భాగం 2: దేవాలయ ప్రతిష్ఠ నుండి హామాను మరణం వరకు

రెండవ దేవాలయ ప్రతిష్ఠ నుండి హామాను మరణం వరకు.

అహష్వేరోషు పాలనలో యూదులకు వ్యతిరేకత

క్రీ.పూ. 486

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎజ్రా 4:6

6 ఇంకా అహష్వేరోషు పాలించడం ప్రారంభించినప్పుడు వారు యూదా, యెరూషలేము నివాసుల గురించి ఉత్తరం రాసి వారిపై తప్పుడు నేరాలు ఆరోపించారు.

అర్తహషస్త పాలనలో యూదులకు వ్యతిరేకత క్రీ.పూ. 464

అర్తహషస్త లాంగిమానస్ పాలనలో యూదులకు వ్యతిరేకత.

ఎజ్రా 4:7–23

7 పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు. 8 నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి యెరూషలేము గురించి ఈ విధంగా ఉత్తరం రాసి అర్తహషస్తకు పంపారు.

9 “నిర్వహణ అధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయి, వారి సహచరులు అంటే దీన్, అఫర్సతాక్, తార్పెల్, అఫరాస్, ఎరుకు, బబులోను, షూషను, దెహా, ఏలాము జాతుల వారూ 10 గతంలో ఘనత వహించిన అషుర్ బనిపాల్ షోమ్రోను పట్టణంలో నది ఇవతల వైపున ఉంచిన మిగిలిన ప్రజలు రాస్తున్న విషయాలు.”

11 వీరంతా అర్తహషస్త రాజుకు రాసి పంపిన ఉత్తరం నకలు. “నది ఇవతల వైపు ఉన్న మీ దాసులమైన మేము రాజైన మీకు విన్నవించేదేమంటే, 12 మీ పాలనలో ఉండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి, తిరుగుబాటు చేసే ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు దాని గోడలు నిలబెట్టి, పునాదులు బాగు చేస్తున్నారు. 13 కాబట్టి రాజైన మీకు తెలియజేసేదేమిటంటే, ఈ పట్టణం గోడలు నిలబెట్టి, పట్టణం కట్టిన పక్షంలో వారు ఇకపై శిస్తుగానీ, సుంకంగానీ, పన్నుగానీ మీకు చెల్లించరు. అప్పుడు రాజుకు వచ్చే రాబడి తగ్గిపోతుంది.

14 మేము రాజు ఉప్పు తిన్నవారం కాబట్టి రాజుకు నష్టం కలగకుండా చూడాలని ఈ ఉత్తరం పంపి రాజైన మీకు ఈ విషయం తెలియచేస్తున్నాం. 15 తమ పూర్వికులు రాయించిన రాజ్యపు దస్తావేజులు చూస్తే, ఈ పట్టణం ప్రజలు తిరుగుబాటు చేసేవారుగా, రాజులకు, దేశాలకు కీడు తలపెట్టేవారనీ, కలహాలు రేపేవారనీ, ఆ కారణం వల్లనే ఈ పట్టణం నాశనానికి గురయిందనీ మీకు తెలుస్తుంది. 16 కాబట్టి రాజువైన మీకు మేము స్పష్టంగా చెప్పేదేమంటే, ఈ పట్టణ నిర్మాణం పూర్తి అయితే, ఇకపై నది ఇవతలి వైపు మీకు హక్కు, అధికారం ఏమీ ఉండదు.”

17 అప్పుడు రాజు ఇలా జవాబు రాయించాడు. “మంత్రి రెహూముకు, కార్యదర్శి షిమ్షయికి, షోమ్రోనులో నివసించేవారి పక్షంగా ఉన్న మిగిలిన వారికి, నది ఆవతల ఉన్న మిగిలిన వారికి క్షేమం కలుగు గాక. 18 మీరు మాకు పంపిన ఉత్తరం ప్రశాంతంగా చదివించుకొన్నాం. 19 దీని విషయం నేనిచ్చిన ఆజ్ఞను బట్టి పరిశీలించినప్పుడు, పూర్వం నుండి ఆ పట్టణ ప్రజలు రాజద్రోహం చేసి, కలహాలు రేపుతూ తిరుగుబాటు చేసే వారని మాకు నిర్ధారణ అయింది. 20 గతంలో యెరూషలేము పట్టణంలో బలవంతులైన రాజులు పాలన చేశారు. వారు నది అవతల ఉన్న దేశాలన్నిటినీ పాలించినందు వల్ల ఆ దేశాలన్నీ వారికి శిస్తు, సుంకం, పన్నులు చెల్లించారు. 21 కాబట్టి మేము అనుమతి ఇచ్చే వరకూ వాళ్ళు ఆ పట్టణ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆజ్ఞాపించండి. 22 పని జరగకుండా ఉండేలా తప్పకుండా జాగ్రత్త పడండి. రాజ్యానికి నష్టం, ద్రోహం కలగకుండా చూడండి.”

23 రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరంలోని వివరాలు రెహూముకు, షిమ్షయికి, వారి పక్షం వహించిన మిగిలిన వారికి తెలిసింది. వారు వెంటనే యెరూషలేములో నిర్మాణ పనిలో ఉన్న యూదుల దగ్గరికి వచ్చి బలవంతంగా, అధికార పూర్వకంగా పని ఆపించారు.

అర్తహషస్త తన రాణికి విడాకులు ఇవ్వడం క్రీ.పూ. 462

ఎస్తేరు 1:1–2:15

1 ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి. 2 ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు. 3 తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు. 4 అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు.

5 ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది. 6 ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరు వేరు రంగుల పాల రాయి పరచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి.

7 అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్రా దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు. 8 ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. 9 వష్తి రాణి కూడా అహష్వేరోషు రాజ భవనంలో స్త్రీలకు విందు చేసింది.

10 ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 11 అక్కడ సమావేశమైన ప్రజానీకానికి, అధిపతులకు వష్తి రాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజ కిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి.

12 వష్తి రాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలి పోయాడు. 13 కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక. 14 కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను అనే ఏడుగురు అతనికి సన్నిహితంగా ఉండిన వారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానాల్లో ఉన్న పారసీకుల, మాదీయుల ఏడుగురు ప్రధానులు వీరే. 15 రాజు “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వష్తి రాణి లోబడ లేదు కాబట్టి చట్ట పరిధిలో ఆమెను ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.

16 మెమూకాను రాజు ఎదుటా ప్రధానుల ఎదుటా ఇలా జవాబిచ్చాడు. “వష్తి రాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థానాలన్నిటిలోని అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది. 17 స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే, ‘అహష్వేరోషు రాజు తన రాణి వష్తిని తన సన్నిధికి పిలుచుకు రావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు. 18 పారసీక, మాదీయ అధిపతుల భార్యలు రాణి చేసినది విని, రాణి పలికినట్టే ఈ రోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి.

19 రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వష్తి కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి. 20 రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యమంతటా ప్రకటించినట్టయితే, ఘనురాలు గానీ అల్పురాలు గానీ స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు.”

21 ఈ సలహా రాజుకీ అధికారులకీ నచ్చింది. కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు. 22 ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.

2:1 ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరవాత అతడు వష్తిని గురించీ ఆమె చేసిన పని గురించీ ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు.

2 రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు. “రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి. 3 లావణ్యవతులైన కన్యలను సమకూర్చడం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకు వచ్చిన కన్యలను షూషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే ఆధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి. 4 ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమె వష్తికి బదులుగా రాణి అవుతుంది.” ఈ మాట రాజుకు నచ్చింది. అతడు అ విధంగా చేశాడు.

5 షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు. 6 బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు. 7 అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు.

8 రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు. 9 ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు.

10 తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు. 11 ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.

12 ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది. 13 రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు.

14 సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు.

15 మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది.