సొలొమోను సామెతలు

క్రీ.పూ. 984

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సామెతలు 10–11

1 జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.

2 భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.

3 ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.

4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

5 బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.

6 నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.

7 నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.

8 జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

9 నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.

10 కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

11 నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.

12 ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

13 వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.

14 జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

15 ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం.

16 నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.

17 బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు.

18 అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

19 వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

20 ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.

21 నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.

22 యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.

23 మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.

24 మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.

25 సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.

26 సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.

27 యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది.

28 నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.

29 నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.

30 ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.

31 ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.

32 ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.

11:1 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.

2 గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.

3 నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది.

4 దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.

5 యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు.

6 నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు.

7 దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి.

8 ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు.

9 మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు.

10 నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి.

11 నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి.

12 తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.

13 చాడీలు చెబుతూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయటపెడతాడు. నమ్మకస్థుడు రహస్యాలు దాస్తాడు.

14 మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం.

15 పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు.

16 మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు.

17 దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు.

18 దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.

19 వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు.

20 మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు.

21 భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు.

22 స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం.

23 నీతిమంతులు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. దుష్టుల ఆశలు అహంకార పూరితం.

24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.

25 ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.

26 ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.

27 మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది.

28 సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు.

29 తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు.

30 నీతిమంతులు జీవ వృక్ష ఫలాలు ఫలిస్తారు. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు.

31 నీతిమంతులు ఈ లోకంలో తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే, దుష్టులకు, పాపులకు తప్పనిసరిగా తగిన ప్రతిఫలం కలుగుతుంది గదా.