జ్ఞానం గురించి తండ్రి బోధ (continued)

క్రీ.పూ. 984

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సామెతలు 2–3

1 కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.

2 జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, 3 తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, 4 పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, 5 యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

6 యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.

7 యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.

8 న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.

9 అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.

10 జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.

11 తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.

12 అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.

13 దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.

14 కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.

15 తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.

16 వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.

17 అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.

18 ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.

19 ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.

20 నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.

21 నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.

22 చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.

3:1 కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.

2 అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.

3 అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

4 అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.

5 నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

6 ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.

7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.

9 యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.

10 అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.

11 కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

12 ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.

13 జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.

14 వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.

15 రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.

16 జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

17 అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.

18 దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.

19 తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.

20 ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.

21 కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.

22 జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.

23 అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.

24 పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.

25 అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.

26 యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.

27 అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.

28 నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.

29 నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.

30 నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.

31 దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.

32 కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.

33 దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.

34 ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.

35 జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.