సొదొమకు శిక్ష విధించడం, నాశనం చేయడం
క్రీ.పూ. 1899
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
16 అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు. 17 కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. 18 అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? 19 అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21 నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
22 ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23 అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
24 ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25 నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26 దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
27 అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28 యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
29 అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30 అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31 అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
32 చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33 అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
19:1 ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. 2 వారితో ఇలా అన్నాడు “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” అన్నాడు. అందుకు వాళ్ళు “అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.” అన్నారు. 3 కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.
4 అయితే వాళ్ళు నిద్రపోయే ముందే ఆ పట్టణ మనుషులు అంటే సోదొమలోని యువకులూ, వృద్ధులూ పట్టణం నలుమూలల నుండీ వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. 5 వాళ్ళు లోతును పిలిచారు. “ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరీ? మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళను బయటకు తీసుకు రా” అన్నారు.
6 దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే తలుపు మూసివేశాడు. 7 “సోదరులారా, ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు. 8 చూడండి. పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్ళు నాకు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను. వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు. వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిధులు” అన్నాడు.
9 కానీ వాళ్ళు “నువ్వు అవతలికి పో” అన్నారు. ఇంకా వాళ్ళు “వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు. ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి! ఇప్పుడు వాళ్ళపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అన్నారు. అలా అని వాళ్ళంతా లోతుపై దొమ్మీగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు.
10 అయితే ఆ దూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి లాగేశారు. ఆ వెనుకే తలుపు మూసేశారు. 11 అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకూ ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెదికీ వెదికీ విసిగిపోయారు.
12 అప్పుడు ఆ దూతలు లోతుతో “ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా. 13 మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అన్నారు.
14 అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. “త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు. 15 ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు.
16 అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు. 17 ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకు వచ్చిన తరువాత వాళ్ళలో ఒకడు “మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపొండి. వెనక్కు తిరిగి చూడవద్దు. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా ఆగవద్దు. మీరు తుడిచి పెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి” అని చెప్పాడు.
18 అప్పుడు లోతు “ప్రభువులారా, అలా కాదు. 19 మీ సేవకుడినైన నన్ను దయ చూశారు. నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు. కానీ నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను. ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో. అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో. 20 చూడండి, నేను పారిపోవడానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది. నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. అది చిన్నది గదా, నేను బతుకుతాను” అన్నాడు.
21 అప్పుడు ఆయన “అలాగే, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను. 22 నువ్వు త్వరపడి, అక్కడికి వెళ్లి తప్పించుకో. నువ్వు అక్కడకు చేరుకునే వరకూ నేను ఏమీ చేయలేను” అన్నాడు. కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది.
23 లోతు సోయరు చేరేటప్పటికి ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు. 24 అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు. 25 ఆయన ఆ పట్టణాలనూ, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణాల్లో నివసించేవారందరినీ, నేలపై మొక్కలనూ నాశనం చేశాడు.
26 కానీ లోతు వెనుకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
27 ఉదయమైంది. అబ్రాహాము లేచి తాను అంతకుముందు యెహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు. 28 అక్కడి నుండి సొదొమ, గొమొర్రాల వైపు, ఆ మైదాన ప్రాంతం మొత్తాన్నీ చూశాడు. కొలిమిలోనుండి లేచే పొగ లాగా ఆ ప్రాంతం అంతా పొగలు వస్తూ కనిపించింది.
29 ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.