ఓబేదెదోము ఇంటి నుండి మందసం బయలుదేరడం

ఓబేదెదోము ఇంటి నుండి మందసాన్ని రెండవసారి తరలించడం.

క్రీ.పూ. 1045

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 దినవృత్తాంతాలు 15:1–14

1 దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు. 2 అప్పుడు దావీదు “మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అని ఆజ్ఞాపించాడు. 3 అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

4 అహరోను సంతతి వారిని, లేవీయులను, 5 కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని, 6 మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని, 7 గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని, 8 ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని, 9 హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని, 10 ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.

11 అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో 12 “లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు. 13 ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి” అన్నాడు. 14 అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.

మందసాన్ని రెండవసారి తరలించడానికి ముందు రాసిన కీర్తన

మందసాన్ని రెండవసారి తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నప్పుడు రాసిన కీర్తన.

కీర్తనలు 132

యాత్రల కీర్తన

1 యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో.

2 అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.

3-5 నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా, యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను. నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.

6 ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.

7 యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.

8 యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.

9 నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.

10 నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.

11 నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.

12 నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.

13 తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.

14 ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.

15 దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.

16 దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.

17 అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.

18 అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.

2 సమూయేలు 6:12–19

12 దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు. 13-14 ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు, దావీదు నారతో నేసిన ఏఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు. 15 ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు.

16 యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది. 17 వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దాని కోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు, దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు. 18 హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు. 19 సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

1 దినవృత్తాంతాలు 15:15–29

15 తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.

16 అప్పుడు దావీదు “మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి” అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు. 17 కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను, 18 వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.

19 వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది. 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది. 21 ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.

22 లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు. 23 బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా, 24 షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.

25 దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు. 26 యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.

27 దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు. 28 ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.

29 కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.