భాగం 7: సొలొమోను పాపం (continued)
క్రీ.పూ. 980 నుండి 975 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 జ్ఞానులంటే ఎవరు?
జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు.
మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.
2 నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో. 3 రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు. 4 రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
5 రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు.
ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
6 ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది.
అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7 జరగబోయేది మనుషులకి తెలియదు.
రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
8 ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు.
తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు.
యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు.
దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
9 సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది.
ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
10 దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే. 11 చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు. 12 ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు. 13 దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది.
14 సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను. 15 అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
16 జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను. 17 దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.
9:1 నీతిమంతులు, జ్ఞానులు, వారు చేసే పనులు అన్నీ పరిశీలించి చూసి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని నేను గ్రహించాను. ప్రేమించడం, ద్వేషించడం అనేవి మనుషుల చేతిలో లేవని, అది వారి వలన కాదనీ నేను తెలుసుకున్నాను.
2 జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి.
నీతిమంతులకు, దుష్టులకు,
మంచివారికి, చెడ్డవారికి,
పవిత్రులకు, అపవిత్రులకు,
బలులర్పించే వారికి, అర్పించని వారికి,
అందరికీ ఒకే విధంగా జరుగుతుంది.
మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది.
ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
3 అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం. 4 చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
5 బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు.
అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు.
వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
6 వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి.
సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.
7 నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి.
సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో.
9 దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం. 10 నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.
11 నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే,
వేగం గలవారు పరుగులో గెలవరు.
బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు.
తెలివైన వారికి ఆహారం లభించదు.
అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు.
జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు.
ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
12 తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు.
చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు,
హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.
13 ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది. 14 ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు. 15 అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు.
16 కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”
17 మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.
18 యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది.
ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.