సొలొమోను మరిన్ని సామెతలు (continued)

క్రీ.పూ. 984

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సామెతలు 28–29

1 ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.

2 దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.

3 పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.

4 ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.

5 దుష్టులు న్యాయమేదో గ్రహించరు. యెహోవాను ఆశ్రయించే వారికి అన్నీ తెలుసు.

6 వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు.

7 ఉపదేశం అంగీకరించే తనయుడు బుద్ధిమంతుడు. తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.

8 డబ్బు వడ్డీకిచ్చి అన్యాయ లాభం చేత ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించేవాడి కోసం దాన్ని కూడబెడతాడు.

9 ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.

10 యథార్థవంతులను దుర్మార్గంలో పడవేసే వాడు తాను తవ్విన గోతిలో తానే పడతాడు. నిష్కళంకులకు మంచి వారసత్వం దొరుకుతుంది.

11 ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల పేదవాడు వాడి అసలు రంగు బయట పెడతాడు.

12 నీతిపరులకు జయం కలగడం మహాఘనతకు కారణం. దుష్టులు అధికారానికి వచ్చేటప్పుడు ప్రజలు దాగిఉంటారు.

13 అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.

14 ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.

15 పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.

16 వివేకం లేకుండా ప్రజానీకాన్ని పీడించే అధికారి క్రూరుడు. దగాకోరుతనాన్ని ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడౌతాడు.

17 వేరొకడి రక్తం చిందించిన వాడు దోషం మూటగట్టుకొన్నవాడు. వాడు మరణ దినం దాకా పారిపోతూనే ఉంటాడు.

18 యథార్థంగా ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు. మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు.

19 తన పొలం సేద్యం చేసుకునే వాడికి కడుపునిండా అన్నం దొరకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించేవారికి కలిగే పేదరికం అంతా ఇంతా కాదు.

20 నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.

21 పక్షపాతం చూపడం మంచిది కాదు. కేవలం ఒక్క రొట్టెముక్క కోసం కొందరు తప్పు చేస్తారు.

22 చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.

23 ముఖ స్తుతి మాటలు పలికే వాడికంటే మనుషులకు బుద్ధి చెప్పేవాడు తుదకు ఎక్కువ మెప్పు పొందుతాడు.

24 తన తలిదండ్రుల సొమ్ము దోచుకుని “అది ద్రోహం కాదు” అనుకొనేవాడు నాశనం చేసే వాడికి జతకాడు.

25 దురాశ గలవాడు కలహం రేపుతాడు. యెహోవా పట్ల నమ్మకం పెట్టుకునే వాడు వర్ధిల్లుతాడు.

26 తన మనస్సులోని ఆలోచనలను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకుంటాడు.

27 పేదలకు ఇచ్చే వాడికి లేమి కలగదు. వారిని చూడకుండా కళ్ళు మూసుకునే వాడికి ఎన్నో శాపాలు కలుగుతాయి.

28 దుష్టులు అధికారంలోకి వస్తున్నప్పుడు ప్రజలు దాక్కుంటారు. దుర్మార్గులు నశించేటప్పుడు నీతిమంతులు వృద్ధి చెందుతారు.

29:1 చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.

2 మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.

3 జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.

4 న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.

5 తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు.

6 దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.

7 మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.

8 అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.

9 జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.

10 రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.

11 బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.

12 రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.

13 పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.

14 ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.

15 బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.

16 దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు.

17 నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.

18 ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.

19 సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.

20 తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.

21 ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి.

22 కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.

23 ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.

24 దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.

25 భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.

26 పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే.

27 మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.