప్రజలు అలా ఎందుకు చావాలి?
14 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీతో చెప్పే ప్రవక్తలు అబద్దమే ప్రవచిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళ మాటలు వినవద్దు.” ఇది యెహోవా వాక్కు. 15 “మిమ్మల్ని మీ దేశం నుంచి దూరంగా పంపించడానికి వాళ్ళు అబద్ధ ప్రవచనాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని వెళ్లగొడతాను. మీరూ మీకు ప్రవచించే మీ ప్రవక్తలు నాశనమవుతారు.”
16 యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.’ అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు. 17 వాళ్ళ మాటలు వినవద్దు. బబులోను రాజుకు సేవ చేస్తే మీరు బతుకుతారు. ఈ పట్టణం ఎందుకు పాడైపోవాలి? 18 వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”
19 బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములోనుంచి యెహోయాకీము కొడుకు యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు బందీలుగా తీసుకుపోయినప్పుడు, 20 అతడు విడిచి పెట్టిన స్థంభాలు, సముద్రం, పీఠాలు, ఈ పట్టణంలో మిగిలిన పాత్రలను గురించి సేనల ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.
21 యెహోవా మందిరంలో యూదా రాజు రాజ భవనంలో యెరూషలేములోని మిగిలిన పాత్రలను గురించి ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 22 “వాటిని బబులోనుకు తెస్తారు. నేను వాటి కోసం అక్కడికి వెళ్ళే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు నేను వాటిని మళ్ళీ తెప్పించి ఈ స్థలంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.”
28:1 యూదా రాజు సిద్కియా పరిపాలన మొదట్లో నాలుగో సంవత్సరం అయిదో నెలలో గిబియోనువాడు, అజ్జూరు ప్రవక్త కొడుకు హనన్యా యాజకుల ఎదుట, ప్రజలందరి ఎదుట యెహోవా మందిరంలో నాతో ఇలా అన్నాడు, 2 “ఇశ్రాయేలు దేవుడు, సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘నేను బబులోను రాజు కాడిని విరిచేశాను.
3 రెండేళ్లలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలంలో నుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరంలోని పాత్రలన్నీ ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను. 4 బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కొడుకు యూదా రాజు యెకొన్యాను, బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన యూదులందరినీ ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు.”
5 అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుట, యెహోవా మందిరంలో నిలబడి ఉన్న ప్రజలందరి ఎదుట హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు, 6 “యెహోవా దీనిని చేస్తాడు గాక! యెహోవా మందిరపు పాత్రలన్నీ బందీలుగా తీసుకుపోయిన వారందరినీ యెహోవా బబులోనులో నుంచి ఈ స్థలానికి తెప్పించి నువ్వు ప్రకటించిన మాటలను నెరవేరుస్తాడు గాక! 7 అయినా నువ్వు వింటుండగా ఈ ప్రజలందరూ వింటుండగా నేను చెబుతున్న మాట విను.
8 నాకూ నీకూ ముందున్న ప్రవక్తలు, అనేక దేశాలకూ గొప్ప రాజ్యాలకూ వ్యతిరేకంగా యుద్ధాలు జరుగుతాయనీ కీడు సంభవిస్తుందనీ అంటురోగాలు వస్తాయనీ ఎప్పటినుంచో ప్రవచిస్తూ ఉన్నారు. 9 అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.
10 అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి ఆ కాడిని తీసి దాన్ని విరిచేశాడు. 11 ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘రెండేళ్ళలో నేను బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని రాజ్యాలన్నిటి మెడమీద నుంచి తొలగించి దానిని విరిచివేస్తాను.’” అప్పుడు యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.
12 హనన్యా, యిర్మీయా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తరువాత యెహోవా దగ్గర నుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది. 13 “నువ్వు పోయి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచావు గదా! దానికి బదులు ఇనుప కాడిని నేను చేయిస్తాను.’ 14 ఇశ్రాయేలు దేవుడు సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. ‘ఈ ప్రజలంతా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవ చేయాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచాను. కాబట్టి వాళ్ళు అతనికి సేవ చేస్తారు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించాను.’”
15 అప్పుడు యిర్మీయా ప్రవక్త, హనన్యాతో ఇలా అన్నాడు. “హనన్యా, విను. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజల చేత అబద్ధాలను నమ్మించావు. 16 కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’” అని చెప్పాడు. 17 ఆ సంవత్సరం ఏడో నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.