మహాసభను స్తెఫను గద్దించడం
తన ప్రతివాదానికి ఆటంకం కలిగినప్పుడు, స్తెఫను మహాసభ వారిని వారి మెస్సీయను హత్య చేసినవారిగా గద్దిస్తాడు.
క్రీ.శ. 33 లేదా 34
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
51 “మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. 52 మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు. ఆయనను కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.
స్తెఫనును రాళ్లతో కొట్టి చంపడం క్రీ.శ. 34
స్తెఫను తనను హత్య చేస్తున్నవారి కోసం ప్రార్థిస్తుండగా, అతణ్ణి రాళ్లతో కొట్టి చంపుతారు.
54 మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండడం చూసి 56 “ఆకాశం తెరుచుకోవడం, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్క నిలిచి ఉండడం చూస్తున్నాను” అని పలికాడు.
57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి 58 అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు. 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును పిలుస్తూ, “యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో” అని చెప్పాడు. 60 అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
8:1 ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది. 2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
క్రైస్తవులపై విస్తృతమైన హింస
క్రైస్తవులపై విస్తృతమైన హింస చెలరేగుతుంది; ఇందులో సౌలు (తరువాత పౌలు) ప్రధాన పాత్ర వహిస్తాడు.
3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు.
సమరయలో ఫిలిప్పు బోధించడం
హింస కారణంగా యెరూషలేమును విడిచిపెట్టిన పరిచారకుడు ఫిలిప్పు సమరయకు వెళ్లి, అక్కడ బోధిస్తూ అద్భుతాలు చేస్తాడు.
5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు. 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు. 11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు.
12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు. 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
పేతురు, యోహాను సమరయకు దిగిరావడం
కొత్తగా విశ్వాసంలోకి వచ్చినవారికి పరిశుద్ధాత్మ వరాలను ఇవ్వడానికి పేతురు, యోహాను యెరూషలేము నుండి సమరయకు దిగివస్తారు.
14 సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు. 15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు. 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు.
17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.
మాంత్రికుడైన సీమోనును పేతురు గద్దించడం
18 అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను, 19 వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండి” అని అడిగాడు.
20 అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక. 21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు. 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు.
24 అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.