యూదుల పెద్దలకు ప్రవచనాలు (continued)
క్రీ.పూ. 593
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 అప్పుడు నాకు యెహోవా వాక్కు వచ్చి ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, యెరూషలేము వైపు నీ ముఖం తిప్పుకుని, వాళ్ళ పవిత్రస్థలాలకూ, ఇశ్రాయేలీయుల దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించు. 3 యెహోవా చెప్పేదేమంటే, నేను నీకు విరోధిని. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని నీలో ఎవరూ ఉండకుండాా అందరినీ నీనుంచి తెంచివేయడానికి నా కత్తి దూసి ఉన్నాను.
4 నీతిమంతుడుగాని, దుష్టుడుగాని ఎవరూ నీలో ఉండకుండాా దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ అందరినీ నేను తెంచివేయడానికి నా కత్తి శరీరులందరికీ విరోధంగా బయలుదేరింది. 5 యెహోవానైన నేను నా కత్తి మళ్ళీ ఒరలో పెట్టకుండా దాన్ని దూసి ఉన్నానని ప్రజలందరూ తెలుసుకుంటారు.
6 కాబట్టి నరపుత్రుడా, మూలుగు. వాళ్ళు చూస్తూ ఉండగా నీ నడుము విరిగేలా దుఃఖంతో మూలుగు. 7 అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.”
8 యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు.
9 “నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు,
‘ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది.
అది మెరుగుపెట్టి ఉంది.
10 అది భారీ ఎత్తున వధ చెయ్యడానికి పదును పెట్టి ఉంది!
తళతళలాడేలా అది మెరుగుపెట్టి ఉంది!
నా కుమారుడి రాజదండం విషయంలో మనం ఆనందించాలా?
రాబోతున్న రాబోయే కత్తి అలాంటి ప్రతి దండాన్నీ ద్వేషిస్తుంది!
11 కాబట్టి ఆ కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది.
ఆ తరువాత అది చేతికి వస్తుంది.
ఆ కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి ఆ కత్తి మెరుగు పెట్టి ఉంది.
12 నరపుత్రుడా, శోకించు, సాయం కోసం కేకలుపెట్టు!
ఆ కత్తి నా ప్రజల మీదకీ, ఇశ్రాయేలీయుల నాయకుల మీదకీ వచ్చింది.
కత్తి భయం నా ప్రజలకు కలిగింది గనుక శోకంతో నీ తొడ చరుచుకో!
13 పరీక్ష వచ్చింది. కాని రాజదండం నిలిచి ఉండకపోతే ఎలా?’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
14 నరపుత్రుడా, ప్రవచించి నీ రెండు చేతులు చరుచుకో.
కత్తి మూడోసారి కూడా దాడి చేస్తుంది!
అది భారీ ఎత్తున వధ కొరకైన కత్తి!
అది అనేకమందిని హతం చెయ్యడానికీ, వాళ్ళను అన్నిచోట్లా పొడవడానికీ సిద్ధంగా ఉంది!
15 వాళ్ళ గుండెలు కరిగిపోయేలా, అడ్డంకులు అధికం అయ్యేలా వాళ్ళ గుమ్మాలకు విరోధంగా నేను కత్తి దూసి భారీ ఎత్తున వధ సిద్ధం చేశాను!
బాధ! అది మెరుపులా ఉంది. వధ చెయ్యడానికి సిద్ధంగా ఉంది.
16 ఓ కత్తీ! కుడివైపు దెబ్బ కొట్టు! ఎడమవైపు దెబ్బ కొట్టు! నీ పదునైన అంచు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లనివ్వు.
17 నేను కూడా నా రెండు చేతులు చరుచుకుని, నా ఉగ్రత తీర్చుకుంటాను! యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను.”
18 యెహోవా నాకీ విషయం మళ్ళీ చెప్పాడు, 19 “నరపుత్రుడా, బబులోను రాజు కత్తి రావడానికి రెండు రహదారులు కేటాయించు. ఆ రెండూ, ఒకే దేశంలోనుంచి బయలుదేరుతాయి. ఆ రెండు రహదారుల్లో ఒకటి, ఒక పట్టణానికి వెళ్తుందన్న సూచన రాసి ఉంటుంది. 20 ఒక రహదారి, అమోనీయుల పట్టణమైన రబ్బాకు బబులోను సైన్యం వెళ్ళే మార్గంగా సూచన రాసి పెట్టు. ఇంకొక రహదారి యూదా దేశంలోని ప్రాకారాలుగల పట్టణమైన యెరూషలేముకు ఆ సైన్యాన్ని నడిపించేదిగా సూచన రాసి పెట్టు.
21 రహదారులు చీలే చోట రెండు దారులు చీలే కూడలిలో శకునం చూడడానికి బబులోను రాజు ఆగాడు. అతడు బాణాలు ఇటు అటు ఆడిస్తూ, విగ్రహాలను అడుగుతున్నాడు. అతడు కాలేయం శకునం పరీక్షించి చూస్తున్నాడు!
22 యెరూషలేము ఎదుట ద్వారాలను పడగొట్టే పరికరాలు సిద్ధం చెయ్యమనీ,
ఊచ కోత ఆరంభించమనీ, యుద్ధధ్వని చెయ్యమనీ, ముట్టడి దిబ్బలు కట్టమనీ అడుగుతున్నాడు.
యెరూషలేముగూర్చి తన కుడివైపు శకునం కనిపించింది!
23 బబులోనీయులతో ఒప్పందం చేసుకున్న వాళ్ల కళ్ళకు ఈ శకునం వ్యర్ధంగా కనిపిస్తుంది!
కాని ఆ రాజు వాళ్ళను పట్టుకోవడం కోసం, వాళ్ళు ఆ ఒప్పందం మీరారు అన్న నెపం వాళ్ళ మీద మోపుతాడు.”
24 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీ దోషం మీరు నా జ్ఞాపకానికి తెచ్చిన కారణంగా మీ అతిక్రమం వెల్లడి ఔతుంది. మీ క్రియలన్నిట్లో మీ పాపం కనిపిస్తుంది. ఈ కారణంగా, మీ శత్రువు చేతికి మీరు దొరుకుతారని మీరు అందరికీ గుర్తు చేస్తారు! 25 అపవిత్రుడా నీ శిక్షా దినం దగ్గర పడింది. ఇశ్రాయేలీయుల పాలకుడా, అపవిత్రం చేసే కాలం ముగింపుకు వచ్చిన వాడా, 26 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నీ తలపాగా, నీ కిరీటం తీసివేయి. సంగతులు ఇదివరకులాగా ఇకపై ఉండవు. ఇక తక్కువ వాళ్ళను గొప్ప వాళ్ళనుగానూ, గొప్ప వాళ్ళను తక్కువ వాళ్ళనుగానూ చెయ్యి. 27 నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.”
28 నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇలా చెప్పు. “అమ్మోనీయులను గూర్చీ, వాళ్ళ అపకీర్తిని గూర్చీ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఒక కత్తి! ఒక కత్తి దూసి ఉంది! పదును పెట్టిన కత్తి భారీగా వధ చెయ్యడానికి దూసి ఉంది, అది ఒక మెరుపులా ఉంది! 29 శకునం చూసేవాళ్ళు నీ కోసం దొంగ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు వ్యర్థమైన వాటిని నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ కత్తి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ దుష్టుల మెడల మీద ఉంటుంది. ఆ దుష్టుల శిక్షా దినం వచ్చింది. వాళ్ళు అతిక్రమం చేసే సమయం ముగిసింది.
30 మళ్ళీ కత్తి ఒరలో పెట్టు. నువ్వు సృష్టి అయిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను! 31 నా కోపం నీ మీద కుమ్మరిస్తాను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రాజేస్తాను. నాశనం చెయ్యడంలో ప్రవీణులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను.
32 ఆ అగ్నికి నువ్వు ఇంధనం ఔతావు. దేశంలో నీ రక్తం కారుతుంది. నువ్వు ఎప్పటికీ జ్ఞాపకానికి రావు. యెహోవానైన నేనే ఇది ప్రకటించాను.”
22:1 యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఇలా అన్నాడు, 2 “నరపుత్రుడా, తీర్పు తీరుస్తావా? ఈ రక్తపు పట్టణానికి తీర్పు తీరుస్తావా? దాని అసహ్యమైన పనులన్నీ దానికి తెలియజెయ్యి. 3 నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం!
4 రక్తం కార్చిన కారణంగా నువ్వు నేరం చేశావు. నువ్వు చేసుకున్న విగ్రహాల మూలంగా నువ్వు అశుద్ధం అయ్యావు! నువ్వే నీ దినాలు ముగింపుకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ఆఖరి సంవత్సరాల్లో ఉన్నావు. కాబట్టి అన్యప్రజల్లో ఒక నిందగానూ, అన్ని దేశాల దృష్టిలో ఒక ఎగతాళిగానూ నిన్ను చేస్తాను. 5 దగ్గర వాళ్ళూ, దూరం వాళ్ళు అందరూ నిన్ను వెక్కిరిస్తారు. ఓ అపవిత్ర పట్టణమా, నువ్వు గందరగోళంతో నిండిన దానివన్న కీర్తి అందరికీ పాకింది.
6 నీలోని ఇశ్రాయేలీయుల నాయకులందరూ తమ శక్తి కొలదీ రక్తం ఒలికించడానికి వచ్చారు. 7 నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు. 8 నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను నువ్వు అలక్ష్యం చేశావు. నా విశ్రాంతిదినాలను అపవిత్రం చేశావు. 9 దూషణ, నరహత్య చేసేవాళ్ళు నీలో ఉన్నారు. వాళ్ళు పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నీ మధ్యలో దుష్టత్వం జరిగిస్తున్నారు.
10 తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునేవాళ్ళు నీలో ఉన్నారు. రుతుస్రావం వల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీని చెరిచే వాళ్ళు నీలో కాపురం ఉన్నారు. 11 ఒకడు తన పొరుగువాడి భార్యతో పండుకుని అసహ్యమైన పనులు చేస్తున్నాడు. ఇంకొకడు సిగ్గు లేకుండా తన సొంత కోడలిని పాడు చేస్తున్నాడు. తమ సొంత తండ్రికే పుట్టిన అక్కచెల్లెళ్ళను చెరిచే వాళ్ళు నీలో ఉన్నారు. 12 వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
13 “కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను. 14 నేను నీకు శిక్ష వేసినప్పుడు తట్టుకోడానికి చాలినంత ధైర్యం నీ హృదయానికి ఉందా? యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను. దాన్ని నేను నెరవేరుస్తాను. 15 కాబట్టి అన్యప్రజల్లోకి నిన్ను చెదరగొడతాను. ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను. ఈ విధంగా నీ అపవిత్రతను ప్రక్షాళన చేస్తాను. 16 కాబట్టి నువ్వు అన్యదేశాల దృషిలో అశుద్ధం ఔతావు. అప్పుడు నేనే యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.”
17 తరువాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. 18 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి పనికి రాని వాళ్ళలా ఉన్నారు. వాళ్ళందరూ కొలిమిలో మిగిలిపోయిన ఇత్తడి, తగరంలా, పనికి రాని ఇనుము, సీసంలా ఉన్నారు. వాళ్ళు నీ కొలిమిలో మిగిలి పోయిన పనికి రాని వెండిలా ఉన్నారు.”
19 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు, 20 నా కోపంతోనూ, ఉగ్రతతోనూ మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగిస్తాను. 21 మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదినప్పుడు కచ్చితంగా మీరు దానిలో కరిగిపోతారు. 22 కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.”
23 యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు, 24 “నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు! 25 అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
26 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు. నాకు ప్రతిష్ఠితాలైన వస్తువులను అపవిత్రం చేస్తారు. ప్రతిష్ఠితమైన దానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఎంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడాన్ని ప్రజలకు నేర్పరు. వాళ్ళ మధ్య నేను దూషణ పొందేలా, నేను విధించిన విశ్రాంతి దినాలను వాళ్ళ దృష్టికి రానివ్వరు.
27 దానిలో రాజకుమారులు లాభం సంపాదించడానికి నరహత్య చెయ్యడంలో, మనుషులను నాశనం చెయ్యడంలో వేటను చీల్చే తోడేళ్లలా ఉన్నారు. 28 దాని ప్రవక్తలు దొంగ దర్శనాలు చూస్తూ, యెహోవా ఏమీ చెప్పనప్పటికీ, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్తూ, అసత్య అంచనాలు ప్రకటిస్తూ, మట్టి గోడకు సున్నం వేసినట్టు తమ పనులు కప్పిపుచ్చుతూ ఉన్నారు.
29 దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు.
30 నేను దేశాన్ని పాడు చెయ్యకుండా ఉండేలా గోడలు కట్టి, బద్దలైన గోడ సందుల్లో నిలిచి ఉండడానికి తగిన వాడి కోసం నేను ఎంత చూసినా, ఒక్కడైనా నాకు కనిపించలేదు. 31 కాబట్టి నేను నా కోపం వాళ్ళ మీద కుమ్మరిస్తాను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ మీదకి రప్పించి, నా కోపాగ్నితో వాళ్ళను కాల్చేస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.