సిద్కియాకు, అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచనాలు (continued)
సిద్కియాకు, అబద్ధ ప్రవక్తలకు, యెరూషలేముకు, యూదుల జాతులకు వ్యతిరేకంగా వివిధ ప్రవచనాలు.
క్రీ.పూ. 594
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 2 “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రవచనం చెప్తున్న ప్రవక్తలకు విరోధంగా ప్రవచించు. తమ సొంత ఆలోచనలను ప్రవచనాలుగా చెప్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. యెహోవా మాట వినండి! 3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. దర్శనం ఏదీ చూడకుండా సొంత ఆలోచనలను అనుసరించే తెలివి తక్కువ ప్రవక్తలకు బాధ! 4 ఇశ్రాయేలు ప్రజలారా, మీ ప్రవక్తలు బంజరు భూముల్లో తిరిగే నక్కల్లా ఉన్నారు.
5 యెహోవా దినాన జరిగే యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు శత్రువును ఎదిరించడానికి మీరు గోడల్లో ఉన్న పగుళ్ళ జోలికి వెళ్ళరు. ప్రాకారానికి మరమ్మత్తులు చేయరు. 6 ‘యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని చెప్పే వాళ్ళు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధపు జోస్యాలు చెప్తారు. యెహోవా వాళ్ళని పంపలేదు. అయినా తమ సందేశం జరుగుతుంది అని ప్రజలు ఆశ పడేలా చేస్తారు. 7 నేను అసలేమీ మాట్లాడకుండానే ‘యెహోవా చెప్పేది ఇదీ, అదీ’ అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?
8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అబద్ధపు దర్శనాలు చూసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ప్రభువైన యెహోవా మీకు విరోధంగా చేస్తున్న ప్రకటన ఇదే, 9 అబద్ధపు దర్శనాలు చూస్తూ జోస్యం చెప్తున్న ప్రవక్తలకి నేను వ్యతిరేకిని. నా ప్రజల సభలోకి వాళ్ళని రానివ్వను. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళను నమోదు చేయను. వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అలా జరిగినప్పుడు నేనే యెహోవాను, అని మీరు తెలుసుకుంటారు.
10 శాంతి లేకుండానే ‘శాంతి’ అని ప్రవచిస్తూ నా ప్రజలను వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక గోడ కట్టి దానిపై సున్నం పూస్తున్నారు 11 గోడకి సున్నం వేస్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. ఇది కూలిపోతుంది. జడివాన కురుస్తుంది. దీన్ని పడగొట్టడానికి నేను పిడుగులు పంపిస్తాను. పడిన గోడను చిన్నాభిన్నం చేయడానికి గాలి తుఫానుని పంపుతాను. 12 ఆ గోడ పడిపోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ‘మీరు వేసిన సున్నం ఎక్కడ?’ అని అడుగుతారా లేదా?”
13 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నా క్రోధంలో నుండి గాలి తుఫాను, నా గొప్ప కోపంలో నుండి కుంభవృష్టిగా వర్షాలూ రప్పిస్తాను! నా క్రోధం వల్ల పడిన వడగళ్ళు ఆ గోడను సమూలంగా ధ్వంసం చేస్తాయి. 14 మీరు సున్నం వేసిన గోడను పునాదులు కనపడేలా నేలమట్టం చేస్తాను. అది పడిపోతుంది. దాని కింద మీరూ నిర్మూలం అవుతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
15 ఈ విధంగా నేను మహా కోపంతో ఆ గోడనూ, దానికి సున్నం వేసిన వాళ్ళనీ నిర్మూలం చేస్తాను. అప్పుడు మీతో నేను ‘గోడ ఇక లేదు. అలాగే దానికి సున్నం వేసిన వాళ్ళు కూడా లేరు’ అని చెప్తాను. 16 సున్నం వేసిన వాళ్ళు ఎవరంటే యెరూషలేముకి శాంతి లేకున్నా యెరూషలేముకి శాంతి కలుగుతుందని దర్శనాలు చూసిన ఇశ్రాయేలు ప్రజల ప్రవక్తలే. ఇదే ప్రభువైన యెహోవా పలికిన మాట.”
17 నరపుత్రుడా, తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవచనం పలికే ఇశ్రాయేలు ప్రజల కూతుళ్ళకు విరోధంగా ప్రవచించు. 18 ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?
19 చారెడు బార్లీ గింజలకీ కొన్ని రొట్టె ముక్కలకీ ఆశపడి ప్రజల్లో నా పేరును అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్తూ వాళ్ళు నిర్దోషులను చంపేలా, చావడానికి అర్హులైన వాళ్ళను విడిచిపెట్టేలా చేశారు.
20 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. పక్షులకు వల విసిరినట్టుగా ప్రజల ప్రాణాలకు ఉచ్చు వేయడానికి మీరు ఉపయోగించే తాయెత్తులకి నేను వ్యతిరేకం. వాటిని మీ చేతులనుండి నేను కచ్చితంగా తెంపి వేస్తాను. పక్షులను పట్టినట్టు మీరు వల వేసి పట్టిన ప్రజలను నేను విడిపిస్తాను. 21 వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
22 నీతిగల వ్యక్తి నిరుత్సాహపడాలని నేను కోరుకోను. కానీ మీరు మీ అబద్దాల చేత నీతిగల వ్యక్తులను నిరుత్సాహపరిచారు. దుర్మార్గుడు తన పాపం వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకోకుండా మీరు వాడి దుర్మార్గతను ప్రోత్సహించారు. 23 కాబట్టి మీరు ఇకనుండి అబద్ధపు దర్శనాలు చూడరు. జోస్యాలూ చెప్పరు. నా ప్రజలను నేను మీ స్వాధీనం నుండి విడిపిస్తాను. అప్పుడు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
14:1 తరువాత ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కొందరు నా దగ్గరకి వచ్చి నా ఎదుట కూర్చున్నారు. 2 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 3 “నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
4 కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను. 5 వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల కారణంగా నాకు దూరమయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళ హృదయాలను వశం చేసుకోడానికి నేనలా చేస్తాను.
6 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పు. ‘పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.’
7 ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను. 8 అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
9 ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను. 10 ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది. 11 దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
12 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 13 “నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను. 14 అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు-ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
15 బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే 16 నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులనూ కూతుళ్ళనూ కూడా రక్షించుకోలేరు. వాళ్ళ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. దేశం వ్యర్ధమై పోతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
17 నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే 18 నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
19 రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే 20 అప్పుడు నోవహు, దానియేలు, యోబు అనే ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. వాళ్ళు తమ నీతి వల్ల తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు.
21 ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.
22 అయినా, వినండి! తమ కొడుకులతో కూతుళ్ళతో బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దానిలో కొంత ‘శేషం’ మిగిలిపోతుంది. చూడండి! వాళ్ళ కొడుకులూ కూతుళ్ళూ తిరిగి నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ ప్రవర్తననూ, పనులనూ చూస్తావు. అప్పుడు యెరూషలేముకు వ్యతిరేకంగా నేను పంపిన శిక్షల విషయంలోనూ, దేశానికి విరోధంగా నేను పంపిన వాటన్నిటి విషయంలోనూ నీకు ఆదరణ కలుగుతుంది. 23 మిగిలి ఉన్న వాళ్ళ ప్రవర్తన, పనులు చూసినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. వాళ్ళు నిన్ను ఆదరిస్తారు. నేను ఆమెకి వ్యతిరేకంగా చేసినదేదీ నిష్కారణంగా చేయలేదని మీరు తెలుసుకుంటారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”
15:1 యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. 2 “నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కర్రల కంటే ఏ విషయంలో గొప్పది? 3 ద్రాక్ష చెట్టు కర్రను ఎవరైనా దేనికైనా ఉపయోగిస్తారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో కొక్కేలు తయారు చేస్తారా? 4 చూడండి! అది పొయ్యిలో పెట్టి కాల్చడానికే ఉపయోగపడుతుంది కదా! ఆ కర్ర రెండు వైపులా, మధ్యలోనూ పూర్తిగా కాలిన తరువాత ఇక దేనికి పనికి వస్తుంది?
5 చూడు, అది కాలకముందు దేనికీ ఉపయోగపడలేదు. పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా దేనికీ పనికి రాదు! 6 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అడవిలోని ఇతర చెట్లవలే కాకుండా ద్రాక్ష చెట్టుని అగ్నికి ఇంధనంగా ఉపయోగించాను. ఇదే విధంగా నేను యెరూషలేములో నివసించే వారి విషయంలో చేస్తాను.
7 నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. 8 వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను దేశాన్ని అంతా దిక్కుమాలిన బంజరు భూమిగా మారుస్తాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.