ఆపదల కీర్తనలు, ప్రధానంగా చెరకాలం నాటివి (continued)

సంఘం ఆపదలు, బాధలు అనుభవించిన కాలంలో, ప్రధానంగా బబులోను చెరకాలంలో రాసిన కీర్తనలు.

క్రీ.పూ. 539

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 92–93

విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన.

1 యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.

2 ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

3 పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.

4 ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.

5 యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.

6 పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.

7 దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!

8 అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.

9 యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.

10 అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.

11 నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.

12 నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.

13 వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.

14 యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.

15 ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.

93:1 యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.

2 ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.

3 యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.

4 అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి.

5 యెహోవా, నీ శాసనాలు నమ్మదగినవి, పరిశుద్ధత నీ ఇంటికి శాశ్వత అలంకారంగా ఉంది.

కీర్తనలు 123

యాత్రల కీర్తన

1 పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను.

2 సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి.

3 యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము.

4 అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.