రచనాకాలం అనిశ్చితమైన, దావీదు పాలనలోని కీర్తనలు (continued)

రాజైన తరువాత దావీదు రాసిన కీర్తనలు; వాటి రచనాకాలం, సందర్భాలు కచ్చితంగా తెలియవు.

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కీర్తనలు 101

దావీదు కీర్తన

1 యెహోవా, నేను నిన్ను కీర్తిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, న్యాయాలను గూర్చి గానం చేస్తాను.

2 ఎలాంటి దోషమూ లేకుండా వివేకంతో నడుచుకుంటాను. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను నా ఇల్లంతటిలో యథార్థమైన ప్రవర్తనతో నడుచుకుంటాను.

3 వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.

4 మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం.

5 తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.

6 దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.

7 మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

8 ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.

కీర్తనలు 104

1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు.

2 ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.

3 జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు.

4 వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.

5 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

6 దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి.

7 నీవు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము ధ్వని విని అవి త్వరగా పారిపోయాయి.

8 నీవు వాటికి నియమించిన చోటికి పోవడానికి అవి పర్వతాలెక్కాయి. పల్లాలకు దిగాయి.

9 అవి మరలి వచ్చి భూమిని కప్పకుండేలా దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించావు.

10 ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి.

11 అవి అడవి జంతువులన్నిటికీ దాహం తీరుస్తాయి. వాటివలన అడవి గాడిదలు సేదదీరుతాయి.

12 వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి.

13 తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది.

14 పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు

15 అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు.

16 యెహోవా వృక్షాలు ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు నీటి వసతి గలిగి ఉన్నాయి.

17 అక్కడ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి. అక్కడ సరళవృక్షాలపై కొంగలు నివాసముంటున్నాయి.

18 ఎత్తయిన కొండలు కొండమేకలకు ఉనికిపట్లు. బండరాళ్ళు కుందేళ్లకు ఆశ్రయస్థానాలు.

19 ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.

20 నీవు చీకటి కమ్మ జేయగా రాత్రి అవుతున్నది. అప్పుడు అడవిజంతువులన్నీ సంచరిస్తున్నాయి.

21 సింహం పిల్లలు వేట కోసం గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలోనుండి తీసుకోడానికి చూస్తున్నాయి.

22 సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి.

23 సాయంకాలం దాకా పాటుపడి తమ పనులు జరుపుకోడానికి మనుషులు బయలుదేరుతారు.

24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.

25 అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.

26 అందులో ఓడలు నడుస్తున్నాయి. నీవు సృష్టించిన మొసళ్ళు దానిలో జలకాలాడుతూ ఉన్నాయి.

27 తగిన కాలంలో నీవు వాటికి ఆహారమిస్తావని ఇవన్నీ నీ దయకోసం కనిపెడుతున్నాయి.

28 నీవు వాటికి అందిస్తే అవి కూర్చుకుంటాయి. నీవు గుప్పిలి విప్పితే అవి మంచివాటిని తిని తృప్తి చెందుతాయి.

29 నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి.

30 నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.

31 యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక.

32 ఆయన భూమిని చూడగా అది వణికి పోతుంది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుకుంటాయి.

33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను. నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తాను.

34 ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

35 పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.