గేత్సేమనేకు వెళ్ళే దారిలో ప్రసంగం
వీధిలో అయి ఉండవచ్చు
క్రీ.శ. 30 లేదా 29
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన సువార్త 15:1–16:33
15:1 “నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. 3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు.
4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5 నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.
9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.
12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు.
15 “నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
18 “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19 మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
20 “‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21 వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. 22 నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు.
23 “నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24 ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25 ‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.
26 “తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27 మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు.
16:1 “మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను. 2 వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది. 3 నేను గాని, తండ్రి గాని వారికి తెలియదు కాబట్టి అలా చేస్తారు. 4 అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు.
5 అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. 6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది.
7 “అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.
12 “నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14 ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
16 “కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.” 17 ఆయన శిష్యుల్లో కొంతమంది “ఆయన కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంటున్నాడు. ఇది ఏమిటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, 18 కాబట్టి వారు, కొద్ది కాలం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు” అనుకున్నారు.
19 వారు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వారితో, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు’ అని నేను అన్నదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తున్నారా? 20 నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. 21 స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.
22 “అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు. 23 ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.
24 ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు. 25 ఈ సంగతులు ఇంతవరకూ తేలికగా అర్థం కాని భాషలో మీకు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది అప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజున మీరు నా పేరట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడం లేదు. 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 28 నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు.
29 ఆయన శిష్యులు, “చూడు, ఇప్పుడు నువ్వు అర్థం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30 నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేము తెలుసుకున్నాం. దీని వలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
31 యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 32 మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. 33 నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.