భాగం 7: నోవహుతో నిబంధన

క్రీ.పూ. 2347

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదికాండం 8:13–9:17

13 ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది. 14 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.

15 అప్పుడు దేవుడు నోవహుతో, 16 “నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి. 17 పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి” అని చెప్పాడు.

18 కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు. 19 ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి.

20 అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు. 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను. 22 భూమి ఉన్నంత వరకూ విత్తనాలు నాటేకాలం, కోతకాలం, వేసవి, శీతాకాలాలు, పగలూ రాత్రీ ఉండక మానవు” అని తన హృదయంలో అనుకున్నాడు.

9:1 దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2 అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.

3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. 4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.

5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. 6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. 7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.

8 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ, 9 “వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను, 10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.

11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.

12 దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, 13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.

14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. 15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.

16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు. 17 దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.